మ్యాట్రిమొనీలో అందమైన యాంకర్ ఫొటో పెట్టి...
ABN , First Publish Date - 2020-12-27T06:35:09+05:30 IST
మ్యాట్రిమొనీ సైట్‌లో నకిలీ వివరాలు పెట్టి మోసం చేసిన యువతిని ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

- అతి తెలివి..!
- ధనవంతురాలిగా ఫోజు..
- జిన్ అంటూ రెండు పాత్రల పోషణ
- నేరుగా అబ్బాయి ఇంటికి..
- ఫోను రింగయింది.. కథ ముగిసింది
కొత్తపేట, డిసెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): మ్యాట్రిమొనీ సైట్‌లో నకిలీ వివరాలు పెట్టి మోసం చేసిన యువతిని ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. చిత్రా లే అవుట్‌లో ఉండే గండి అంబరీష్ తన కుమారుడు ప్రవీణ్‌కుమార్‌కు పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఆయన ఓ మ్యాట్రిమొనీ సైట్‌లో కుమారుడి వివరాలు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, దిగమర్రు గ్రామానికి చెందిన బండి లావణ్య(25) భీమవరం పరిధిలోని ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. ఆమె మ్యాట్రిమొనీ సైట్‌లో అంబరీష్ కుమారుడి వివరాలు చూసింది. వెంటనే సైట్‌లో ఓ అందమైన టీవీ యాంకర్ ఫొటో తన ఫొటోగా పెట్టింది.
అంబరీ్‌షకు ఫోన్‌చేసి తన పేరు బి. శాన్విహృతిక అని పరిచయం చేసుకుంది. భీమవరంలో తమకు ఐదారు కాటన్‌మిల్స్ ఉన్నాయని, బాగా ధనవంతులమని చెప్పింది. అనంతరం ఆమె తల్లిలా, తండ్రిలా, బంధువుల్లా మిమిక్రీ చేస్తూ అంబరీ్‌షతో, వారి కుటుంబసభ్యులతో మాట్లాడింది. తర్వాత కొద్ది రోజులకు తనకు కరోనా సోకిందని, భీమవరం ఆస్పత్రిలో చేరానని, తన కజిన్ లావణ్య హైదరాబాద్‌కు వస్తోందని, ఆమెకు ఆరఽశయం ఇవ్వాలని కోరింది. తన కజిన్ లావణ్య అబ్బాయిని చూస్తే తాను చూసినట్లేనని, తామిద్దరూ ఒకటేనని.. శరీరాలు రెండు, ఆత్మ ఒకటేనని చెప్పింది.
ఈ మేరకు లావణ్య అంబరీష్ ఇంటి వచ్చి అందరినీ పరిచయం చేసుకుంది. శాన్వీకి ఇష్టమని చెప్పి అంబరీష్ కుమారుడితో కలిసి జర్కిన్, చీర, కాస్మోటిక్స్ కొనుగోలు చేసింది. అతడే అన్నింటికీ డబ్బు చెల్లించాడు. షాపింగ్ అనంతరం ఆమె తల్లితో మాట్లాడుదామని అంబరీష్ కుటుంబ సభ్యులు కాల్ చేయగా, లావణ్య దగ్గరున్న ఫోన్ రింగ్ కావడం గమనించారు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి తెలిపారు.