‘ఎంఎంటీఎ‌స్’ను వెంటాడుతున్న ప్రమాదాలు

ABN , First Publish Date - 2020-03-21T09:29:28+05:30 IST

అతి తక్కువ ధరతో జంట నగరాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందిస్తున్న మోడ్రన్‌ మల్టీపుల్‌ ట్రైన్‌ సర్వీస్‌ (ఎంఎంటీఎ్‌స)ను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి.

‘ఎంఎంటీఎ‌స్’ను వెంటాడుతున్న ప్రమాదాలు

సిబ్బంది నిర్లక్ష్యమో... యాదృచ్ఛికమో..!?

నాలుగు నెలల్లో రెండు ఘటనలు

హృదయ విదారకంగా ‘కాచిగూడ’ యాక్సిడెంట్‌

తాజాగా హఫీజ్‌పేట వద్ద పట్టాలు తప్పిన రైలు

ఆందోళనకు గురవుతున్న ప్రయాణికులు

రైలెక్కేందుకు వణికిపోతున్న జంట నగరాల ప్రజలు


హైదరాబాద్‌ సిటీ, మార్చి20 (ఆంధ్రజ్యోతి): అతి తక్కువ ధరతో జంట నగరాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందిస్తున్న మోడ్రన్‌ మల్టీపుల్‌ ట్రైన్‌ సర్వీస్‌ (ఎంఎంటీఎ‌స్)ను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. గతంలో ఎంఎంటీఎ్‌సలో హాయిగా ప్రయాణించిన నగరవాసులు ప్రస్తుతం సదరు రైలెక్కాలంటేనే వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో కంటే తక్కువ సమయంలో గమ్యస్థానాలకు వెళ్తున్న ప్యాసింజర్లు వరుస ఘటనలతో హడలిపోతున్నారు. ఇందుకు గత నాలుగు నెలల కాలంలో ఎంఎంటీఎస్‌ రైళ్లలో చోటుచేసుకుంటున్న ప్రమాదాలే నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగర పరిధిలో రోజురోజుకూ పెరిగిపోతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2003 ఆగస్టులో ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టును ప్రారంభించాయి.


ఇందులో భాగంగా 14 కిలోమీటర్ల వరకు పనులు చేపట్టారు. మొదటి కారిడార్‌ కింద ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌-లింగంపల్లి, రెండో కారిడార్‌ కింద లింగంపల్లి-నాంపల్లి, మూడో కారిడార్‌ కింద నాంపల్లి-సికింద్రాబాద్‌ మార్గాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.340 కోట్లు (50-50) బడ్జెట్‌ను కేటాయించాయి. కాగా, 2003లో చేపట్టిన పనులను 2005లో పూర్తి చేశారు. ప్రస్తుతం మొత్తం 125 రైళ్లలో రోజుకు సగటున 1.68 లక్షల మంది నగర శివారు ప్రాంతాల వరకు ప్రయాణిస్తున్నారు.


2012లో రెండో దశ పనులు...

నగర పరిధిలోని ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంఎంటీఎస్‌ మొదటి విడత ప్రాజెక్టు విజయవంతం కావడంతో డి మాండ్‌ బాగా పెరిగింది. ఈ క్రమంలో 2012 సంవత్సరంలో జంట నగరాల్లో ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకుసాగారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అధికారులు రూ.817 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో 2/3 వంతున నిధులు సమకూర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం తన వాటా రెండు శాతం కింద రూ.217 కోట్లు విడుదల చేసింది. అలాగే అదనంగా మరో రూ.217 కోట్లను విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా మొత్తం రూ.544.66 కోట్లలో ఇప్పటివరకు రూ.129 కోట్లను మాత్రమే చెల్లించింది. 


నవంబర్‌లో కాచిగూడ ఘటన...

జంట నగరాల్లో దాదాపు 17 ఏళ్ల నుంచి అన్ని వర్గాల ప్రజలకు సురక్షితమైన రవాణా సేవలందిస్తున్న ఎంఎంటీఎస్‌ కొన్ని నెలలుగా ప్రమాదాల బారిన పడుతోంది. నిమిషాల వ్యవధిలోని నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉన్న రైళ్లు అనుకోని ఘటనలకు గురవుతుండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. 2019 నవంబర్‌ 11న నంబర్‌ ఎంఎంటీఎస్‌(47178) రైలు ఉదయం 9.20 గంటలకు ఫలక్‌నుమాకు వెళ్లేందుకు లింగంపల్లి స్టేషన్‌ నుంచి బయలుదేరింది. కాగా, రైలు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు 10.30 గంటలకు చేరింది. ఈ క్రమంలో కర్నూలు-సికింద్రాబాద్‌ రైలు నంబర్‌ 17028 హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ మలక్‌పేట మీదుగా సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు కాచిగూడకు వస్తుంది.


ఇంతలో కాచిగూడ లెవల్‌ క్రాసింగ్‌ పాయింట్‌ నుంచి నాలుగో నంబర్‌ ఫ్లాట్‌ఫాంకు వస్తున్న హంద్రీ ఎక్స్‌ప్రె్‌సను కాచిగూడ రెండో నంబర్‌ ఫ్లాట్‌ఫాం నుంచి వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలు ఉదయం 10.39 గంటలకు ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంజన్‌ భాగంలో చిక్కుకుపోయి కొన ఊపిరితో బయటపడి లోకోపైలట్‌ శేఖర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎంఎంటీఎస్‌ రైలు బోగీలు కొన్ని పట్టాలు తప్పడంతోపాటు ఇంజన్‌ ముందు భాగం ధ్వంసం కావడం, ఓవర్‌హెడ్‌ ఎలక్ర్టిక్‌ (ఓహెచ్‌ఈ) తీగలు తెగిపోవడంతో రైల్వేశాఖకు సుమారు రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. 


తాజాగా హఫీజ్‌పేట ఘటన...

ఈ నెల 19న సాయంత్రం లింగంపల్లి నుంచి నాంపల్లికి వెళ్తున్న ఎంఎంటీఎస్‌ 5.23 గంటలకు బయలుదేరి 5 నిమిషాల అనంతరం చందానగర్‌ స్టేషన్‌కు చేరుకుంది. తిరిగి 5.28 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సరిగ్గా రెండు నిమిషాల వ్యవధిలో హఫీజ్‌పేట స్టేషన్‌ శివారులో పట్టాలు తప్పింది. గమనించిన డ్రైవర్‌ రైలును వెంటనే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. చివరి బోగీ కావడంతో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. రైలు ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందిస్తున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు హడావిడిగా మరమ్మతులు చేపడుతున్నారు.


తర్వాత ఘటన ఎలా జరిగింది...? అందుకు బాధ్యులెవరు..? మరోసారి ఇలాంటివి పునారావృతం కాకుండా చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించడం లేదు. వాస్తవంగా సాధారణ రైళ్ల కంటే ఎంఎంటీఎస్‌ రైళ్లు స్టేషన్‌ నుంచి క్షణాల్లో వేగం అందుకుంటాయి. నిమిషాల వ్యవధిలోనే తర్వాతి స్టేషన్లకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో అతి తక్కువ సమయంలో రాకపోకలు సాగిస్తున్న ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. 

Updated Date - 2020-03-21T09:29:28+05:30 IST