మునిసిపల్‌ బోర్డు నుంచి గ్రేటర్‌ దాకా..

ABN , First Publish Date - 2020-11-19T12:06:26+05:30 IST

పురపాలక శాఖను నగరంలో పరిచయం చేస్తూ

మునిసిపల్‌ బోర్డు నుంచి గ్రేటర్‌ దాకా..

  • కార్పొరేషన్‌ ప్రస్థానమిది 
  • 2007లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు
  • 2014లో  రాష్ట్ర అవతరణ 
  • 2016లో గ్రేటర్‌ ఎన్నికలు

హైదరాబాద్‌ : 1869లో పురపాలక శాఖను నగరంలో పరిచయం చేస్తూ నిజాం హయాంలో హైదరాబాద్‌ మునిసిపల్‌ బోర్డు, చాదర్‌ఘట్‌ మునిసిపల్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. 1933లో చాదర్‌ఘాట్‌ మునిసిపాలిటీని హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. 1934లో మొదటిసారి ఎన్నికలు నిర్వహించడంతోపాటు స్టాండింగ్‌ కమిటీని నియమించారు. 1937లో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాలతో జూబ్లీహిల్స్‌ మునిసిపాలిటీ ఏర్పాటైంది. 1942లో జూబ్లీహిల్స్‌ మునిసిపాలిటీకి కార్పొరేషన్‌ హోదా రద్దు చేసి.. అదే సంవత్సరం సికింద్రాబాద్‌ మునిసిపాలిటీ ఏర్పాటుచేశారు.


1950లో రద్దయిన జూబ్లీహిల్స్‌ మునిసిపాలిటీని హైదరాబాద్‌ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. 1955లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ కార్పొరేషన్లను విలీనం చేస్తూ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఎంసీహెచ్‌)ను ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం మునిసిపాలిటీ చట్టం(1955) రూపొందించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అనంతరం హైదరాబాద్‌ రాష్ట్ర రాజధానిగా మారింది. 1955లో ఎంసీహెచ్‌ ఏర్పడింది. శివార్లలోని 12మునిసిపాలిటీలను విలీనంచేస్తూ 2007లో జీహెచ్‌ఎంసీనిఏర్పాటు చేశారు. 13ఏళ్లలో ఇవి మూడోఎన్నికలు.2009లో ఉమ్మడిరాష్ట్రంలో జరిగినఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు ఒప్పందంలో భాగంగా మేయర్‌ పీఠాన్ని పంచుకున్నాయి.


ఫిబ్రవరి 10 వరకు ప్రస్తుత పాలకమండలే..

2014 జూన్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా.. ప్రత్యేక రాష్ట్రంలో గ్రేటర్‌ ఎన్నికలు 2016లో జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 99 డివిజన్లలో విజయం సాధించి రికార్డు సృష్టించింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే పార్టీ బల్దియా పీఠం కైవసం చేసుకుంది. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2021 వరకు ఉంది. చట్టంలోని వెసులుబాటు ఆధారంగా ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్నా.. ఇప్పటి పాలకమండలి ఫిబ్రవరి 10 వరకు కొనసాగనుంది. ఆ తర్వాతే కొత్త పాలకమండలి కొలువు దీరుతుంది. 

Updated Date - 2020-11-19T12:06:26+05:30 IST