2002లో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నిక

ABN , First Publish Date - 2020-11-26T06:04:05+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు కార్పొరేటర్లకు ఓటు వేస్తారు.

2002లో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నిక

మేయర్‌ను ప్రత్యక్షంగా ఎన్నుకున్న వైనం

టీడీపీ తరపున తీగల విజయం

2009 నుంచి పరోక్ష పద్ధతి మొదలు


హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు కార్పొరేటర్లకు ఓటు వేస్తారు. మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యుల సంఖ్యను బట్టి మేజిక్‌ ఫిగర్‌ దక్కించుకున్న పార్టీకి మేయర్‌ పీఠం కైవసమవుతుంది. ఇదీ నేటి పద్ధతి. కానీ గతంలో సార్వత్రిక ఎన్నికల తరహాలో నగర మునిసిపల్‌ ఎన్నికల్లోనూ రెండు ఓట్లు వినియోగించుకునే అవకాశం ఉండేది. ఎంపీ, ఎమ్మెల్యేకు ఓటు వేసినట్టే... కార్పొరేటర్‌, మేయర్‌కు వేర్వేరుగా ఓటు వేసేవారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఎంసీహెచ్‌)గా ఉన్నప్పుడు 2002లో మేయర్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో 57 మంది బరిలో నిలిచారు. కాంగ్రెస్‌, టీడీపీ, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌లతోపాటు ఇతర గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రులు పోటీ చేశారు. అప్పటి టీడీపీ సర్కారు మొట్టమొదటిసారి మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించింది. అయితే.. ఆ తరహాలో అవే ఆఖరు ఎన్నికలు కావడం గమనార్హం. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ నేత తీగల కృష్ణారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్‌, టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ హోం మంత్రి, దివంగత నాయిని నరసింహారెడ్డి, ఎంఐఎం నుంచి మీర్‌ జుల్ఫీకర్‌ అలీ బరిలో నిలిచారు. మొత్తం 26,78,009 ఓట్లకుగాను 11,04,076 ఓట్లు పోలయ్యాయి. 3,62,119 ఓట్లు సాధించిన తీగల మేయర్‌గా ఎన్నికయ్యారు. 41.22 శాతం ఓటింగ్‌ నమోదైంది. దానం నాగేందర్‌ మూడో స్థానానికి పరిమితం కాగా.. నాయిని నాలుగో స్థానంలో నిలిచారు. 2002 నుంచి 2007 వరకు తీగల మేయర్‌గా వ్యవహరించారు. అనంతరం ఎంసీహెచ్‌ జీహెచ్‌ఎంసీగా అవతరించింది. 2009లో మొదటిసారి 150 వార్డులకు ఎన్నికలు జరుగగా.. పరోక్ష పద్ధతిలో మేయర్‌ను ఎన్నుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే తరహాలో మేయర్‌ ఎన్నిక జరగనుంది.


2002 మేయర్‌ ఎన్నికల వివరాలు

మొత్తం ఓట్లు 26,78,009

పోలైన ఓట్లు 11,04,076 

తిరస్కరించిన ఓట్లు 54,837

టెండర్‌ ఓట్లు 12

పోటిచేసిన అభ్యర్థులు 57 మంది

తీగల కృష్ణారెడ్డి (టీడీపీ) (ఓట్లు: 3,62,119)

జుల్ఫీకర్‌ అలీ (ఎంఐఎం) (ఓట్లు: 3,40,585)

దానం నాగేందర్‌ (కాంగ్రెస్‌) (ఓట్లు: 2,23,233)

నాయిని నరసింహారెడ్డి (టీఆర్‌ఎస్‌) (ఓట్లు: 62,591)

Updated Date - 2020-11-26T06:04:05+05:30 IST