‘న్యూ’ హంగామా.. పబ్‌లు, లాంజ్‌ల్లో కొత్త సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2020-12-31T04:58:34+05:30 IST
న్యూ ఇయర్ వేడుకలకు

రోజువారీ కార్యక్రమాల ముసుగులో నిర్వహణ
‘‘న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదు.. రోజువారీ కార్యక్రమాలు చేసుకోవచ్చు’’ అన్న పోలీసుల స్టేట్‌మెంట్‌లను ఆసరాగా చేసుకుని పబ్/లాంజ్‌ల నిర్వాహకులు వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. రోజువారీ కార్యక్రమాల ముసుగులోనే ఆయా వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరైతే సామాజిక మాధ్యమాల ద్వారా టిక్కెట్ల అమ్మకాలనూ సాగిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అయితే బాహాటంగానే టిక్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక హోటల్స్ ఈసారి గాలా బఫేలు, లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలకే పరిమితం కాగా నగర శివార్లలో మాత్రం కొన్ని కన్వెన్షన్ సెంటర్లు/రిసార్టులలో వేడుకలను చేస్తున్నామని, క్లోజ్డ్ సర్క్యూట్ ఈవెంట్లుగా మాత్రమే చేస్తున్నామంటున్నారు ఈవెంట్ల నిర్వాహకులు.
రూ. 5 వేల కోట్ల వ్యాపారం
దాదాపు 5 వేల కోట్ల రూపాయల వ్యాపారం డిసెంబర్ 31 రాత్రి నగరంలో జరిగేదని ఈవెంట్ మేనేజర్లు చెబుతున్నారు. మద్యం మొదలు డీజేలు, ఆర్టిస్ట్‌లు, లైటెనింగ్, టపాసులు, ఫుడ్, బేవరేజస్... అందరికీ ఈసారి దెబ్బపడింది అని ఓ ఈవెంట్ మేనేజర్ వాపోయారు. ఈవెంట్ నిర్వాహకుల పరిస్థితి ఇలాగుంటే పబ్‌లు, లాంజ్‌లు మాత్రం అనుమతులతో సంబంధం లేకుండా ఈవెంట్లు చేస్తామనే అంటున్నాయి. రాజకీయ పలుకుబడి, పరిచయాలను ఉపయోగిస్తున్నామనే వారు కొందరైతే, రోజువారీ ఈవెంట్ల మాదిరిగానే చేస్తున్నామంటున్నారు మరికొందరు. లేడీస్‌నైట్, బాలీవుడ్ నైట్, రెట్రో నైట్.. ఇలా ఏదో ఒక థీమ్ ప్రతి పబ్/లాంజ్‌లో ఉంది. అదే న్యూ ఇయర్ వేడుకలలోనూ కొనసాగుతుందన్నారు రోడ్ నెంబర్ 36లోని ఓ లాంజ్ మేనేజర్. అధికశాతం పబ్/లాంజ్‌లు తమ సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే విక్రయాలు జరుపుతుండగా, మరికొన్ని పబ్/లాంజ్‌లు మాత్రం నేరుగా టిక్కెటింగ్ వెబ్‌సైట్స్ ద్వారా విక్రయాలు సాగిస్తున్నాయి. ఇక హోటల్స్‌లో అధికశాతం గాలా బఫేలకే పరిమితమయ్యాయి. కొన్ని హోటల్స్‌లో మాత్రం రెగ్యులర్‌గా జరిపే లైవ్ మ్యూజిక్ ఈవెంట్లతోనే సరిపెడుతున్నామని చెబుతున్నారు.
కొవిడ్ నిబంధనలా..?
కరోనా రూపు మార్చుకుందని, నగరంలో కొత్తగా బ్రిటన్ వైరస్ జాడలు కనబడుతున్నాయని వార్తలు వస్తున్నా చాలా మంది నిబంధనలు పాటించడం లేదు. ‘హోటల్స్ లేదంటే పబ్‌లకు వచ్చి మాస్క్ పెట్టుకుంటే వారు ఏం తింటారు, ఏం తాగుతారు. మనం కూడా ఆలోచించాలి’ అంటున్నారు ఓ పబ్ మేనేజర్. తినే/తాగే సమయంలో మాస్కు పక్కన పెట్టడం సరే కానీ మిగిలిన సమయాలలో ఏమిటన్నదే ప్రశ్న. అసలు డ్యాన్స్ ఫ్లోర్లకే అనుమతి లేని చోట విచ్చలవిడిగా డ్యాన్స్‌ఫ్లోర్లు నిర్వహిస్తున్నా చూసీ చూడనట్లుగా పోలీసులు వ్యవహరిస్తుండటమూ నగరంలోనే కనబడుతుందన్నది పార్టీ ప్రియుల మాట. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఓ పబ్‌లాంజ్‌లో జరిగిన క్రిస్మస్ పార్టీని వారు ఉదహరిస్తున్నారు. ఓవర్‌క్రౌడ్... చాలదన్నట్లు లైవ్ మ్యూజిక్... దానికనుగుణంగా డ్యాన్స్‌లు... ఆ రాత్రి రచ్చ మామూలుగా లేదు... అసలు పార్టీ అలా జరిగితే ఏ కరోనా మాత్రం ఏం చేయగలదని వెటకారంగా ప్రశ్నించాడు ఆ పార్టీకి హాజరైన ఓ పార్టీ ప్రియుడు. పలు పబ్‌లలో న్యూ ఇయర్ వేడుకల వేళ తాము నిబంధనలు పాటించడానికే ప్రయత్నించినా పార్టీ ప్రియులు గాడితప్పడం సహజమని, ఆ విషయంలో తామేం చేయలేమన్నారు గచ్చిబౌలిలోని ఓ పబ్ మేనేజర్. ‘‘అసలే నష్టాలలో ఉన్న తమ ఆశ న్యూ ఇయర్ వేడుకలపైనే. ఇవి కూడా జరుపకపోతే నిర్వహణ కష్టం. ఎలాగోలా ఈవెంట్‌ను అన్‌లాక్ మార్గదర్శకాలను అనుసరించి చేయబోతున్నాం. నిబంధనలను అనుసరిస్తామా అని అంటే మీరకూడదు.. మేము చెప్పకూడదు. ఎందుకంటే మీకు తెలిసిందే’ అని నవ్వేశారు.
- హైదరాబాద్‌సిటీ, డిసెంబర్ 30 (ఆంధ్రజ్యోతి)