కుత్బుల్లాపూర్‌లో మొబైల్‌ టాయిలెట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-03T09:26:21+05:30 IST

గ్రేటర్‌ లో జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు మొబైల్‌ టాయిలెట్ల ఏర్పాట్లను మొదటిసారిగా కుత్బుల్లాపూర్‌ ..

కుత్బుల్లాపూర్‌లో మొబైల్‌ టాయిలెట్‌ ప్రారంభం

 సీఎస్‌ఆర్‌లో భాగంగా హెచ్‌ఏఎల్‌ అందజేత

కార్పొరేట్‌ స్థాయిలో ఏర్పాట్లు


కుత్బుల్లాపూర్‌, అక్టోబర్‌ 2(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ లో జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు మొబైల్‌ టాయిలెట్ల ఏర్పాట్లను మొదటిసారిగా కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. సర్కిల్‌ పరిధిలో నిత్యం రద్దీగా ఉండే సుచిత్రా సర్కిల్‌లో దీనిని ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్‌, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమతతో కలిసి ప్రారంభించారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్‌)లో భాగం గా హిందూస్థాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)ను గత జనవరిలో జెడ్సీ మమత మురికివాడల అభివృద్ధి పనులతోపాటు మొబైల్‌ టాయిలెట్లకు నిధులు అం దించాలని కోరగా వారు ముందుకొచ్చారు. దీంతో కార్యరూపం దాల్చిన మొబైల్‌ టాయిలెట్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి.


బస్సు మొబైల్‌ టాయిలెట్ల విశేషాలు

1. ఇది పూర్తిగా బయో టాయిలెట్‌.

2. దీనికి ఎటువంటి డ్రైనేజీ కనెక్షన్‌ అవసరం లేదు. 

3. దీని నుంచి వచ్చే గ్యాస్‌నూ వినియోగించుకునే అవకాశం ఉంది.

4. బస్సుపైన నీటి ట్యాంక్‌ను, కింది భాగంలో బయో గ్యాస్‌ ట్యాంక్‌ను అమర్చారు.

5. బస్సు టాయిలెట్లలో స్త్రీ, పురుషులకు ప్రత్యేకంగా టాయిలెట్లతో పాటు వాష్‌బేసిన్‌లు ఉన్నాయి.

6. కార్పొరేట్‌ కార్యాలయాలు, విమానాశ్రయాలు, తదితర ప్రాంతాల్లో ఉండే టాయిలెట్ల మాదిరిగా అత్యాధునికంగా సౌకర్యాలు కల్పించారు.

7. బస్సులోనే టాయిలెట్ల పక్కన కొంత ప్రదేశంలో చిన్న షాపును (టీస్టాల్‌, బిస్కెట్లు ఇతరాత్రా వస్తువులు విక్రయించుకొనేలా) నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేశారు. 

8. దీనిలో ఒక డ్రైవర్‌, క్లీనర్‌ ఉంటారు. 

9. టాయిలెట్లను పూర్తిగా యంత్రాల ద్వారానే క్లీన్‌ చేస్తారు. 

10. దీన్ని ఎక్కడికి కావాలన్నా నిమిషాల్లో తరలించొచ్చు.

11. జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు గుర్తించి మొబైల్‌ టాయిలెట్‌ను ఉంచుతారు.

12. కాలం చెల్లిన బస్సులు, డొక్కు బస్సులను మొబైల్‌ టాయిలెట్లకు ఉపయోగించవచ్చు.


ప్రస్తుతం వీటి నిర్వహణ బాధ్యతలను జీహెచ్‌ఎంసీ చూస్తున్నప్పటికీ టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు. కూకట్‌పల్లి జోన్‌ పరిధిలో మొత్తం మూడు మొబైల్‌ టాయిలెట్లు ప్రతిపాదనల్లో ఉన్నాయి. అయితే ఒకటి శుక్రవా రం ప్రారంభంగా కాగా, మరో రెండు టాయిలెట్లను త్వరలోనే కూకట్‌పల్లి, మూసాపేట్‌ సర్కిళ్లలో ప్రారంభించనున్నామని జెడ్సీ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.  

Updated Date - 2020-10-03T09:26:21+05:30 IST