అసెంబ్లీలో గంధంగూడ కబ్జాలపై మంత్రి స్పందన

ABN , First Publish Date - 2020-03-13T09:33:42+05:30 IST

గండిపేట రెవెన్యూ మండలంలోని గంధంగూడలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం విషయం అసెంబ్లీలో గురువారం చర్చకొచ్చింది. ఈ విలువైన ప్రభుత్వ స్థలంలో ఇప్పటికే పలు నిర్మాణాలు వెలిశాయని కోర్టులో కేసు నడుస్తోందని సదరు మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు.

అసెంబ్లీలో గంధంగూడ కబ్జాలపై మంత్రి స్పందన

నార్సింగ్‌, మార్చి12 (ఆంధ్రజ్యోతి): గండిపేట రెవెన్యూ మండలంలోని గంధంగూడలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం విషయం అసెంబ్లీలో గురువారం చర్చకొచ్చింది. ఈ విలువైన ప్రభుత్వ స్థలంలో ఇప్పటికే పలు నిర్మాణాలు వెలిశాయని కోర్టులో కేసు నడుస్తోందని సదరు మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ స్థలం వివాదంపై అసెంబ్లీలో చర్చ జరగడంతో స్థానికంగా చర్చనీయంశమైంది. నగరానికి చెందిన ఎమ్మెల్సీ ప్రభాకర్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ కబ్జా నిజమేనని, ప్రస్తుతం ఈ అంశం కోర్టులో నడుస్తోందని, కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. గండిపేట మండలం గంధంగూడలోని ప్రభుత్వ స్థలం  3.22 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఇప్పటికే ప్రభుత్వం నిర్ధారించడంతోపాటు అక్కడ ఇళ్లు కట్టుకున్న వారికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డులు ఏర్పాటు చేశారు.


కొన్నేళ్ల క్రితం ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని కొంత డంపింగ్‌యార్డుకు ఇవ్వగా మరికొంత స్థలం ఖాళీగా ఉంది. ఈ స్తలం ప్రధాన రోడ్డుకు చాలా లోపలికి ఉండడంతో ఎవరూ పట్టించుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది రియల్టర్లు వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించారు. దీంతో చాలా మంది ఈ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నారు. కొన్ని నెలల క్రితం ఇక్కడ డంపింగ్‌యార్డు కారణంగా తాము నివాసం ఉండలేకపోతున్నామని, దీనిని ఇక్కడి నుంచి తొలగించాలని స్థానికులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. మరోపక్క ఈ ప్రాంతంలో డంపింగ్‌యార్డు స్థలం, ప్రభుత్వం ఆక్రమణకు గురైందని ఓ సామాజిక కార్యకర్త అధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టును ఆశ్రయించారు. దీంతో రెవెన్యూ అధికారులు మొత్తం ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేయగా 3.22 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు. ఆక్రమించిన స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా కోర్టులో ఉంది. కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. తీర్పును బట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 

Updated Date - 2020-03-13T09:33:42+05:30 IST