ఇదేనా.. పట్టణ ప్ర‘గతి’

ABN , First Publish Date - 2020-03-02T09:08:11+05:30 IST

‘చెరువుల సుందరీకరణకు కట్టుబడి ఉన్నాం.. మీర్‌పేట్‌లోని మూడు చెరువులను సుందర తటాకాలుగా మారుస్తాం’.. ఇవీ గతంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తాజా ఎమ్మెల్యే, మంత్రి సబితారెడ్డి తరచుగా చెబుతున్న మాటలు.

ఇదేనా.. పట్టణ ప్ర‘గతి’

వీధుల్లోని చెత్త చెరువుల్లోకి.. 

పెద్ద చెరువులో చేరుతున్న చెత్త

మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో పరిస్థితి


సరూర్‌నగర్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ‘చెరువుల సుందరీకరణకు కట్టుబడి ఉన్నాం.. మీర్‌పేట్‌లోని మూడు చెరువులను సుందర తటాకాలుగా మారుస్తాం’.. ఇవీ గతంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తాజా ఎమ్మెల్యే, మంత్రి సబితారెడ్డి తరచుగా చెబుతున్న మాటలు. అయితే, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చెరువుల సుందరీకరణ సంగతి దేవుడెరుగు.. ముందు వాటిలో చెత్త వేయకుండా చూడండి చాలు అని స్థానికులు విన్నవించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నప్పటికీ, మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో మాత్రం అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మీర్‌పేట్‌లోని వార్డుల్లో గత నెల 24 నుంచి చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా వీధులు, రోడ్లు, ఖాళీ ప్రదేశాలన్నీ శుభ్రం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఎక్సకవేటర్లు, డోజర్లు, హిటాచీలు, ట్రాక్టర్లు, ఆటోలు అద్దెకు తీసుకుని మరీ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అయితే, ఆయా కాలనీల్లో తొలగించిన చెత్తను దూరంగా పారబోయాల్సిన కార్పొరేషన్‌ అధికారులు చెత్త మొత్తం తీసుకువచ్చి మీర్‌పేట్‌ పెద్దచెరువు కట్టపై(చెరువు ఉన్న వైపు) పోస్తున్నారు. 


సదరు చెత్త కాస్తా మెల్లగా చెరువు నీటిలోకి జారుతోంది. ఇప్పటికే కాలుష్యకాసారంగా మారిన సదరు చెరువు వల్ల పరిసర కాలనీలవాసులు దోమల విజృంభణ, దుర్వాసనతో సతమతమవుతున్నారు. తాజాగా పారబోస్తున్న చెత్త కారణంగా చెరువు మరింత కలుషితంగా మారి భూగర్భ జలాలు విషపూరితమయ్యే ప్రమాదం ఉన్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చెరువు కట్టపై పోసిన చెత్త కుప్పలను మొత్తం తొలగింపజేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.  

Updated Date - 2020-03-02T09:08:11+05:30 IST