రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ ట్విస్ట్.. భార్యే...!
ABN , First Publish Date - 2020-10-31T17:27:29+05:30 IST
వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌తో భర్తను చంపించింది. డీసీఎం వ్యానుతో ఢీ కొట్టించి హత్య చేయించింది. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ప్రియుడితో సహా పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలైంది.

భర్తను హత్య చేయించి.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించి..
ప్రియుడి మోజులో భార్య ఘాతుకం
యూపీకి చెందిన సుపారీ గ్యాంగ్ అరెస్టు
హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల (ఆంధ్రజ్యోతి) : వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌తో భర్తను చంపించింది. డీసీఎం వ్యానుతో ఢీ కొట్టించి హత్య చేయించింది. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ప్రియుడితో సహా పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలైంది. ఈ ఘటన ఈ ఏడాది మేలో జరిగింది. సుపారీ గ్యాంగ్‌లో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాలానగర్ డీసీపీ పద్మజ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
దుండిగల్ తండా-2కు చెందిన దరావత్ సురేష్, బబిత భారాభర్తలు. స్థానికంగా ఉండే ప్రేమ్‌సింగ్‌తో బబితకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం సురేష్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రియుడు ప్రేమ్‌సింగ్‌తో చర్చించి తన భర్త అడ్డుతొలగించాలని కోరింది. ప్రేమ్‌సింగ్ తనకు పరిచయస్తులైన సూరజ్, అజ్మీరాప్రేమ్, ఉత్తరప్రదేశ్ రాజులకు రూ.లక్ష సుపారీ ఇచ్చాడు. ఈ ఏడాది మే-16న మేడ్చల్ చెక్‌పోస్టు దాటిన తర్వాత బైక్‌పై వస్తున్న సురేష్‌ను యాక్సిడెంట్ చేసి హత్య చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు.
ఆసుపత్రికి తరలిస్తున్నట్లు నటించి హత్య....
రెండో సారి హత్య చేయడానికి పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. మే 23న మధ్యాహ్నం సమయంలో రోడ్డంతా నిర్మానుష్యంగా ఉండటంతో బైక్‌పై సురేష్ వస్తుండగా.. సూరజ్ డీసీఎం వాహనంతో ఆయనకు ఎదురుగా వెళ్లి సైదోనిగడ్డ తండా సమీపంలో ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలతో సురేష్ రోడ్డుపక్కన పొదల్లో పడిపోయాడు. అప్పటికే అక్కడ కారుతో సిద్ధంగా ఉన్న రాజు, అజ్మీరాప్రేమ్ ప్యాసింజర్‌లుగా నటించి సురేష్‌ను కారులో ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో సురేష్ కాళ్లను గట్టిగా పట్టుకోగా.. అజ్మీరాప్రేమ్ తన టీ షర్టుతో సురేష్ ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మేడ్చల్ పోలీసులు యాక్సిడెంట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడకుండా చేయడంతో సురేష్ మృతి చెందినట్లు తేలింది.
పోలీసులు అజ్మీరాప్రేమ్, రాజులతో పాటు.. సురేష్ భార్యపై నిఘాపెట్టారు. ఆమె ప్రవర్తన అనుమానంగా ఉండటంతో విచారించగా తన భర్తను ప్రేమ్‌సింగ్‌తో కలిసి సుపారీ గ్యాంగ్‌తో హత్యచేయించినట్లు ఒప్పుకుంది. సురేష్‌ను హత్యచేసినవారిలో మొత్తం ఎనిమిది మంది నిందితులు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు.. జూన్ నెల 29న బబిత, ఆమె ప్రియుడు ప్రేమ్‌సింగ్‌లతో పాటు.. ఆజ్మీర్‌ప్రేమ్, రాహుల్, వజ్యోత్ రాజులను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
గ్యాంగ్‌లోని మరో ఇద్దరు సూరజ్, రాజ్‌ప్రతాప్‌సరోజ్‌లు యూపీకి పారిపోయారు. వారి కోసం గాలించిన సైబరాబాద్ బాలానగర్ ఎస్‌వోటి ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి, మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ బృందం నిందితుల ఆచూకీ తెలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిన పోలీస్ బృందం ప్రయాగ జిల్లా, పాల్పూర్ తాలూకా సాహస్ గ్రామంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం కటకటాల్లోకి నెట్టినట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుల ఆచూకీ కనిపెట్టి చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు డీసీసీ పద్మజ రివార్డులు అందజేశారు.