మజ్లిస్‌ కోట కదిలేనా?

ABN , First Publish Date - 2020-11-26T06:05:41+05:30 IST

నాంపల్లి నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎంల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది.

మజ్లిస్‌ కోట కదిలేనా?

నాంపల్లి పరిధిలో ఎంఐఎం పట్టున్న డివిజన్లపై..

ఇతర ప్రధాన పార్టీల చూపు

ఏడింట ఆరు డివిజన్లలో బలంగా మజ్లిస్‌


మంగళ్‌హాట్‌, నవంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): నాంపల్లి నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎంల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. మొత్తం ఏడు డివిజన్లు మెహదీపట్నం, గుడిమల్కాపూర్‌, ఆసీఫ్‌నగర్‌, విజయనగర్‌ కాలనీ, అహ్మద్‌నగర్‌, రెడ్‌హిల్స్‌, మల్లేపల్లి డివిజన్లలో కలిపి 3,47,504మంది ఓటర్లున్నారు. వీటిలో గుడిమల్కాపూర్‌ మినహాయించి మిగిలిన అన్ని డివిజన్లలో మజ్లిస్‌ విజయం సాధిస్తూ వస్తోంది. ఈసారి టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు మంచి పట్టున్న నేతలను బరిలో దింపడంతో ఎంఐఎంకు గట్టి పోటీ ఎదురవనుంది. మజ్లిస్‌ కంచుకోటలుగా చెప్పుకొనే ఆరు డివిజన్లలో తమ జెండా ఎగురవేస్తామని అటు టీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ ధీమాగా ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ కారణంగా మజ్లిస్‌ ఓట్లు చీలి, తమకు లాభిస్తుందని బీజేపీ నేతలు నమ్మకంగా ఉన్నారు. మరోవైపు.. తమ ఓట్ల శాతం కొంతమేర తగ్గితే తగ్గవచ్చు తప్ప గెలుపులో ఎటువంటి ఆనుమానాలు లేవని మజ్లిస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. 


మెహదీపట్నం డివిజన్‌

ఇక్కడి నుంచి ఎంఐఎం తరపున మాజీ మేయర్‌ మహ్మద్‌ మాజీద్‌ హుస్సేన్‌ బరిలో ఉండగా టీఆర్‌ఎస్‌ నుంచి సంతోష్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నుంచి ఉమా మహేశ్వర్‌ రావు, బీజేపీ నుంచి డి గోపాలకృష్ణ, టీడీపీ నుంచి వీరబాబు పోటీ పడుతున్నారు. ఇక్కడ ముస్లిం ఓట్లే కీలకం కావడంతో ఎంఐఎం గత ఎన్నికల్లో విజయం సాధించింది. ఈసారి టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు అటు ముస్లిం, ఇటు హిందూ ఓట్లను ఆకర్షిస్తున్నారు.


గుడిమల్కాపూర్‌ డివిజన్‌

గుడిమల్కాపూర్‌ డివిజన్‌లో 60 శాతం కార్వాన్‌ నియోజకవర్గంలో, 40 శాతం నాంపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. హిందూ ఓట్లు అధికంగా ఉండే గుడిమల్కాపూర్‌ డివిజన్‌లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బంగారు ప్రకాష్‌ విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ మరోమారు ఆయనకే టికెట్‌ కేటాయించింది. బీజేపీ తరపున గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దేవర కరుణాకర్‌ మళ్లీ బరిలో దిగారు. అదే విధంగా కాంగ్రెస్‌ నుంచి నాగారం వేణు గౌడ్‌, టీడీపీ నుంచి సురేందర్‌ సింగ్‌లు బరిలో ఉన్నారు.


విజయనగర్‌ కాలనీ

విజయనగర్‌ కాలనీ డివిజన్‌ లో మజ్లిస్‌కు మంచి పట్టు ఉంది. ఇక్కడ ఎంఐఎం తరపున బత జబీన్‌ బరిలో ఉండగా, కాంగ్రెస్‌ తరపున ఇనాయత్‌ ఫాతిమా, బీజేపీ నుంచి దర్గా అశ్విని, టీఆర్‌ఎస్‌ నుంచి స్వరూప రాణిలు పోటీలో ఉన్నారు. నాంపల్లి కాంగ్రెస్‌ పార్టీ కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే ఫిరోజ్‌ ఖాన్‌ ఈసారి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారం పుంజుకోలేదు. కాంగ్రెస్‌ మైనార్టీ అభ్యర్థికి, ఎంఐఎం అభ్యర్థికి ప్రధానంగా పోరు నడవనుంది.


అహ్మద్‌నగర్‌ డివిజన్‌

అహ్మద్‌ నగర్‌ డివిజన్‌ ఎంఐఎంకు కంచుకోట. ఇక్కడ ఇండిపెండెంట్లు, రెబల్‌ అభ్యర్థులు ఒక్కరు కూడా బరిలో లేరంటే పరిస్థితిని చేసుకోవచ్చు. ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న ఈ డివిజన్‌లో ఎంఐఎం నుంచి రఫత్‌ సుల్తానా, టీఆర్‌ఎస్‌ నుంచి మమత, బీజేపీ నుంచి రాధాబాయి, కాంగ్రెస్‌ అభ్యర్థి హుమెరా హమేదీ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం అభ్యర్థులు ముస్లిం మైనారిటీకి చెందిన వారు కావడంతో పాటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మజ్లిస్‌ ఓట్లు చీల్చితే తమ గెలుపు ఖాయమని బీజేపీ ధీమాగా ఉంది. 


రెడ్‌హిల్స్‌ డివిజన్‌

రెడ్‌హిల్స్‌ డివిజన్‌లో పోరు రసవత్తరంగా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీహెచ్‌ ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌ కూతురు ప్రియాంక గౌడ్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ కేటాయించింది. ఎంఐఎం నుంచి సద్దియా మజ్‌హేర్‌, కాంగ్రెస్‌ నుంచి ఆయేషా ఫర్హాన్‌ బరిలో ఉన్నారు. ముస్లింల ఓట్లు కాంగ్రెస్‌, ఎంఐఎంలు చీల్చినా, మిగిలిన ఓట్లతో టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాలన్నాయంటున్నారు. అయితే.. స్థానిక నాయకత్వం ప్రజల్లోకి వెళ్లడంలో  వెనుకబడుతోందన్న ప్రచారం ఉంది. ఎంఐఎం నాయకులు మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు.


మల్లేపల్లి డివిజన్‌

మల్లేపల్లి డివిజన్‌లో గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కొల్లూరు ఉషకే బీజేపీ ఈసారి కూడా టికెట్‌ కేటాయించింది. అయితే.. దశాబ్దాలుగా ఈ డివిజన్‌ ఎంఐఎందేనని, ఆ పరంపర కొనసాగిస్తామని మజ్లిస్‌ నేతలంటున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌  ప్రచారం ఊపందుకోలేదు.  మల్లేపల్లి డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ఉష, ఎంఐఎం అభ్యర్థి యాస్మిన్‌ బేగంల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని ఒక వాదన. 


ఆసిఫ్‌ నగర్‌ డివిజన్‌

ఆసిఫ్‌ నగర్‌ డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి గౌసియా సుల్తానా బరిలో ఉండగా, బీజేపీ నుంచి లావణ్య, కాంగ్రెస్‌ నుంచి మనీషా, టీఆర్‌ఎస్‌ నుంచి సాయి శీరిషలు పోటీలో ఉన్నారు. ఎంఐఎంకు మంచి పట్టున్న డివిజన్‌ అయినా.. ఆసిఫ్‌ నగర్‌లో ఈసారి తాము గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


మరో విజయం కోసం మజ్లిస్‌ ఆరాటం

గతంలో 60 సీట్లకు పోటీ చేసి 44చోట్ల విజయం 

ఈసారి 52 డివిజన్లకే.. అయినా 50 స్థానాలు లక్ష్యం

పోటీచేయని చోట్ల టీఆర్‌ఎస్‌కు లాభించేలా వ్యూహం

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు మజ్లిస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేసి 44 చోట్ల గెలుపొందిన ఆ పార్టీ, ఈసారి 52 డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టింది. కనీసం 50 స్థానాలనైనా కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్‌ఎ్‌సతో ఎలాంటి ఎన్నికల అవగాహన, పొత్తులు లేవని.. స్వతంత్రంగా పోటీ చేసి సత్తా చాటుకుంటామని స్పష్టం చేస్తోంది. పాతబస్తీకే పరిమితం కాకుండా సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేట, రాజేంద్రనగర్‌ తదితర అసెంబ్లీ స్థానాల్లో ముస్లింలు అధికంగా నివసించే డివిజన్లను లక్ష్యంగా చేసుకుంది. ఆయా శాసనసభ నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో మజ్లిస్‌ అభ్యర్ధులను గెలిపించే బాధ్యతలను స్థానిక పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత అసదుద్దీన్‌ అప్పగించారు. ఎమ్మెల్యేలు లేని ప్రాంతాల్లో పోటీ చేస్తున్న డివిజన్లలో అభ్యర్థుల తరఫున ఆయన స్వయంగా ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. టీఆర్‌ఎ్‌సతో పొత్తు లేకపోయినప్పటికీ  బీజేపీ అభ్యర్థుల విజయాన్ని నిలువరించేందుకు మజ్లిస్‌ ఆయా డివిజన్లలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తొమ్మిది సీట్లలో తమ అభ్యర్థులను బరిలో నిలపలేదు. బీజేపీ విజయావకాశాలు ఉన్న డివిజన్లలో తాము పోటీ చేయని పక్షంలో, మైనారిటీల ఓట్లు టీఆర్‌ఎ్‌సకు దక్కేలా ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అలాగే పాతనగరంలో యాకుత్‌పురా నియోజకవర్గం పరిధిలోని గౌలిపురా డివిజన్‌ మినహా మిగిలిన అన్ని డివిజన్లలో మజ్లిస్‌ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. చార్మినార్‌ సెగ్మెంట్‌లోని బీజేపీ సిటింగ్‌ స్థానం అయిన ఘాన్సీబజార్‌  డివిజన్‌ బాధ్యతలను మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌ గౌస్‌కు అప్పగించింది. ఐదేళ్ల క్రితం తమ పార్టీ నుంచి కాంగ్రె్‌సలో చేరిన గౌస్‌ను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడమే కాక, ఆయన భార్య పర్వీనాకు ఘాన్సీబజార్‌ టికెట్‌ను మజ్లిస్‌ కేటాయించడం గమనార్హం.

Updated Date - 2020-11-26T06:05:41+05:30 IST