కంభంపాటి స్వయంప్రకాష్‌ ఆశయాలను కొనసాగిస్తాం

ABN , First Publish Date - 2020-03-13T09:48:57+05:30 IST

ప్రముఖ సెక్సాలజిస్ట్‌ దివంగత కంభంపాటి స్వయంప్రకాష్‌ ఆశయాలను కొనసాగిస్తామని డాక్టర్‌ కంభంపాటి స్వయంప్రకాష్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ రామలక్ష్మీ స్వయం ప్రకాష్‌ చెప్పారు.

కంభంపాటి స్వయంప్రకాష్‌ ఆశయాలను కొనసాగిస్తాం

అవార్డుల ప్రదానోత్సవంలో రామలక్ష్మీ స్వయం ప్రకాష్‌


పంజాగుట్ట, మార్చి12 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సెక్సాలజిస్ట్‌ దివంగత కంభంపాటి స్వయంప్రకాష్‌ ఆశయాలను కొనసాగిస్తామని డాక్టర్‌ కంభంపాటి స్వయంప్రకాష్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ రామలక్ష్మీ స్వయం ప్రకాష్‌ చెప్పారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో స్వయంప్రకాష్‌ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులను అందజేశారు. ముందుగా సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ విజయ్‌బాబు, ప్రముఖ వైద్యుడు ఆవులప్ప, నియో ఎడ్యుకేషన్‌ సొసైటీ చైర్మన్‌ నియోరాజు, రామలక్ష్మి స్వయంప్రకాష్‌, ఆయన కూతురు డాక్టర్‌ లలిత, కొడుకు డాక్టర్‌ శ్రీనివాస్‌ కంభంపాటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్‌ దివ్యా సునీతారెడ్డికి, డాక్టర్‌ రాకేష్‌ కుమార్‌కు మెమోరియల్‌ అవార్డును, శంకర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి పవన్‌రేఖను సన్మానించి ఫౌండేషన్‌కు రూ.20 వేల చెక్కును ఇవ్వడంతోపాటు ఆయుర్వేద వైద్యంలోని రసశాస్త్రంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్‌ నవ్యశ్రీకి బంగారు పతకంతో పాటు రూ.5 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా విజయ్‌బాబు మాట్లాడుతూ సెక్సాలజీ గురించి అశ్లీలతకు తావు లేకుండా హుందాగా స్వయం ప్రకాష్‌ వ్యాసాలు రాయడమే కాకుండా సెక్సాలజీపై ఎంతో మందికి అవగాహన కల్పించారని తెలిపారు. తక్కువ వ్యవధిలోనే అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న వైద్యుడు కంభంపాటి అన్నారు. ఆయన చొరవతోనే మొదటిసారిగా దేశంలో అంతర్జాతీయ సెక్సాలజిస్టుల సదస్సు జరిగిందన్నారు. భౌతికంగా ఆయన ఇక్కడ లేకున్నా.. ఎప్పుడూ తమ మధ్యలోనే ఉంటారని రామలక్ష్మీ స్వయం ప్రకాష్‌ అన్నారు. పాఠశాల స్థాయి నుంచే సెక్స్‌ ఎడ్యుకేషన్‌పై విద్యార్థులకు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అవగాహన కల్పించనున్నట్లు డాక్టర్‌ లలిత చెప్పారు. ‘సేఫ్‌ టచ్‌... అన్‌ సేఫ్‌ టచ్‌’ గురించి వివరించడమే కాకుండా సెక్సాలజీపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు, స్వయం ప్రకాష్‌ స్నేహితులు, కుటుంబసభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు.

Updated Date - 2020-03-13T09:48:57+05:30 IST