శివార్లలో లింకు రోడ్లు

ABN , First Publish Date - 2020-09-16T07:23:29+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు లింకు రోడ్ల నిర్మాణం చేపట్టారు. అదే తరహాలో శివారు ప్రాంతాల్లో వాహనాలకు పెరుగుతున్న దూరాన్ని

శివార్లలో లింకు రోడ్లు

మరింతా మెరుగ్గా ప్రజా రవాణా

పలు మునిసిపాలిటీల మధ్య సులువైన ప్రయాణం

రూ. 204.09 కోట్లతో చేపట్టిన పనులు

హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌ నిర్వహణలో...


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి) :

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు లింకు రోడ్ల నిర్మాణం చేపట్టారు. అదే తరహాలో శివారు ప్రాంతాల్లో వాహనాలకు పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు లింకు రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ లింకు రోడ్లతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కావడంతో పాటు మెరుగైన ప్రజా రవాణా ఏర్పడనుంది. పలు మునిసిపాలిటీల మధ్య సులువైన రోడ్డు రవాణా మార్గాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌లు సంయుక్తంగా కలిసి శివారు ప్రాంతాల్లో 11 లింకు రోడ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే ఎనిమిది లింకు రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలోగా లింకు రోడ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.


నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌లు నిర్మించిన లింకు రోడ్లతో సులువుగా ప్రయాణించే మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు చుట్టూ తిరుగుతూ వెళ్లే వాహనదారులకు లింకు రోడ్లు ఎంతో ఉపయోగకరంగా మారాయి. అదే తరహాలో శివారు ప్రాంతాల్లో వివిధ ప్రాంతాలను కలుపుతూ లింకు రోడ్లను నిర్మించేందుకు నిర్ణయించారు. శివారులోని వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు అనుసంధానం చేసే మాస్టర్‌ప్లాన్‌లోని వంద అడుగుల రోడ్లను నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం 8 లింకు రోడ్లను 17.28 కిలోమీటర్ల మేర రూ. 204.09 కోట్లతో చేపడుతున్నారు.


లింకు రోడ్లు ఇవే...

  • షేక్‌పేట దర్గా జంక్షన్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డులోని సర్వీసు రోడ్డులో గల మై హోం అవతార్‌ వరకు 3 కిలోమీటర్ల మేర రూ. 23.29 కోట్లతో నాలుగు లేన్ల రహదారి.
  • చిత్రపురి కాలనీ నుంచి నాలా మీదుగా మణికొండ వరకు 0.70 కిలోమీటర్లు రూ. 6.54 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు.
  • ఐఎస్‌బీ రోడ్డు నుంచి ల్యాంకోహిల్స్‌ జంక్షన్‌ వరకు 3.10 కిలోమీటర్ల మేర రూ. 20.79 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
  • రాధిక ఎక్స్‌ రోడ్డు నుంచి బాలాజీనగర్‌ డంపింగ్‌ యార్డ్‌ వరకు 3.10 కిలోమీటర్ల మేర రూ. 15.49 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు.
  • బోడుప్పల్‌ కాలనీ రోడ్డు నుంచి పద్మావతికాలనీ బస్టాప్‌, రామ చెరువు మీదుగా మల్లాపూర్‌ రోడ్డు వరకు 0.94 కిలోమీటర్లు రూ. 3.23 కోట్లతో  పనులు జరుగుతున్నాయి.
  • ఉప్పల్‌లోని బతుకమ్మ ఘాట్‌ నుంచి ఆర్‌బీఎం మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ మీదుగా బోడుప్పల్‌ కాలనీ రోడ్డు వరకు 1.20 కిలోమీటర్లు రూ. 3.11 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు.
  • నాగోల్‌లోని సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌బోర్డు నుంచి మూసీనది మీదుగా పీర్జాదిగూడ వరకు 4.74 కిలోమీటర్లు రూ. 32.51 కోట్లతో నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తున్నారు.
  • నెక్నాంపూర్‌ రోడ్డు నుంచి అలకాపురి టౌన్‌షిప్‌ మీదుగా ఉస్మాన్‌సాగర్‌ రోడ్డు వరకు 0.50 కిలోమీటర్లు రూ. 6.32 కోట్లతో నిర్మాణ పనులు.
  • హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ పరిధిలోని గ్రీడ్‌ రోడ్ల కారిడార్‌ను వివిధ ప్రాంతాల్లో 17.28 కిలోమీటర్లు రూ. 111.28 కోట్లతో చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.

Updated Date - 2020-09-16T07:23:29+05:30 IST