అత్యవసర సేవలకు వన్‌స్టాప్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2020-03-04T08:19:05+05:30 IST

అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో బంజారాహిల్స్‌లో రూపొందుతున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌.. పోలీ్‌సతోసహా అన్ని విభాగాలకు సంబంధించి అత్యవసర సేవలకు వన్‌స్టాప్‌ సెంటర్‌గా పనిచేస్తుందని హోంమంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ అన్నారు.

అత్యవసర సేవలకు వన్‌స్టాప్‌ సెంటర్‌

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణ పనులు తుది దశకు

త్వరలో అందుబాటులోకి : హోంమంత్రి మహమూద్‌ అలీ


హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో బంజారాహిల్స్‌లో రూపొందుతున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌.. పోలీ్‌సతోసహా అన్ని విభాగాలకు సంబంధించి అత్యవసర సేవలకు వన్‌స్టాప్‌ సెంటర్‌గా పనిచేస్తుందని హోంమంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ అన్నారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తదితరులతో కలిసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు.


శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. అందులో భాగంగానే పీపుల్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌, పోలీసింగ్‌ ఆధునికీకరణ చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకే ఈ సెంటర్‌ నిర్మాణం చేపట్టారని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా ఈ సెంటర్‌ ద్వారా క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అత్యవసర సమయంలో పోలీసులతోపాటు ఇతర శాఖల అధికారులు త్వరగా ఘటనా స్థలానికి చేరుకొని సహకారం అందిస్తారని తెలిపారు. అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా సెంటర్‌పై హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని.. త్వరలోనే అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.

Updated Date - 2020-03-04T08:19:05+05:30 IST