తాళం వేసిన ఇళ్లే టార్గెట్
ABN , First Publish Date - 2020-09-16T07:32:34+05:30 IST
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న రెండు దొంగల ముఠాల్లో ముగ్గురు నేరస్థులను మంగళవారం ఎల్‌బీనగర్ సీసీఎస్ పోలీసులు

రెక్కీ చేసి చోరీలకు పాల్పడుతున్న భార్యాభర్తలు
రెండు దొంగల ముఠాల్లో ముగ్గురి అరెస్టు
కొత్తపేట, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి) : ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న రెండు దొంగల ముఠాల్లో ముగ్గురు నేరస్థులను మంగళవారం ఎల్‌బీనగర్ సీసీఎస్ పోలీసులు ఇబ్రహీంపట్నం, బాలాపూర్ పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. ఎల్‌బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, క్రైమ్ డీసీపీ పి.యాదగిరి కేసుల వివరాలను వెల్లడించారు.
దంపతుల చోరీలు
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నరసరావుపేట, శివ సంజీవయ్య కాలనీకి చెందిన కత్తి రవికుమార్ (25) కొన్నాళ్ల పాటు అనంతపురం తాడిపత్రి టౌన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత అతడు నల్లగొండ జిల్లా దేవరకొండ, కొండమల్లేపల్లి మండలం, వెంకటేశ్వర కాలేజీ రోడ్‌లో ఉన్నాడు. అనంతరం రవికుమార్ తాడిపత్రి టౌన్‌కు చెందిన మేకల గీతాంజలి (21)ని పెళ్లాడి, ఆమెతో కలిసి కొండమల్లెపల్లిలో ఉంటున్నాడు. శివ సంజీవయ్య కాలనీలో ఉన్నప్పుడు చిన్ననాటి నుంచే అతడు నేరాల బాటపట్టాడు. అతడిని నరసరావుపేట, పిడుగురాళ్ల, సింగరాయకొండ, నకిరేకల్లు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా నకిరేకల్లు పోలీసులు గతేడాది అతడిని అదుపులోకి తీసుకుని ఒంగోలు జైలుకు తరలించారు. 2019 సెప్టెంబర్ 19వ తేదీన అతడు జైలు నుంచి విడుదలై పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు భార్యతో కలిసి అనంతపురం, సింగనమల్ల, బండమీదిపల్లిలో టీ కొట్టు పెట్టుకున్నాడు.
ఆదాయం అంతంత మాత్రమే ఉండడంతో అతడు కర్నూలు, అనంతపురం జిల్లాల గ్రామాల్లో చోరీలు చేయడం మొదలు పెట్టాడు. మొదట బైకు దొంగతనం చేసేవాడు. పోలీసుల నిఘా పెరగడంతో దంపతులు ఇద్దరూ బైకుపై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవారు. ఆ తర్వాత భార్య బయట నిఘాపెట్టేది. అతడు ఆయా ఇళ్లల్లో చోరీలు చేసేవాడు. తర్వాత వారు నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లికి మకాం మార్చారు. అక్కడే వంద చదరపు గజాల స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇబ్రహీంపట్నం ఖానాపూర్ గేట్ వద్ద సీసీఎస్ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి వారిద్దరినీ అరెస్టు చేశారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు వారు 17 కేసుల్లో నిందితులు. తెలంగాణలో 14, ఆంధ్రప్రదేశ్‌లో 3 కేసుల్లో వారిని అరెస్టు చేసినట్లు డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్, యాదగిరి తెలిపారు. కత్తి రవికుమార్‌పై 2016 నుంచి 2018 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 31 కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. వారి వద్ద ఉన్న 26 తులాల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు, 2 బైకులు, టీవీలు, స్థలం డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు.
సానుభూతి కోసం...
కాలనీల్లో తిరుగుతూ అద్దె ఇంటి కోసం వెతుకుతున్నామని, ప్రజల నుంచి సానుభూతి కోసం హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులమని ఆ భార్యాభర్తలు చెప్పేవారని డీసీపీలు తెలిపారు.
మరో ముఠా...
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉంటూ బ్యాండ్ మేళం ట్రూప్‌లో పనిచేసే దొంతుల మహేష్(21) అత్తాపూర్ హసన్‌నగర్‌కు చెందిన కొమ్మని శ్రీనివాస్ (30) దొంగల ముఠాలో సభ్యుడు. ఐదుగురు సభ్యులున్న ఈ ముఠాలో నాయకుడు కొమ్మని శ్రీనివాస్, రాచకొండ కార్తీక్, బండిగొల్ల విజయ్ కుమార్‌లను ఈ ఏడాదే జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కొమ్మని శ్రీనివాస్ పాత నేరస్థులతో ఈ ముఠాను తయారు చేశాడు. అతడి భార్య కస్తూరి ఉదయం కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేది. రాత్రి దొంగతనాలకు ముందు ముఠా సభ్యులంతా మద్యం తాగేవారు. బైకులపై మిగతా నలుగురూ ఆయా కాలనీల్లో తాళం వేసిన ఇళ్లకు చేరుకుని చోరీలకు పాల్పడేవారు. వీరిపై బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో 3, మీర్‌పేటలో 3, ఎల్‌బీనగర్‌లో 2, సరూర్‌నగర్, ఆదిభట్లలో ఒక్కో కేసు ఉన్నాయి. మంగళవారం ఉదయం 5 గంటలకు బాలాపూర్ శివాజీ చౌక్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న దొంతుల మహేష్‌ను సీసీఎస్, బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిపై గతేడాది అంబర్‌పేట, కంచన్‌బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో ఒక్కో కేసు నమోదైనట్లు తేలింది. అతడి వద్ద ఉన్న 5 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు, టీవీ, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యురాలు కొమ్మని కస్తూరి పరారీలో ఉంది. సమావేశంలో క్రైమ్ అదనపు డీసీపీ డి.శ్రీనివాస్, బాలాపూర్, ఇబ్రహీంపట్నం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.