కొత్త సంవత్సర వేళ ఆంక్షలు ఇవే..
ABN , First Publish Date - 2020-12-31T05:03:04+05:30 IST
కొత్త సంవత్సర వేళ పోలీసులు

హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సర వేళ పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనాల చెకింగ్‌లు, డ్రంకెన్, ర్యాష్ డ్రైవింగ్‌లపై నిఘా, ట్రిపుల్ రైడింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై పోలీసుల నజర్ ఉంటుందని... చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. ఈ నెల 31 - జనవరి 1 మధ్యరాత్రి (గురు-శుక్ర వారం) హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆంక్షలుంటాయని వెల్లడించారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న తెల్లవారు జాము 2గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి. పబ్‌లు, బార్‌ల వద్ద యాజమాన్యాలు మద్యం తాగని డ్రైవర్‌లను అందుబాటులో ఉంచాలి. అలాగే తాగిన మత్తులో వాహనాలు నడపకుండా యాజమాన్యాలే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రైవర్లతో వారిని ఇళ్లకు పంపాలి. నిర్లక్ష్యంగా ఉండే పబ్, బార్‌ల నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకుటారు.
ప్రత్యామ్నాయ మార్గాలు
వీవీ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్, ఎన్‌టీఆర్‌మార్గ్ వచ్చే వాహనాలను ఖైరతాబాద్, రాజ్‌భవన్ వైపు మళ్లిస్తారు.
బీఆర్‌కే భవన్ నుంచి ఎన్‌టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్, లక్డీకాపుల్ వైపు అనుమతిస్తారు.
లిబర్టీ జంక్షన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనదారులు అంబేడ్కర్ విగ్రహం, తెలుగుతల్లి, రవీంద్రభారతి వైపు వెళ్లాలి.
ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనదారులు బడాగణేశ్ ప్రాంతం నుంచి సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, లక్డీకాపుల్ వైపు అనుమతిస్తారు.
మింట్ కాంపౌండ్ లేన్, సెక్రటేరియేట్ వెనక ఉన్న రోడ్‌పై ట్రాఫిక్ అనుమతి ఉండదు.
నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి నుంచి సంజీవయ్య పార్కు వెళ్లే వాహనాలను కర్బలా మైదాన్ నుంచి మినిస్టర్స్ రోడ్ వైపు అనుమతిస్తారు.
సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ క్రాస్‌రోడ్స్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్ వైపు అనుమతిస్తారు.
ట్రావెల్ బస్సులు, లారీలు, భారీ వాహనాలను నగర పరిధిలో అనుమతించరు.