మైనంపల్లికి మల్కాజిగిరి సవాల్‌!

ABN , First Publish Date - 2020-11-27T06:45:22+05:30 IST

గ్రేటర్‌ పరిధిలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు సవాలుగా మారాయి.

మైనంపల్లికి మల్కాజిగిరి సవాల్‌!
మల్కాజిగిరి

 గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌

 ఎమ్మెల్యేపై కంచుకోటను కాపాడుకునే బాధ్యత

 అన్నీ తానై ఉధృత ప్రచారం

 అభ్యర్థుల విషయంలో మాట నెగ్గించుకున్న వైనం

 ఆయన అనుచరులకే టీఆర్‌ఎస్‌ టికెట్ల కేటాయింపు

మల్కాజిగిరి/ అల్వాల్‌, నవంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ పరిధిలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు సవాలుగా మారాయి. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 9 డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించడంతో నియోజకవర్గం గులాబీ కంచుకోటగా నిలిచింది. దీంతో.. ఆ కంచుకోటను కాపాడుకోవడమే మైనంపల్లికి చాలెంజ్‌గా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కూడా అన్ని డివిజన్లలోనూ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉధృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని నేరేడ్‌మెట్‌, వినాయక్‌నగర్‌, మౌలాలి, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, మల్కాజిగిరి, గౌతంనగర్‌ డివిజన్లకు గాను కొన్ని డివిజన్లలో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించవచ్చని స్థానికులు చెబుతున్నారు. వరద సాయంలో జరిగిన కొన్ని అక్రమాలు టీఆర్‌ఎ్‌సకు మైన్‌సగా మారవచ్చని అంటున్నారు. దాంతో పాటు రోడ్ల విషయంలోనూ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వేసిన తర్వాతే ప్రచారానికి రావాలని యాప్రాల్‌లో ప్రజలు మైనంపల్లిని నిలదీసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఎన్నికలు కాగానే తన సొంతనిధులతో రోడ్డు వేయిస్తానంటూ మైనంపల్లి లిఖిత పూర్వక హామీ ఇవ్వాల్సి వచ్చింది. కాగా.. వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్‌లోనూ వరద సహాయం నిజమైన బాధితులు కొందరికి చేరలేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అనుచరులకే టికెట్లు

మల్కాజిగిరి, అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలోని నియోజకవర్గంలోని తొమ్మిది డివిజన్లలో తన వారికే టికెట్లు ఇప్పించుకోవడంలో మైనంపల్లి విజయవంతమయ్యారు. వారి గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకుని ప్రచారాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం. మల్కాజిగిరిలో ఏకంగా ముగ్గురు సిటింగులను మార్చి మరీ ఆయన తన వారికి టికెట్లను ఇప్పించుకున్నారు. అల్వాల్‌ పరిధిలోని అల్వాల్‌ డివిజన్‌, మచ్చబొల్లారం డివిజన్‌, వెంకటాపురం డివిజన్‌ల నుంచి సిటింగ్‌ కార్పొరేటర్లు చింతల విజయశాంతి, రాజ్‌ జితేందర్‌నాఽథ్‌, సబితా అనిల్‌ కిషోర్‌లకే టికెట్లను కేటాయించారు. రెబెల్‌ అభ్యర్థులను మైనంపల్లి శాంతింపచేసి వారి నామినేషన్లను విత్‌డ్రా చేయించారు. మరోవైపు.. బీజేపీ తమ పార్టీ ప్రచారంలో బీజేవైఎం ముఖ్యనాయకుల్ని రంగంలోకి దించింది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో విజయం దక్కించుకున్న రఘునందన్‌ రావును మల్కాజిగిరి ఇన్‌చార్జిగా బీజేపీ నియమించింది. ఆయనకు తోడు ఎమ్మెల్సీ రాంచందర్‌రావు కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి ఎంపీ రేవంత్‌ రెడ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్‌లు ప్రచారం నిర్వహిస్తున్నారు. అందరూ నువ్వా నేనా అన్నట్లు ప్రచారం నిర్వహిస్తుండటంతో.. మల్కాజిగిరి గ్రేటర్‌ రేసు ఆసక్తికరంగా మారింది.

Read more