వలస జీవుల పాలిట ‘సహాయ’

ABN , First Publish Date - 2020-04-15T07:05:53+05:30 IST

సహాయ హెల్ప్‌లైన్‌ 9985833725 నెంబర్‌కు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ పోటెత్తాయి. రోజుకు సుమారు

వలస జీవుల పాలిట ‘సహాయ’

పొట్టచేత పట్టుకుని పరాయితావుని ఆశ్రయించిన పీడితుల నోటికి అన్నం ముద్ద అందించేందుకు పుట్టిన సంస్థ ‘సహాయ’. లాక్‌డౌన్‌ వేళ వలస జీవుల కన్నీళ్లను తుడిచేందుకు ముందుకొచ్చిన కొన్ని ఆపన్నహస్తాల సమూహమే ‘సహాయ’గా పురుడుపోసుకుంది. పల్లె, పట్టణాల్లోని బడుగుల జీవితాలు పస్తులతో తెల్లారకూడదనే సంకల్పంతో ‘హెల్ప్‌లైన్‌’ నెలకొల్పారు. తద్వారా కొన్నివేల మంది ఆకలి తీరుస్తున్నారు. కరోనా కరాళ నృత్యమాడుతున్న సమయంలో సహాయ తలపెట్టిన సేవా కార్యక్రమాలు ప్రభుత్వ యంత్రాంగాలకూ స్ఫూర్తి పాఠాలే.. హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌14 (ఆంధ్రజ్యోతి):సహాయ హెల్ప్‌లైన్‌ 9985833725 నెంబర్‌కు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ పోటెత్తాయి. రోజుకు సుమారు 120 నుంచి 150 ఫోన్‌ కాల్స్‌. ఐదు రోజుల్లో దాదాపు 640 మంది సంప్రదించారు. వారందరి బాధ ఒక్కటే.! ‘బతుకుదెరువు కోసం వచ్చాం. సొంతూర్లకి పోలేకున్నాం. ప్రతి పూటా అన్నం కోసం వెతుక్కోడమే. మాలాంటోళ్లకి గవర్నమెంటోళ్లు రూ.500, 12 కిలోల బియ్యం ఇస్తరని అంటున్నరు. అవి మాకెప్పుడు అందుతాయి. చాలా కష్టంగా ఉందయ్యా. కాస్త, సాయం చేసి పుణ్యం కట్టుకోండి.


పసిబిడ్డలున్నరు. మాకు పస్తు కొత్తేమీకాదు కానీ, మా పిల్లలకైనా కాస్తంత అన్నం పెట్టించండి సారూ..’’ అంటూ ప్రతినోటా ఇవే వేడుకోళ్లు. బాధితుల మాటలు విని సహాయ బృందం ఊరుకోదు. వాళ్ల వివరాలు, ఆ ప్రాంతంలో ఎంతమంది ఇబ్బందుల్లో ఇరుక్కున్నారో వంటి వివరాలన్నీ తెలుసుకుంటుంది. ఆ దరిదాపుల్లో ఇంకా ఎందరు వలసకూలీలు దుర్బర పరిస్థితులను అనుభవిస్తున్నారో లెక్కకట్టి.. ఆ వివరాలను స్థానిక తహసీల్దార్‌, రెవెన్యూ శాఖల అధికారులకు సమాచారం అందిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం బాధితుల చేతికందించే వరకూ వెనకడుగువేయరు సహాయ సభ్యులు. అంతటితో తమ పని అయిపోయిందని చేతులు దులుపుకోరు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, పౌరసంఘం ప్రతినిధులు, కొందరు బాధ్యత కలిగిన పౌరుల సమూహంతో ఏర్పాటుచేసిన వాట్సాప్‌ నెంబర్లకు బాధితుల వివరాలు పంపి, అవసరమైన సాయం అందేలా చూస్తారు.


అలా తెలంగాణలోని ప్రతి ఉమ్మడి జిల్లాకొక వాట్సాప్‌ గ్రూపు ప్రారంభించారు. కొందరు ఉపాధ్యాయులు, వైద్యులు, పౌరహక్కుల కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఇలా ఆపద వేళ ఆకలితో ఉన్నవారికి సాయమందించాలనుకునే కొందరు సహృదయులు వాట్సాప్‌ గ్రూపులో ఉన్నారు. వారంతా కలిసి కష్టాల్లో ఉన్న వలస కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు, గోధుమ పిండి తదితర నిత్యావసరాలతో రూపొందించిన ఆహార కిట్లను అందిస్తారు. 


వలసజీవికి అందని సాయం...

లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని లక్షల మంది దినసరి కూలీలు అవస్థలు పడుతున్నారు. ఊరుగాని ఊరిలో, తెలిసీతెలియని భాషతో తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. వలస కూలీలు ఎంత మంది ఉన్నారో సరైన లెక్కలేదు. అలాంటి గణన ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. అయితే, ఒక్క హైదరాబాద్‌లోనే ఏడు లక్షల మంది ఉంటారని అంచనా. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఆ సంఖ్య తొమ్మిది నుంచి పది లక్షలు దాటొచ్చు. వారిలో తెలుగు ప్రాంతాలతోపాటూ మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన బడుగుజీవులే అధికం. జీవో 13 ప్రకారం ఆయా ప్రాంతాల్లోని ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, కుటుంబానికి రూ.500 చొప్పున అందించాలి.


కానీ ఇప్పటి వరకు తమకు అలాంటి సాయం అందలేదని వారే హెల్ప్‌లైన్‌కు సమాచారం అందిస్తున్నారు. సహాయ వలంటీర్ల పరిశీలనలోనూ ఈ విషయం బహిర్గతమైంది. హెల్ప్‌లైన్‌కు అందిన సమాచారంతో సహాయ వలంటీరు, సీనియర్‌ జర్నలిస్టు సి.వనజతో పాటూ మరికొందరు హిమాయత్‌నగర్‌ ఫరీద్‌ బస్తీకి వెళ్లారు. అక్కడ సుమారు 550 వలస కార్మికులను గుర్తించారు. స్థానిక తహసీల్దార్‌కు పరిస్థితి వివరిస్తే.. ‘‘మేం చేయదగ్గ సాయం ఎప్పుడో చేశాం. ఇక పంచడానికి మావద్ద ఏమీ లేవు’’ అంటూ కసురుకున్నారని వలంటీర్లు చెప్పారు. వనజ కొంతమంది బంధు, మిత్రుల నుంచి విరాళాలు సేకరించి ఒక్కో కుటుంబానికి 15 రోజులకు సరిపడా నిత్యావసరాలతో 115 ఆహార కిట్లను పంచారు. నగరంలో సాయానికి నోచుకోని వలస కూలీలు చాలా మందే ఉన్నారు. వారందరినీ గుర్తించి, తగిన సాయం అందించడంలో ప్రభుత్వం అంతగా చొరవ చూపలేకపోతోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.


యువత స్ఫూర్తి...

వలస కార్మికులను గుర్తించి, తగిన సహాయం అందించేందుకు వారంతా కలిసి ఒక్కటై ‘సహాయ’గా నిలిచారు. అందులో రైతుస్వరాజ్య వేదిక, మహిళా రైతుల హక్కుల వేదిక, మానవ హక్కుల వేదిక, ఎన్‌ఏపీఎం, కేరింగ్‌ సిటిజన్స్‌ కలెక్టివ్‌, ఎంవీ ఫౌండేషన్‌, తెలంగాణ విద్యావంతుల వేదిక, పాలమూరు అధ్యయన వేదిక, దళిత బహుజన ఫ్రంట్‌, భూమిక హెల్ప్‌లైన్‌, తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌, టీజాక్‌, తెలంగాణ మహిళా ట్రాన్స్‌జెండర్‌ సంఘాల ఐక్యవేదిక, లిబరేషన్‌ పార్టీ, 14 ఫార్మర్స్‌, ఎయిడ్‌, సమాలోచన, ఛత్రి, అంకురం తదితర సంస్థలు పనిచేస్తున్నాయి. హెల్ప్‌లైన్‌కు వచ్చే కాల్స్‌ను అందుకోవడంతోపాటూ, బాధితుల ఇబ్బందులు తెలుసుకోవడం, వివరాలు సేకరించే కీలకమైన పనిలో పది మంది యువకులు ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు నిమగ్నమవుతున్నారు. 


వలస కూలీలు, దళిత, ఆదివాసీ, గిరిజనుల సమస్యలు, ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య సేవల వివరాలు, అసంఘటిత కార్మికుల ఇబ్బందులను ‘సహాయ’కు  తెలియజేసేందుకు హెల్ప్‌లైన్‌ 9985833725 నెంబర్‌ను సంప్రదించగలరు. హెల్ప్‌లైన్‌ వేళలు ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు.


Updated Date - 2020-04-15T07:05:53+05:30 IST