గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం.. అసంతృప్తి

ABN , First Publish Date - 2020-09-29T20:05:46+05:30 IST

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలకు నవంబర్-02న నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం.. అసంతృప్తి

హైదరాబాద్ : హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలకు నవంబర్-02న నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల పెద్దలు అభ్యర్థుల వేట సాగిస్తున్నారు. మంగళవారం నాడు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన.. జీహెచ్ఎంసీలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్‌కు రప్పించిన ప్రభుత్వం టీఆర్ఎస్ అని ఆయన చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో జీహెచ్‌ఎంసీలో వివిధ కార్యక్రమాలు చేపట్టామని.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి కార్పొరేటర్లు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు.


కేటీఆర్ అసంతృప్తి..

ఈ సమావేశంలో సిట్టింగ్ కార్పొరేటర్ల పని తీరుపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని.. పని తీరు మార్చుకోవాలని ఆయన ఒకింత హెచ్చరించారు. సమస్యలుంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్నికలు ఒకటి రెండు నెలలు ముందే రావచ్చని.. అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు.


సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో మాత్రమే కోతలు విధించామని.. ఇతర రాష్ట్రలకు చీరలను సప్లై చేసే స్థాయికి మన నేతన్నలు ఎదగడం గర్వకారణమన్నారు. చేనేతల కోసం వివిధ పథకాలు తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయన్న విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళా సంఘాల ద్వారా అక్టోబర్ 9 నుంచి చీరల పంపిణీ చేస్తామన్నారు. చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

Updated Date - 2020-09-29T20:05:46+05:30 IST