మెట్రో రెండో దశపై కరోనా కాటు

ABN , First Publish Date - 2020-09-25T07:14:12+05:30 IST

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ నిర్మాణానికి రెండేళ్ల క్రితమే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధమైంది. కరోనా రాకపోతే ఈ ప్రాజెక్టు నిధుల కేటాయింపు కొలిక్కి

మెట్రో రెండో దశపై కరోనా కాటు

నిధుల కేటాయింపుపై ప్రభావం

డీపీఆర్‌కే ప్రాజెక్టు పరిమితం


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి) :

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ నిర్మాణానికి రెండేళ్ల క్రితమే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధమైంది. కరోనా రాకపోతే ఈ ప్రాజెక్టు నిధుల  కేటాయింపు కొలిక్కి వచ్చేది. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చేది. కరోనా ప్రభావంతో రెండో దశ  మెట్రోను ఎక్కడ  వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టులో 72 కి.మీ మార్గంలో 69 కి.మీలలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెట్రోకు నగర వాసుల ఆదరణ లభించడంతో రెండో దశపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2018లోనే రెండో దశకు సంబంధించిన డీపీఆర్‌ను ఢిల్లీ మెట్రో రైలు సంస్థ రూపొందించి ప్రభుత్వానికి అప్పగించింది. 2018, 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో తర్వాత ప్రక్రియ కొంత ఆలస్యమైంది. పెద్ద మొత్తంలోనే నిధుల అవసరం ఉండడంతో ప్రభుత్వం కేంద్రంతోనూ, ఇతర ప్రైవేటు సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతుండగానే కరోనా వచ్చి బ్రేకులు వేసింది. దీంతో 6 నెలలుగా రెండో దశ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. 


ఎయిర్‌పోర్టు కారిడార్‌కు ప్రాధాన్యం

హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) వరకు (31కి.మీ) ఉన్న మార్గానికి అధిక ప్రాధాన్యం ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి విమానాశ్రయం వరకు మెట్రోను అనుసంధానం చేయడం ద్వారా నిత్యం లక్షలాది మందికి ఇది ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతో స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ) ప్రాజెక్టుగా దీనికి రూపకల్పన చేసింది ప్రభుత్వం. గచ్చిబౌలి వద్ద ప్రారంభమైన ఔటర్‌ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 31 కి.మీ మార్గాన్ని వేగంగా నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు, టీఎస్‌ఐఐసీతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే  ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కారిడార్‌ పనులు ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేవని మెట్రో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన మెట్రో సేవలు సుమారు 5 నెలల తర్వాత ప్రారంభమైనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. 


నిధుల కొరతే సమస్య....

 రెండో దశ మెట్రోకు డీపీఆర్‌ సిద్ధంగా ఉన్నా అసలు సమస్య నిధులే. సుమారు రూ.5వేల కోట్లకు పైగా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నిధుల సమకూర్చాల్సి ఉంది. కరోనా ప్రభావంతో అది సాధ్యమయ్యేలా లేదు. మొదటి దశ తరహాలో పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంలో  కాకుండా ప్రభుత్వమే సొంతంగా రెండో దశ చేపట్టాలని నిర్ణయించింది. కరోనాతో నిధుల సమీకరణ ప్రయత్నాలు నిలిచిపోయాయి. రెండో దశ మెట్రోను ప్రారంభించాలంటే మళ్లీ ప్రైవేటు భాగస్వామ్యం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోందని మెట్రో ఉన్నతాధికారులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Updated Date - 2020-09-25T07:14:12+05:30 IST