మంత్రి, టీఆర్‌ఎస్‌ నేతల భూకబ్జాలు: ఎమ్మెల్సీ రాంచందర్‌రావు

ABN , First Publish Date - 2020-12-30T06:25:10+05:30 IST

జవహర్‌నగర్‌లో మంత్రి మల్లారెడ్డితోపాటు టీఆర్‌ఎ్‌సకు చెందిన ప్రజాప్రతినిధులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆరోపించారు.

మంత్రి, టీఆర్‌ఎస్‌ నేతల భూకబ్జాలు: ఎమ్మెల్సీ రాంచందర్‌రావు

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): జవహర్‌నగర్‌లో మంత్రి మల్లారెడ్డితోపాటు టీఆర్‌ఎ్‌సకు చెందిన ప్రజాప్రతినిధులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆరోపించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసరలో మంగళవారం బీజేపీ రూరల్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు పి.విక్రంరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారుల తప్పిదాల వల్లే భూకబ్జాలు, అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సర్వేనెంబర్‌ 488,495,35లో దాదాపు 700 గజాల ప్రభుత్వ స్థలంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నిర్మాణాలు చేపట్టగా, వాటిని తహసీల్దార్‌ కూల్చివేసి ప్రభుత్వ భూమిగా బోర్డు పెట్టారని తెలిపారు. ఇదే స్థలంలో సీఎంఆర్‌(చామకూర మల్లారెడ్డి) ఆస్పత్రి పేరుతో నిర్మాణం ఏ విధంగా జరిగిందని రాంచందర్‌రావు ప్రశ్నించారు.


ఆ పక్కనే ఉన్న జవహర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని నిర్మించి, సీఎంఆర్‌ ఆస్పత్రిలో కలిపారని ఆరోపించారు. సర్వేనెంబర్‌ 488లో దాదాపు 1800 గజాల ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే గోడౌన్‌ షెడ్డు నిర్మించారని తెలిపారు.  మోహన్‌రావు కాలనీలో సర్వే నెంబర్‌ 608లో దాదాపు 600 గజాల కమ్యూనిటీ హాలుస్థలం కబ్జా చేశారని, అందులో అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. జవహర్‌నగర్‌లోని చాలావరకు ప్రభుత్వ స్థలాలు టీఆర్‌ఎస్‌ నేతల ఆధీనంలో ఉన్నాయని, వీటిన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. పేదలకు న్యాయం చేయాలని ఆందోళన చేసిన బీజేపీ నాయకులపై 307 సెక్షన్‌ కింద కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీజేపీ మేడ్చల్‌ నియోజకవర్గం కన్వీనర్‌ అమరం మోహన్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట అధికార ప్రతినిధి జిల్లాల తిరుమల్‌రెడ్డి, కృష్ణాగౌడ్‌, దేశం మల్లే్‌షగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T06:25:10+05:30 IST