నేపాల్‌ ముఠా.. పోలీసుల వ్యూహానికి ఠా..!

ABN , First Publish Date - 2020-10-13T08:20:23+05:30 IST

నేపాల్‌ దేశం కైలాలీ జిల్లాకు చెందిన జానకి రెండు నెలల క్రితం రాయదుర్గం పరిఽధిలోని బోర్‌వెల్‌ వ్యాపారి మధుసూదన్‌రావు ఇంట్లో వంట మనిషిగా చేరింది. నమ్మకంగా పనిచేసి అతితక్కువ

నేపాల్‌ ముఠా.. పోలీసుల వ్యూహానికి ఠా..!

 చాకచక్యంగా అరెస్ట్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసులు

 దేశ సరిహద్దుల్లో కాపుకాసి  ఆట కట్టు 

 భారీ చోరీలే లక్ష్యంగా దేశంలోకి చొరబడుతున్న దొంగలు

 ముగ్గురి అరెస్టు, రూ. 20 లక్షల సొత్తు స్వాధీనం


రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇటీవల భారీ చోరీకి పాల్పడిన నేపాల్‌ దొంగల ముఠా ఆట కట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. దొంగల కంటే ముందే భారత్‌-నేపాల్‌ సరిహద్దుకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 5.2లక్షల నగదు, 300 గ్రాముల బంగారం సహా మొత్తం రూ. 20 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. 


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 12 (ఆంధ్రజ్యోతి) : నేపాల్‌ దేశం కైలాలీ జిల్లాకు చెందిన జానకి రెండు నెలల క్రితం రాయదుర్గం పరిఽధిలోని బోర్‌వెల్‌ వ్యాపారి మధుసూదన్‌రావు ఇంట్లో వంట మనిషిగా చేరింది. నమ్మకంగా పనిచేసి అతితక్కువ సమయంలోనే యజమానుల నమ్మకాన్ని చురగొంది. ఈ నెల 5న భోజనంలో మత్తుమందు కలిపి అందరికీ వడ్డించింది. వారంతా భోజనం చేసి మత్తులోకి జారుకున్నారు. మధుసూదన్‌రెడ్డి భార్య శైలజారెడ్డి మాత్రం భోజనం చేయలేదు. దాంతో జానకి ఆమెకు బ్లాక్‌టీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. టీ రుచిగా లేకపోవడంతో ఆమె కొద్దిగా మాత్రమే తాగింది. దీంతో శైలాజారెడ్డి మత్తులోకి జారుకోలేదు.


అనంతరం జానకి నేపాల్‌ ముఠా సభ్యులకు సమాచారం అందించింది. వెంటనే ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. శైలాజారెడ్డిని కొట్టి, కళ్లకు గంతలు కట్టి, తాళ్లతో కట్టేశారు. అరిస్తే ఆమె కొడుకును చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత మిగిలిన ముఠా సభ్యులు ఇంట్లోకి చొరబడి నగదు, బంగారం సహా మొత్తం రూ. 50 లక్షల సొత్తును దోచుకొని ఉడాయించారు. ఆ ముఠా వెళ్లిపోయిన తర్వాత ఎలాగోలా బయటపడ్డ శైలాజారెడ్డి పక్కింటి వాచ్‌మన్‌ సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి బాఽధితులను ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు.
నేపాల్‌ సరిహద్దుకు...

భారీ చోరీ సమాచారం అందుకున్న సీపీ సజ్జనార్‌ వెంటనే మాదాపూర్‌ ఎస్‌వోటీ సహా పది పోలీస్‌ బృందాలను రంగంలోకి దింపారు. గుజరాత్‌, బిహార్‌, యూపీ, ఢిల్లీ ఇలా ఒక్కో టీమ్‌ ఒక్కో ప్రాంతానికి పంపించారు. బృంద సభ్యులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ గాలింపు ముమ్మ రం చేశారు. రెండు బృందాలు దొంగల కంటే ముందే భారత్‌-నేపాల్‌ దేశ సరిహద్దులోకి చేరుకున్నాయి. నిందితులపై నిఘా ఉంచాయి. అప్పటికే సీపీ సజ్జనార్‌ ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ పోలీస్‌ ఉన్నతాధికారులతో మాట్లాడారు. పాలియా బార్డర్‌లోని ఎస్‌బీ కమాండెంట్‌లతో మాట్లాడారు.


లక్నో అడిషనల్‌ డీజీ సత్యనారాయణ సబాత్‌, ఎస్‌టీఎఫ్‌ ఐజీ అమితాబ్‌ యష్‌, సితార్‌ జిల్లా ఎస్పీ విజయ్‌దుల్‌, లఖింపూర్‌ ఎస్పీ రాజ్‌వీర్‌, బెహర్జీ ఎస్పీ విపిన్‌ కుమార్‌ మిశ్రా, ఉత్తరాఖండ్‌ చంపావత్‌ ఎస్పీ లోకేశ్వర్‌ సింగ్‌, ఎస్‌ఎస్‌బీ ఐజీ అమిత్‌ సౌరభ్‌ త్రిపాఠి, పాలియా బార్డర్‌ కమాండెంట్‌ అమిత్‌ సింగ్‌ సైబరాబాద్‌ పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. 


గ్యాంగ్‌ లీడర్‌ నేత్ర.. 

నేపాల్‌ దొంగల ముఠా లీడర్‌ నేత్ర బహదూర్‌ సాహి అలియాస్‌ నేత్ర.. ఇతనిది నేపాల్‌ దేశం కైలాలీ జిల్లా. బతుకుదెరువు కోసం నేపాల్‌ నుంచి భారత్‌కు వచ్చి వివిధ నగరాల్లో వంటవాళ్లుగా, పనివాళ్లుగా, సెక్యూరిటీ గార్డులుగా చేరిన వారి డేటాను సేకరిస్తాడు. ఖరీదైన, ధనవంతుల ఇళ్లలో పనిచేస్తున్న వారి వివరాలను లిస్టవుట్‌ చేస్తాడు. ఫోన్‌ నంబర్‌లు తీసుకుని పరిచయం చేసుకుంటాడు. ‘‘మీరు పనిచేస్తున్న ఇళ్లలో దొంగతనాలు చేద్దాం. ఒకేసారి రూ. కోట్ల విలువైన సొత్తును చోరీ చేసి బయటపడితే చాలు. కష్టాలు  తీరిపోతాయి. మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేను ప్లాన్‌ చేస్తాను. రాత్రికి రాత్రే కోటీశ్వరులం కావొచ్చు’’ అని నమ్మిస్తాడు.


దొంగతనం కోసం ఏం చేయాలో వారికి వివరిస్తాడు. వారికి ముందుగానే కొంతమొత్తంలో అడ్వాన్స్‌ ఇచ్చి ఒప్పిస్తాడు. అతనితో కమిట్‌ అయిన నేపాలీలు నేత్ర చెప్పిన విధంగానే  పనిచేసే చోట ఇంటి యజమానులను కొద్దిరోజుల్లోనే బాగా నమ్మిస్తారు. అవకాశం చిక్కగానే భోజనంలో మత్తుమందు కలిపేస్తారు. ఇంటి సభ్యులు మత్తులోకి జారుకోగానే గ్యాంగ్‌ లీడర్‌ నేత్రకు పనివాళ్లు సమాచారం ఇస్తారు. నేత్ర ముఠా సభ్యులు రంగంలోకి దిగి ఆ ఇంటిని గుల్ల చేసి రూ. కోట్లలో సొత్తును కొల్లగొడతారు. పోలీసులకు చిక్కకుండా తలోదిక్కున బయల్దేరి దర్జాగా దేశం దాటేసి నేపాల్‌కు చేరతారు.


ఈ ఏడాది జనవరిలో నార్సింగ్‌ పరిధిలో జరిగిన భారీచోరీ కూడా నేపాల్‌ ముఠా చేసినదే అని పోలీసులు గుర్తించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో నేత్ర,  ప్రకాశ్‌ సాహి అలియాస్‌ ప్రకాశ్‌, సీతా లావర్‌ ఉన్నారు. మరో ఆరుగురు ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. వారికోసం రెండు పోలీస్‌ బృందాలు అక్కడే ఉన్నట్లు సీపీ తెలిపారు. 


రివార్డులు

 ఎంతో చాకచక్యంగా బార్డర్‌లో మకాం వేసి నేపాల్‌ ముఠాను పట్టుకున్న మాదాపూర్‌ ఇన్‌చార్జి డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ సందీప్‌, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ బృందాన్ని సీపీ అభినందించి అందరికీ రివార్డులు అందజేశారు.  

Updated Date - 2020-10-13T08:20:23+05:30 IST