మార్కెట్‌లో మర్డర్
ABN , First Publish Date - 2020-12-27T06:36:31+05:30 IST
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో దొంగతనాల విషయంలో తలెత్తిన వివాదం, పాత నేరస్థుడి హత్యకు దారితీసింది.

దొంగతనం విషయంలో వివాదం
అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు
వేకువజామున హత్య
మూడు నెలల ముందే హెచ్చరించిన ‘ఆంధ్రజ్యోతి’
దిల్‌సుఖ్‌నగర్, డిసెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో దొంగతనాల విషయంలో తలెత్తిన వివాదం, పాత నేరస్థుడి హత్యకు దారితీసింది. తనకు ప్రాణహాని ఉందంటూ అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తే.. ప్రత్యర్థిని హతమార్చాడు. ఈ ఘటనకు సంబంధించి చైతన్యపురి పోలీసులు, మార్కెట్ వర్గాల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
మేడ్చల్ జిల్లా మల్లాపూర్ సింగారం తండాకు చెందిన రాజ్ బహుదూర్ అలియాస్ నేపాల్ (31) కొంతకాలంగా కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో కూలీగా పని చేస్తున్నాడు. ఇతను మరికొందరితో కలిసి మార్కెట్ యార్డులోని ఫ్లాట్‌ఫాంల నుంచి అర్ధరాత్రి సమయంలో పండ్లు దొంగతనం చేసేవాడు. ఈ కేసులో గత నెల 23న చైతన్యపురి పోలీసులు రాజ్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా రాజ్ దొంగతనాలు మానలేదు. మార్కెట్‌లో కూలీగా పని చేస్తున్న ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన మహ్మద్ ఫిరోజ్ (27) రాత్రి సమయాల్లో నాలుగైదు దుకాణాలకు వాచ్‌మన్‌గా కూడా పనిచేస్తున్నాడు. ఫిరోజ్ మూలంగానే తన చోరీల గుట్టు పోలీసులకు తెలిసిందని రాజ్ కొన్ని రోజులుగా అతనిపై ఆగ్రహంగా ఉన్నాడు.
అర్ధరాత్రి పోలీ్‌సస్టేషన్‌కు..
అతిగా మద్యం సేవించిన రాజ్ శుక్రవారం రాత్రి మార్కెట్‌కు వచ్చి రెండో ఫ్లాట్‌పాం వద్ద ఉన్న ఫిరోజ్‌తో గొడవకు దిగాడు. చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఫిరోజ్ రాత్రి 12.15 గంటల సమయంలో చైతన్యపురి పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి, బెదిరింపుల విషయాన్ని వివరించాడు. ఈలోగా రాజ్ కూడా పోలీ్‌సస్టేషన్‌కు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న రాజ్‌కు డ్రంకెన్ టెస్ట్ చేయగా, 420 ఎంజీ వచ్చింది. దీంతో రాజ్‌ను పోలీసులు స్టేషన్‌లోనే ఉంచారు. ఫిరోజ్ మార్కెట్‌కు తిరిగివచ్చాడు. కొద్దిసేపటి తర్వాత మహ్మద్ ఖమర్ అనే వ్యక్తి వచ్చి, మాట్లాడుకుని గొడవలు లేకుండా చూసుకుంటామని, రాజ్‌ను వదిలి పెట్టాలని పోలీసులను కోరాడు. ఖమర్ పూచీకత్తుపై రాజ్‌ను పోలీసులు అతడితో పంపించారు.
కత్తితో గొంతు కోసి...
పోలీ్‌సస్టేషన్ నుంచి వచ్చిన రాజ్, మరో ఇద్దరితో కలిసి రాత్రి 2 గంటల సమయంలో మార్కెట్ యార్డ్‌కు వెళ్లాడు. రెండో ఫ్లాట్‌ఫాంలో కూర్చొని వారంతా మద్యం తాగారు. ఈ క్రమంలో రాజ్, ఫిరోజ్ మధ్య మళ్లీ వివాదం మొదలైంది. ఈ ఘర్షణలో నిందితులు కత్తితో రాజ్ గొంతు కోసి, ఛాతీలో పొడిచి వెళ్లిపోయారు. దీంతో రాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ రవికుమార్, మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
పోలీసుల అదుపులో నిందితులు..
నిందితులు ఫిరోజ్‌తో పాటు మరొకరిని చైతన్యపురి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివాదం జరిగిన సమయంలో మొదట రాజ్.. ఫిరోజ్‌ను చంపుతానని తన దగ్గర ఉన్న కత్తి తీసినట్లు సమాచారం. దీంతో ఫిరోజ్, అతడి స్నేహితులు ఆ కత్తి లాక్కొని రాజ్‌పై దాడి చేసినట్లు తెలిసింది. మార్కెట్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రాజ్, ఫిరోజ్, మరో ఐదుగురు ఫ్లాట్‌ఫాం మీదకు వెళ్తున్న, అక్కడ మాట్లాడుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చోరీల గుట్టురట్టు చేసినందుకే గొడవ జరిగిందా? లేక ఇంకా వేరే కారణాలు ఏమైౖనా ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.
ముందే హెచ్చరించిన ‘ఆంధ్రజ్యోతి’
గడ్డిఅన్నారం మార్కెట్‌లో దొంగలు హల్‌చల్ చేస్తూ, ముఠాగా ఏర్పడి కత్తులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, రోజూ సుమారు రూ. 2 లక్షల విలువైన పండ్లను చోరీ చేస్తున్నారని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ముందే హెచ్చరించింది. ఈ మేరకు ‘మార్కెట్‌లో దొంగలు పడ్డారు..!’ శీర్షికన సెప్టెంబర్ 20న కథనం ప్రచురించింది. మార్కెట్ పాలకవర్గం, అధికారులు, పోలీసులు మార్కెట్‌లో భద్రతా చర్యలు చేపట్టకుంటే మున్ముందు ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని ఆ కథనంలో హెచ్చరించినట్లే.. శనివారం ఘటన జరిగింది.