కిషన్‌రెడ్డి సొంత డివిజన్‌‌లో బీజేపీ పాగా

ABN , First Publish Date - 2020-12-06T13:16:15+05:30 IST

అంబర్‌పేట నియోజకవర్గంలో ఊహించని ఫలితాలు వచ్చాయి

కిషన్‌రెడ్డి సొంత డివిజన్‌‌లో బీజేపీ పాగా

  • రెండు సీట్లకే పరిమితమైన టీఆర్‌ఎస్‌

హైదరాబాద్/బర్కత్‌పుర : అంబర్‌పేట నియోజకవర్గంలో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ మూడు సీట్లను సాధించి పాగా వేయగా టీఆర్‌ఎస్‌ రెండు డివిజన్లలో మాత్రమే విజయం సాధించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సొంత డివిజన్‌ కాచిగూడలో బీజేపీ అభ్యర్థి 7,989 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ సొంత డివిజన్‌ గోల్నాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దూసరి లావణ్యగౌడ్‌ 2,716 ఓట్లతో విజయం సాధించి తమ పట్టును నిలుపుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ముగ్గురు కొత్త అభ్యర్థులను పోటీలో నిలపగా రెండు సీట్లను గెలవడం గమనార్హం. సిట్టింగ్‌ కార్పొరేటర్లు ఇద్దరు ఓడిపోయారు. బీజేపీ నుంచి కాచిగూడ డివిజన్‌లో కన్నె ఉమాదేవి, నల్లకుంట డివిజన్‌ నుంచి వై.అమృత, బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ నుంచి బి.పద్మావతిరెడ్డిలు విజయం సాధించారు.


టీఆర్‌ఎస్‌ నుంచి అంబర్‌పేట డివిజన్‌ విజయకుమార్‌గౌడ్‌, గోల్నాక డివిజన్‌ నుంచి దూసరి లావణ్యగౌడ్‌లు విజయం సాధించారు. 2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అయిదు డివిజన్లను కైవసం చేసుకున్న విషయం విదితమే. బీజేపీ 1986ను మినహాయిస్తే ఈ నియోజకవర్గంలో మూడు సీట్లను సాధించడం ఇదే మొదటిసారి. 1986లో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో పూర్వ హిమాయత్‌నగర్‌ నియోజకవర్గంలో అయిదు డివిజన్లలో విజయకేతనం ఎగురవేసింది. తిరిగి 34 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ మూడు డివిజన్లలో గెలుపొందడం గమనార్హం. 


1986 తర్వాత ఇదే తొలిసారి

బీజేపీ ఆవిర్భావించిన 40 ఏళ్లల్లో 1986లో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికలను మినహాయిస్తే ప్రస్తుత ఎన్నికల్లో మూడు డివిజన్లలో విజయం సాధించడం ఇదే తొలిసారి. 1986లో పూర్వ హిమాయత్‌నగర్‌ నియోజకవర్గంలో 8 మున్సిపల్‌ డివిజన్లు ఉండేవి. ఆనాడు జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ అంబర్‌పేట, తిలక్‌నగర్‌, కాచిగూడ, బర్కత్‌పుర, నారాయణగూడ డివిజన్లను కైవసం చేసుకుని రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత 2002లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ కేవలం బర్కత్‌పుర డివిజన్‌ మాత్రమే విజయం సాధించింది. 2009లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో కేవలం కాచిగూడ డివిజన్‌లో మాత్రమే బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. 2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. ప్రస్తుతం జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో ఆ పార్టీ కాచిగూడ, నల్లకుంట, బాగ్‌అంబర్‌పేట డివిజన్లలో విజయం సాధించింది.


అంబర్‌పేట, గోల్నాక డివిజన్లలలో బీజేపీ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సొంత డివిజన్‌ కాచిగూడలో బీజేపీ అభ్యర్థి కన్నె ఉమారమే్‌షయాదవ్‌ 7,989 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థులంతా మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలవడం గమనార్హం. బాగ్‌అంబర్‌పేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బి.పద్మావతిరెడ్డి సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 3,790 ఓట్లతో విజయం సాధించగా నల్లకుంట డివిజన్‌ నుంచి పోటీ చేసిన వై.అమృత 3,256 ఓట్ల మెజారిటీతో స్థానిక టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌పై విజయం సాధించింది.


ప్రభావం చూపని టీఆర్‌ఎస్‌, బీజేపీ రెబల్స్‌ అభ్యర్థులు

ప్రస్తుతం జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బీజేపీ నుంచి రెబల్స్‌గా పోటీ చేసిన అభ్యర్థులు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. కానీ రెబల్స్‌ అభ్యర్థులకు 1300 లోపే ఓట్లు రావడం గమనార్హం. కాచిగూడ డివిజన్‌ నుంచి స్థానిక కార్పొరేటర్‌ ఎక్కాల చైతన్య కన్నాకు టికెట్‌ రాకపోవడంతో ఆమె కోడలు ఎక్కాల సరితను టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ అభ్యర్థిగా పోటీలో నిలిపారు. ఇదే డివిజన్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం నాయకురాలు దేవిరెడ్డి విజితారెడ్డి కూడా రెబల్స్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎక్కాల శిరీషకు1298 ఓట్లు మాత్రమే రాగా విజితారెడ్డికి 64 ఓట్లు వచ్చాయి. అదే విధంగా బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ నుంచి బీజేపీ రెబల్‌గా పోటీ చేసిన కంచె సుచరితకు 195 ఓట్లు మాత్రమే వచ్చాయి.


నోటాకు జై కొట్టిన వివిధ డివిజన్ల ప్రజలు

గ్రేటర్‌ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజకవర్గం ప్రజలు నోటాకు జైకొట్టారు. ప్రతి డివిజన్‌లో నోటాకు ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం ఉన్న అభ్యర్థులను తిరస్కరిస్తున్నట్లు ఓటర్లు నోటాకు ఓటు వేశారు. అంబర్‌పేట డివిజన్‌లో 222 ఓట్లు, బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లో 232, హిమాయత్‌నగర్‌ డివిజన్‌లో 123, కాచిగూడ డివిజన్‌లో 193, నల్లకుంట డివిజన్‌లో 288, గోల్నాక డివిజన్‌లో 254 ఓట్లు వేశారు.


నల్లకుంట ప్రజలకు రుణపడి ఉంటా

నల్లకుంట డివిజన్‌ సమగ్రాభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేస్తామని నల్లకుంట బీజేపీ  నూతన కార్పొరేటర్‌ వై.అమృత అన్నారు. నీతి, నిజాయితీతో ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఏకైక లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలే ధ్యేయంగా పనిచేస్తామని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రజలకు రుణపడి ఉంటానని ఆమె అన్నారు. శనివారం నల్లకుంట డివిజన్‌ అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు, నల్లకుంట డివిజన్‌ బీజేపీ అభ్యర్థులు పాతకోటి మహేష్‌, అంబర్‌పేట నియోజకవర్గం బీజేపీ జాయింట్‌ కన్వీనర్‌ ఎం.మధుసూదన్‌యాదవ్‌లతో కలిసి ఆమె మాట్లాడారు.

Updated Date - 2020-12-06T13:16:15+05:30 IST