తెలంగాణ కేసీఆర్‌ వల్ల రాలేదు: మేచినేని కిషన్‌రావు

ABN , First Publish Date - 2020-12-13T18:06:32+05:30 IST

కేసీఆర్‌ తన వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఆసలు ఆయన ఉద్యమకారుడు కాదని 1969 ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు మేచినేని కిషన్‌రావు అన్నారు.

తెలంగాణ కేసీఆర్‌ వల్ల రాలేదు: మేచినేని కిషన్‌రావు

బంజారాహిల్స్: కేసీఆర్‌ తన వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఆసలు ఆయన ఉద్యమకారుడు కాదని 1969 ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు మేచినేని కిషన్‌రావు అన్నారు. సిద్దిపేట సభలో కేసీఆర్‌ లేనిదే తెలంగాణ లేదు అని సీఎం అన్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సిద్దిపేటలో చేసిన ప్రకటన ఉద్యకారులకు బాధ కలిగించిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లోనే బీజం ఏర్పడిందన్నారు. తెలంగాణ సాధన సమితి, తెలంగాణ తల్లి ఇలా వందలాది ఉద్యమ సంస్థలు ఏర్పడి పోరాటం చేశాయని అప్పట్లోనే 369 మంది ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు.మలిదశ ఉద్యమ సమయంలో ప్రస్తుత మంత్రి హరీష్‌రావు మధ్యవర్తిత్వం వహించగా ఉద్యమ సంస్థలన్నీ ఒక్క దగ్గరకు చేర్చారన్నారు. కాళోజీ నారాయణరావు సలహా మేరకు అందరూ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి, అధ్యక్షుడిగా కేసీఆర్‌, ప్రధాన కార్యదర్శిగా తాను పనిచేసినట్టు వెల్లడించారు. పొలికేక పేరిట నిజాం గ్రౌండ్‌లో భారీ సభ ఏర్పాటు చేసినప్పుడు నక్సలైట్లుకూడా ఉద్యమానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. విద్యార్థి సంఘాలు, న్యాయ వాదులు ఇలా అనేక వర్గాలకు చెందిన వారు ఉద్యమంలోకి రావడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు.


కానీ.. ఇప్పుడు ఆయన అంతా తానే అని చెప్పుకోవడంతో ఉద్యమకారులను అవమానపరిచినట్లేనని చెప్పారు. వెంటనే టీఆర్‌ఎ్‌సను రద్దు చేయాలని లేదంటే ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక జరిగిన అక్రమాలు, అవినీతిని ప్రజలకు తెలియజేసేందుకు నిజ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సిద్దిపేటలో చేసిన ప్రకటనకు కేసీఆర్‌ ఉద్యమకారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-12-13T18:06:32+05:30 IST