రెచ్చిపోతున్న అల్లరిమూకలు

ABN , First Publish Date - 2020-09-29T07:42:08+05:30 IST

అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నావని అడిగినందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొడుకు అరాచకాలను

రెచ్చిపోతున్న అల్లరిమూకలు

అల్లరిమూకల చేష్టలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. . రౌడీలు...చిన్నచిన్న కారణాలకే రెచ్చిపోయి ఎదుటివారిపై దాడులకు పాల్పడుతున్నారు. యువతిని ఎందుకు వేధిస్తున్నావని అడిగినందుకు కుత్బుల్లాపూర్‌లో ఓ యువకుడిని హత్య చేశారు. ఆల్విన్‌ కాలనీలో తమ వాహనానికి సైడ్‌ ఇవ్వలేదని ఆకతాయిలు ఇద్దరు యువకులపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు.


కుత్బుల్లాపూర్‌లో యువకుడి హత్య..అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నావని అడిగినందుకు...


జీడిమెట్ల, సెప్టెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి) : అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నావని అడిగినందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొడుకు అరాచకాలను అడ్డుకోవాల్సిన తండ్రే కత్తితో దాడిచేసి హత్యకు పూనుకోవడం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తీవ్ర సంచలనం రేపింది. కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలోని భాగ్యలక్ష్మీ కాలనీకి చెందిన కృష్ణ కుమార్తె ఎం.పావని (28) స్టాఫ్‌ నర్స్‌గా పనిచేస్తోంది. సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో తన సోదరుడు పవన్‌తో కలిసి బైక్‌పై ఆమె విమానపురి కాలనీకి వెళుతోంది. అదే సమయంలో విమానపురి కాలనీకి చెందిన సందీప్‌ అనే ఆకతాయి కుత్బుల్లాపూర్‌ ప్రభుత్వ పాఠశాల వద్దకు రాగానే అన్న, చెల్లెలు ప్రయాణిస్తున్న బైక్‌ను ఓవర్‌టేక్‌ చేస్తూ పావనిని ఈవ్‌టీజింగ్‌ చేశాడు. వేగంగా ప్రయాణిస్తున్న సందీప్‌ను ప్రశ్నించడానికి యత్నించగా వాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు. అన్న, చెల్లెలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సందీప్‌ తన చెల్లెలిని వేధిస్తున్నాడన్న విషయాన్ని విమానపురి కాలనీకి చెందిన డ్రైవర్‌ అబ్బగోని సురేష్‌గౌడ్‌ (30)కి పవన్‌ చెప్పాడు. ఎందుకు తన స్నేహితుడి చెల్లెలిని వేధిస్తున్నావని అడగడానికి సురేష్‌గౌడ్‌ సందీప్‌ ఇంటికి వెళ్లాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తన కొడుకుపై దాడికి వచ్చాడని సందీప్‌ తండ్రి విజయ్‌బోస్‌ (52) ఇంట్లోని కత్తితో సురేష్‌గౌడ్‌ కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సురేష్‌గౌడ్‌ను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


వాహనానికి సైడ్‌ ఇవ్వలేదని...ఇద్దరు యువకులపై దాడి

జీడిమెట్ల : జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆల్విన్‌కాలనీలో గ్యాస్‌ సరఫరా చేసే ఇద్దరు యువకులపై దాడి జరిగింది. ఇండియన్‌ గ్యాస్‌ సంస్థలో డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న సతీష్‌, శాంతి అనే ఇద్దరు యువకులపై ఆల్విన్‌కాలనీ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొందరు యువకులు కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. ఆకతాయిల వాహనానికి సైడ్‌ ఇవ్వలేదన్న కారణంగానే ఈ యువకులపై దాడి చేసినట్టు జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డి తెలిపారు. ఈ సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-09-29T07:42:08+05:30 IST