వికారాబాద్ కాల్పుల ఘటనలో కొత్తకోణం

ABN , First Publish Date - 2020-10-27T18:20:54+05:30 IST

అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది.

వికారాబాద్ కాల్పుల ఘటనలో కొత్తకోణం

హైదరాబాద్ : వికారాబాద్‌ జిల్లాలోని పూడూర్ మండలం, దామగుండం అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ నెల 24న చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఆవు మృతి చెందింది. ఈ ఘటనలో ఇప్పటికే పలు విషయాలు వెలుగుచూడగా.. తాజాగా మరో కొత్త కోణం బయటపడింది. దామగుండంలో ప్రముఖ క్రీడాకారిణి, ఆమె బంధువులకు ఫామ్‌హౌస్‌లు ఉన్నట్లు తేలింది. ఫామ్‌హౌస్ వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఫామ్‌హౌస్ నిర్వాహకులు, సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు.


ఇంతకీ ఎవరు..!?

స్థానికులను కూడా ఫామ్‌హౌస్‌ నిర్వాహకులు బెదిరిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఫామ్‌హౌస్ దరిదాపుల్లోకి పశువులు తీసుకురావొద్దంటూ బెదిరింపులకు పాల్పడుతుంటారని స్థానికులు చెబుతున్నారు. అయితే.. బుల్లెట్ ఏ రివాల్వర్ నుంచి వచ్చిందో అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు బుల్లెట్‌ను సేకరించిన విషయం విదితమే. ఇలా రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తుండటంతో అసలేం జరిగిందో తేల్చాలని పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఎంతసేపూ క్రీడాకారిణి అనే అంటున్నారే తప్ప.. ఇంతకీ ఆ ప్రముఖ క్రీడాకారిణి ఎవరు..? ఆమె తెలంగాణకు చెందినవారా..? కాదా..? ఈ ఘటనకు పాల్పడిందెవరు..? అనే విషయాలపై మాత్రం ఎవరూ నోరు మెదపట్లేదు.

Updated Date - 2020-10-27T18:20:54+05:30 IST