ఫోన్‌ చేసిన వెంటనే పేదలకు భోజనం

ABN , First Publish Date - 2020-03-30T09:45:21+05:30 IST

పేదలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు భోజనం కోసం ఇబ్బంది పడకుండా జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆహార అందజేసేందుకు శ్రీకారం చుట్టారు.

ఫోన్‌ చేసిన వెంటనే పేదలకు భోజనం

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌


బంజారాహిల్స్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పేదలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు భోజనం కోసం ఇబ్బంది పడకుండా జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆహార అందజేసేందుకు శ్రీకారం చుట్టారు. తన ఇంట్లో భోజనం తయారు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ రెండుపూటలా ఆహారం అందించేందుకు అంతా సిద్ధం చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్‌ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ సందర్భంగా టిఫిన్‌సెంటర్లు, హోటల్స్‌ మూసివేయడంతో పేదలు, వలస వచ్చిన వారు ఆహారం కోసం ఇబ్బందిపడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.


రెండు రోజుల క్రితం ఒడిశాకు చెందిన 25 మంది మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారని, ఈ విషయమై మంత్రి తనకు సమాచారం ఇచ్చారని తెలిపారు. కృష్ణానగర్‌లో ఎస్వీ గెస్ట్‌ హౌస్‌లో ఉన్నవారికి ఆహారం అందించినట్టు చెప్పారు. అప్పుడే తనకు ఈ ఆలోచన వచ్చినట్టు తెలిపారు. ఎక్కువమంది ఒకేచోట ఉంటే ఫోన్‌ చేస్తే తామే స్వయంగా తీసుకెళ్లి వడ్డించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజూ కనీసం వెయ్యిమందికి పైగా ఆహారం అందేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. భోజనం కావాల్సిన వారు 9100877222, 9100877111 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. 

Updated Date - 2020-03-30T09:45:21+05:30 IST