మెడికవర్‌లో అరుదైన శస్త్రచికిత్స

ABN , First Publish Date - 2020-02-08T08:58:36+05:30 IST

మెడికవర్‌ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో గాయడిన..

మెడికవర్‌లో అరుదైన శస్త్రచికిత్స

మాదాపూర్‌, ఫిబ్రవరి7 (ఆంధ్రజ్యోతి): మెడికవర్‌ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో గాయడిన వృద్ధులకు మెరుగైన చికిత్స అందించి తిరిగి సాధారణ స్థితికి తీసుకు వచ్చామన్నారు. శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూరాలజిస్టు డాక్టర్‌ రవికుమార్‌  వివరాలు వెల్లడించారు. సోమాలియా దేశానికి చెందిన దాహిర్‌ ఆర్ఫా మొహ్మద్‌(70) తన పొలానికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్‌ తగిలింది. బుల్లెట్‌ దాహిర్‌ యూరినరీ పాస్‌ (పురుషాంగం) దిగువన చీలుస్తూ కుడి పిరుదు మీదుగా బయటకెళ్లింది. దీంతో మూత్రనాళం కనెక్షన్‌ పూర్తిగా కట్‌ అవడంతో మూత్రం విడుదల చేయలేని స్థితికి చేరుకున్నాడు.


స్థానికంగా ఉన్న వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తొడభాగం, మూత్రనాళం ఇన్ఫెక్షన్‌కు గురయింది. దీంతో బాధితుడి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో మెడికవర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. దాహిర్‌కు అన్ని పరీక్షలు నిర్వహించగా మూత్రనాళం కనెక్షన్‌ పూర్తిగా కట్‌అయినట్లు గుర్తించారు. దీంతో ఆపరేషన్‌ చేసి పూర్వస్థితికి తీసుకువచ్చినట్లు న్యూరాలజిస్టు డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. దీంతో దాహిర్‌ క్షేమంగా ఉన్నాడని, ఇకముందు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు.  

Updated Date - 2020-02-08T08:58:36+05:30 IST