నెల రోజులు రేషన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2020-04-12T09:32:51+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరవాసులెవ్వరూ ఆకలితో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రేషన్‌ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

నెల రోజులు రేషన్‌ పంపిణీ

గ్రేటర్‌లో 4.24లక్షల లబ్ధిదారులకు అందజేత

కోటా అయిపోయిన షాపులకు మరింత కోటా

గోడౌన్‌లో 3వేల టన్నుల రేషన్‌ అందుబాటులో


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌11 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరవాసులెవ్వరూ ఆకలితో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రేషన్‌ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రేషన్‌ దుకాణాలు గతంలో మాదిరిగా వారం రోజుల్లో 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉండకుండా నెల రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.


ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని నగరంలోని ఏ రేషన్‌ దుకాణం నుంచైనా ఈనెల చివరి వరకు అందజేయనున్నారు. గ్రేటర్‌ పరిధిలోని రేషన్‌ దుకాణాలకు ప్రతి నెలా అందిస్తున్న రేషన్‌ కోటా ఈసారి రెండింతలు సరఫరా చేసినా పలు రేషన్‌ దుకాణాల్లో నో స్టాక్‌ బోర్డు పెట్టారు. బియ్యం కోటా అయిపోయిన రేషన్‌ దుకాణాలకు మలివిడత కోటాను అందజేశామని, బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సివిల్‌ సప్లయ్‌ అధికారులు చెబుతున్నారు.



గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 668 రేషన్‌ దుకాణాలు ఉండగా, రేషన్‌ కార్డు కలిగిన లబ్ధిదారులు 5.80లక్షల మంది ఉన్నారు. కొవిడ్‌-19ను అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ సందర్భంగా రేషన్‌ కార్డు కలిగిన లబ్ధిదారుల కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి 12కిలోల చొప్పున బియ్యం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఏప్రిల్‌ మొదటి వారంలోనే బియ్యం పంపిణీ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి బియ్యం పంపిణీ జరుగుతుండడంతో నగరంలోని రేషన్‌ దుకాణాల్లో సర్వర్‌డౌన్‌ సమస్య తలేత్తింది. దీంతో లబ్ధిదారులు రేషన్‌ దుకాణాల వెంట తిరిగిన పరిస్థితి. ఎన్నో ఆపసోపాలు పడి ఆయా రేషన్‌ దుకాణాల వద్ద జనాలు బారులు తీరగా, ఇప్పటి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 9 సర్కిళ్ల పరిధిలో 4.24లక్షల మంది రేషన్‌ కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ శనివారం సాయంత్రం వరకు జరిగిన్నట్లు అధికారులు తెలిపారు.


ఏపీ కార్డుదారులకు అక్కడి కోటా ప్రకారమే..

రేషన్‌ పోర్టబులిటీ ప్రకారం తెలంగాణలోని ఏ జిల్లావాసులైనా రేషన్‌ బియ్యాన్ని నగరంలోని రేషన్‌ దుకాణాల్లో తీసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ సాగుతోంది. నగరంలోని 5.80లక్షల రేషన్‌ కార్డులే గాకుండా ప్రతి నెలా అదనంగా లక్షకు పైగా రేషన్‌ కార్డులు వస్తాయి.


లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారందరికీ రేషన్‌ ప్రభుత్వ నిర్ణయం మేరకు రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. ఏపీలో రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాలు హైదరాబాద్‌కు బతుకుదెరువుకు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం కూడా కరోనా నేపథ్యంలో రేషన్‌ కార్డు కలిగిన కుటుంబంలోని ఒక్కరికీ పది కిలోల చొప్పున బియ్యం అక్కడా అందిస్తోంది. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ కుటుంబాలు కూడా పోర్టబులిటీ ప్రక్రియ ద్వారా నగరంలోని రేషన్‌ షాపుల్లో ఏపీ కోటా ప్రకారం బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పించామని అధికారులు చెబుతున్నారు.


కోటా అయిపోయిన షాపులకు మరింత కోటా

గతంలో ప్రతి నెలా ఒక్కో కుటుంబానికి ఇచ్చే రేషన్‌ బియ్యం కంటే ప్రస్తుతం డబుల్‌ పంపిణీ చేస్తుండడంతో నగరంలోని రేషన్‌ షాపులకు సరఫరా చేసిన బియ్యం కోటా మొత్తం పలు షాపుల్లో అయిపోయింది. అధిక కోటా సరఫరా చేసిన రేషన్‌ దుకాణాల్లోనూ బియ్య నిల్వలు లేవు. దీంతో రేషన్‌ బియ్యానికి దుకాణాలకు వచ్చే లబ్ధిదారులకు నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సివిల్‌ సప్లయ్‌ అధికారులు మరింత కోటా బియ్యాన్ని ఆయా రేషన్‌ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 668 రేషన్‌ దుకాణాల్లో 2500 టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.


గోడౌన్‌లలో 3వేల టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నాయని, ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా హమాలీలు పని చేస్తూ బియ్యాన్ని దుకాణాలకు తరలించడం, గోడౌన్‌లలో దించుకునే ప్రక్రియను చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. నగరంలోని ప్రతి రేషన్‌కార్డు లబ్ధిదారుడికీ బియ్యం అందిస్తామని, రేషన్‌ దుకాణానికి వచ్చే ఏ రేషన్‌కార్డు లబ్ధిదారుడు ఖాళీ చేతులతో తిరిగి వెనక్కి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇక నుంచి రేషన్‌ దుకాణాల వద్ద నోస్టాక్‌ బోర్డులు పెట్టకుండా ఏరోజు స్టాక్‌ వస్తుందో.. ఏ సమయంలో పంపిణీ జరుగుతుందో సమాచారాన్ని పెడుతామని చెబుతున్నారు.

Updated Date - 2020-04-12T09:32:51+05:30 IST