నండూరి ఎంకి పాటలు ఒక పెద్ద సంచలనం
ABN , First Publish Date - 2020-12-17T07:26:39+05:30 IST
భావ కవితాయుగంలో నండూరి ఎంకి పాటలు పెద్ద సంచలనం సృష్టించాయని తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు

చిక్కడపల్లి, డిసెంబర్16(ఆంధ్రజ్యోతి): భావ కవితాయుగంలో నండూరి ఎంకి పాటలు పెద్ద సంచలనం సృష్టించాయని తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. నండూరి వెంకట సుబ్బరావు జయంతి సభ బుధవారం త్యాగరాయ గానసభలో గానసభ ఆధ్వర్యంలో కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దేవులపల్లి ప్రభాకరరావు మాట్లాడుతూ ఈ ఎంకి పాటల రచన కావ్యమే నండూరి సుబ్బారావు కీర్తిని చిరస్థాయిగా నిలిపిందన్నారు. ఎంకి పాటల మొదటి ముద్రణ 1925లో వచ్చిందన్నారు. ఎంకి పాటలు ఆత్మాశ్రయరీతిలో నడిచిన 34 గేయాల సంపుటి అని జానపదులైన ఎంకి, నాయుడు బావల ప్రేమ, వివాహం, దాంపత్యజీవితం, వివిధ దశలలో వారి ప్రణయం, ధర్మశృంగారం దీనిలో వర్ణించారన్నారు. జానపనద బాణీల్లో గేయాలు సాగాయని భావం, భాష సమతూకంగా నడిచాయన్నారు. అడవి బాపిరాజు ఈ గేయ భావాలకు చిత్రాలు సమకూర్చారని ఈ పాటలను పారంపల్లి రామకృష్ణయ్య స్వరకల్పన చేశారన్నారు. రెండో ముద్రణ రచనను భావరాజు వెంకట సుబ్బారావుకు అంకితం చేశారని దీనిలో 43 పాటలు కొత్తగా చేర్చారన్నారు. ప్రముఖ సాహితీవేత్త, విశ్వసాహితి అధ్యక్షులు డా.బి.జయరాములు మాట్లాడుతూ ఎంకి పాటలను అనుసరిస్తూ లచ్చిపాటలు, కాపు పాటలు, లంబాడిపాటలు, మల్లిపాటలు అంటూ అనేకం వెలువడ్డాయని గొల్లపాటలు, కోడిపాటలు, విస్కీపాటలు, చల్‌మోహనరంగ పాటలూ ప్రచారంలోకొచ్చాయన్నారు. ఎంకి పాటలపై వివాదాలు, విమర్శలు వచ్చి పెద్ద దుమారం రేపిందన్నారు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు నండూరి సుబ్బారావు 1917-18 మధ్య ఎంకి పాటలు రాశారని గోదావరి, విశాఖ జిల్లాల మాండలికం ఈ పాటల్లో కనిపిస్తుందన్నారు. ఈ సమావేశంలో గానసభ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.