వ్యాపార హడావిడిలో జాగ్రత్తలు మరిచాను

ABN , First Publish Date - 2020-07-05T09:45:46+05:30 IST

వ్యాపార హడావిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాలికొదలడంతో కరోనా సోకింది.

వ్యాపార హడావిడిలో జాగ్రత్తలు మరిచాను

గాంధీలో అన్ని వయస్సుల వారిని చూసి  ధైర్యం తెచ్చుకున్నా..

కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయిన మహ్మద్‌


హైదరాబాద్‌ సిటీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): వ్యాపార హడావిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాలికొదలడంతో కరోనా సోకింది. లాక్‌డౌన్‌లో కొంత లాభం కోసం ఆరాటపడి... ఇప్పటి వరకు క్వారంటైన్‌లోనే ఉన్నాను. నెల రోజులు కావస్తోంది షాపు మూసివేసి. మరో రెండు మూడు రోజుల్లో షాపు తెరుస్తాను. ప్రస్తుతం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాను అని పాతబస్తీకి చెందిన ఓ వ్యాపారి మహ్మద్‌(28)(పేరు మార్చాం) ‘ఆంధ్రజ్యోతికి’ తెలిపారు.


లాక్‌డౌన్‌లో వ్యాపారం కోసం..

లాక్‌డౌన్‌ విధించినా కిరాణా వ్యాపారాలకు ఎలాంటి ఆటంకం లేకపోవడం కాస్త ఉపశమనాన్నిచ్చింది. సోదరుడితో కలిసి షాపు తెరిచే వాణ్ని. నేను సరుకులు తేవడానికి బయటకు వెళ్తే, తమ్ముడు షాపులో ఉండి గిరాకీ చూస్తుంటాడు. రోజూ బేగంబజార్‌, ఉస్మాన్‌గంజ్‌, మీరాలంమండి మార్కెట్లలో సరుకులు తెచ్చి మళ్లీ షాపులో కూర్చుండేవాడిని. మార్చి నెలలో లాక్‌డౌన్‌ విధించిన తొలినాళ్లలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. శానిటైజేషన్‌, చేతులకు గ్లౌజులు వేసుకుని తిరిగాను. క్రమంగా కాలం గడుస్తుంటే నిర్లక్ష్యం పెరిగింది. జాగ్రత్తలు కాస్త తగ్గాయి. మాస్కు, శానిటైజేషన్‌ కొనసాగేది... క్రమంగా శానిటైజేషన్‌ కూడా తగ్గింది. 


రంజాన్‌లో భారీ వ్యాపారం

చూస్తుండగానే రంజాన్‌ మాసం వచ్చింది. ప్రతి యేడాది మాదిరిగానే రంజాన్‌ మాసంలో గిరాకీ పెరిగింది. కస్టమర్లు పెరిగారు. నేను వెళ్లకుండా ఆటోల్లో నేరుగా స్టాకు తెప్పించాను. రంజాన్‌ మాసం కూడా గడిచి పోయింది. వ్యాపారం బాగానే జరిగింది. రంజాన్‌ ముగియగానే ప్రశాంతంగా ఉన్న జీవితంలో ఒక్క కుదుపు కనిపించింది. 


పండగ తర్వాత వైరస్‌ లక్షణాలు ..

పండగ తర్వాత మూడో రోజు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు పాటించకున్నా భరోసాతో ఉన్నాను. జ్వరంతో పాటు దగ్గు ప్రారంభమైంది. రెండు రోజులు ఇంట్లోనే భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ గమనించాను. తగ్గే పరిస్థితి కనిపించలేదు. పండగ రేపు ఉందనగా జనం ఎక్కువగా రావడం వల్ల ఏదో కాంటాక్ట్‌ వచ్చి ఉంటుందేమోనని అనుమానించాను. 


స్థానిక ఆస్పత్రి నిర్వాహకులు లోపలికే రానివ్వలేదు

రెండు రోజుల తర్వాత స్థానికంగా ఉన్న ప్రధాన ఆస్పత్రికి వెళ్లాను. వారు లోపలికి రానివ్వడానికే నిరాకరించారు. ఎట్టకేలకు డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ వరకు అనుమతినిచ్చారు. అయినా తృప్తి చెందక, చార్మినార్‌ యునానీ ఆస్పత్రికి చేరుకున్నాను. షాపులో నాతో పాటు ఉన్న సోదరుడి(వేరే ఇంట్లో ఉంటాడు) పరిస్థితి గురించి తెలుసుకున్నాను. నార్మల్‌గానే ఉన్నాడు. యునానీ ఆస్పత్రికి వెళ్లి లక్షణాల గురించి చెబితే వెంటనే కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లగానే అడ్మిట్‌ చేసుకున్నారు. ఆ రాత్రి నమూనాలు సేకరించారు. ఇంట్లోవారికి జాగ్రత్తలు చెప్పి, భయపడొద్దని ధైర్యం చెప్పాను. మరుసటి రోజు పాజిటివ్‌ వచ్చిందనే వార్త విని... కుటుంబం గురించి ఆలోచించసాగాను. నా భార్యకు, ఇద్దరు పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. వారికి నెగెటివ్‌ రావడంతో నాకు పాజిటివ్‌ వచ్చిందనే బాధ కూడా మర్చిపోయి సంతోషపడ్డాను.


గాంధీ ఆస్పత్రిలో ధైర్యం..

గాంధీ ఆస్పత్రికి చేరిన తర్వాత ఎంతో మానసిక ధైర్యం వచ్చింది. నా కన్నా చిన్న వారు, వృద్ధులు కూడా కరోనాతో పోరాడుతున్నారు. వారితో పాటు నేనూ అక్కడే ఉంటూ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ ధైర్యం చెప్పేవాణ్ని. టైమ్‌కు వచ్చే అల్పాహారం, లంచ్‌, డిన్నర్‌తో పాటు రెండు సార్లు టీ ఇచ్చేవారు. ఆహారంతో పాటు వారిచ్చే మాత్రలు చాలా పని చేశాయి. జ్వరం, దగ్గు రెండు రోజులకే తగ్గిపోయాయి. రోజూ వైద్యుడు వచ్చి ఆరోగ్య వివరాలడిగేవారు.


ఆరు రోజులపాటు ఆస్పత్రిలో ఉన్న తర్వాత ఇంటికి వెళతారా అని వైద్యులు అడిగారు. నాకు చిన్న పిల్లలున్నారు సార్‌.. ఇంటికి వెళ్తే వారికి ఇబ్బంది అవుతుందేమోనన్నాను. ఏం కాదు.. భార్యా పిల్లలతో దూరం పాటించాలన్నారు. ఏడో రోజు డిశ్చార్జ్‌ అయి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి 26 రోజులైంది. ఇప్పటికీ పిల్లల దగ్గరికి వెళ్లలేదు. డాక్టర్లు రెండు వారాల పాటు మెయింటెయిన్‌ చేయమన్నా... పిల్లల దృష్ట్యా మరో రెండు వారాలు ఇంట్లోనే రెస్ట్‌ తీసుకున్నాను. మరో రెండు రోజుల్లో తిరిగి వ్యాపారం ప్రారంభిస్తాను.. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. 

Updated Date - 2020-07-05T09:45:46+05:30 IST