ఇంట్లోనే నకిలీ ‘డాక్టర్ల’ తయారీ..!

ABN , First Publish Date - 2020-09-16T07:24:53+05:30 IST

రాచకొండలో వెలుగుచూసిన నకిలీ డాక్టర్‌ బాగోతంలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో

ఇంట్లోనే నకిలీ ‘డాక్టర్ల’ తయారీ..!

తేజ కేసులో కొత్త కోణాలు


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 15(ఆంధ్రజ్యోతి) : రాచకొండలో వెలుగుచూసిన నకిలీ డాక్టర్‌ బాగోతంలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 5వ తరగతి మాత్రమే చదివిన తేజ అలియాస్‌ వైఎస్‌ తేజ రెడ్డి అలియాస్‌ అవినాశ్‌ రెడ్డిని ఎంబీబీఎస్‌ డాక్టర్‌ను చేసిన నిందితుడి ఘనత విని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. కేవలం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసమని నకిలీ ధ్రువపత్రాలు  సంపాదించిన తేజ ఏకంగా ఎంబీబీఎస్‌ పట్టా పొంది బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో 20కి పైగా ఆసుపత్రుల్లో డాక్టర్‌గా చెలామణి అయ్యే స్థాయికి ఎదగడానికి ఢిల్లీకి చెందిన రణ్‌వీర్‌ సింగ్‌ అలియాస్‌ సునీల్‌ కుమార్‌ కారణమని పోలీసులు గుర్తించారు. సునీల్‌ కుమార్‌ ఈ దందాను ఇంట్లోంచే నడిపిస్తున్నట్లు తెలుసుకున్నారు. తన కింద సర్టిఫికెట్స్‌ తయారు చేసే నలుగురు కుర్రాళ్లను పెట్టుకున్నాడు. టెన్త్‌, ఇంటర్‌ సహా.. వివిధ రకాల యూనివర్సిటీలకు చెందిన ఇంజనీరింగ్‌, ఎంబీఏ, ఎంబీబీఎస్‌, ఎల్‌ఎల్‌బీ వంటి నకిలీ  ధ్రువపత్రాలన్నింటినీ ఇంట్లోనే రెడీ చేసి ఉంచుతారు. కస్టమర్‌ ఆర్డర్‌ను బట్టి అభ్యర్థి వివరాలు, మార్కుల అంకెలు, సంవత్సరం మార్చేసి నిమిషాల్లో సర్టిఫికెట్‌ రెడీ చేస్తారు. 


గుట్టురట్టు ఇలా..

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అవసరమైన పత్రాల కోసం.. తండ్రి వెంకట్రావు సహకారంతో ఒంగోలులోని గీతాంజలి కన్సల్టెన్సీ నిర్వాహకుడు బొక్కు శ్రీనివాసరావును తేజ కలిశాడు. రూ. లక్ష చెల్లించి 10వ తరగతి, ఇంటర్‌ పాసైనట్లు సర్టిఫికెట్స్‌ సంపాదించాడు. డబ్బులు పెడితే ఏ సర్టిఫికెట్‌ అయినా దొరుకుతుందని శ్రీనివాసరావు చెప్పడంతో అతని ద్వారా న్యూ ఢిల్లీలో ఎస్‌ఎస్‌ కన్సల్టెన్సీ నడుపుతున్న రణవీర్‌ సిన్హా అలియాస్‌ సునీల్‌ కుమార్‌ను కలిశాడు. అతనితో బేరం మాట్లాడి రూ. 6 లక్షలు చెల్లించి పండిట్‌ దీన్‌దయాళ్‌ మెడికల్‌ సైన్స్‌ కాలేజీ రాయ్‌పూర్‌ నుంచి 2010-2014 వరకు చదివినట్లు ఎంబీబీఎస్‌ పట్టా సాదించాడు. ఇదే తీగను పట్టుకొని కొద్దికొద్దిగా లాగిన పోలీసులకు ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న నకిలీ ముఠా గుట్టు లభించింది. 

Updated Date - 2020-09-16T07:24:53+05:30 IST