అప్రమత్తంగా ఉన్నాం..

ABN , First Publish Date - 2020-03-02T09:24:08+05:30 IST

చైనాను కుదిపేస్తున్న కొవిడ్‌ (కరోనా) పలు దేశాలకు విస్తరిస్తోంది. ఎక్కడ మన వరకూ వస్తుందోనన్న ఆందోళనతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.

అప్రమత్తంగా ఉన్నాం..

చైనాను కుదిపేస్తున్న కొవిడ్‌ (కరోనా) పలు దేశాలకు విస్తరిస్తోంది. ఎక్కడ మన వరకూ వస్తుందోనన్న ఆందోళనతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. అనుమానితులను ఆస్పత్రులకు తరలించి నమునాలు సేకరించి నిర్ధారణ చేసుకుంటున్నారు. చికెన్‌ తింటే కొవిడ్‌ వస్తుందని జనంలో భయం పట్టుకుంది. సోషల్‌ మీడియాలో ఇదే విషయం విస్తృతంగా వైరల్‌ అవుతోంది. చికెన్‌ తినడం వల్ల వైరస్‌ రాదనే విషయం తెలిసినప్పటికీ ఎందుకైనా మంచిదనే భావంతో చాలా మంది దానికి దూరంగా ఉంటున్నారు. దీంతో ధరలు పడిపోయాయి. కిలో చికెన్‌ రూ. 120 నుంచి 140 వరకు ఉంది. మొదట్లో చాలా మంది అనుమానంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. అవగాహన పెరగడంలో ఆందోళన కొంత మేరకు తగ్గింది. ఈ నేపథ్యంలో వైర్‌సపై ప్రజలకు ఎంత వరకు అవగాహన ఉందో తెలుసుకోవడానికి ‘ఆంధ్రజ్యోతి’ విస్తృత సర్వే నిర్వహించింది. 


ఎలా వ్యాపిస్తోందో తెలుసు...

కరోనా వైరస్‌ మనిషి నుంచి మనిషి ద్వారా వ్యాపిస్తుందని మెజార్జీ ప్రజలు పేర్కొన్నారు. వైరస్‌ గాలిలో విహారం చేస్తుందని, తుమ్మినా, దగ్గినా, అవలించినా బాధితుల నుంచి ఇతరులకు సోకే ముప్పు ఉందని పలువురు పేర్కొన్నారు. జంతువుల ద్వారా వస్తుందని వెయ్యిలో 250 మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. 


చర్యలు తీసుకున్నారు..

చైనాలో కొవిడ్‌ మృతులు, బాధితుల సంఖ్య పెరగడంతో దేశం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో దేశంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారా అనే ప్రశ్నకు చాలా మంది అవునని చెప్పారు. ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో వైరస్‌ ప్రత్యేక వార్డులతో పాటు, అత్యవసర చికిత్స వార్డులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన విషయంపై చాలా మందికి అవగాహన ఉంది. 


జాగ్రత్తలు తెలుసు...

వైరస్‌ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన ఉందని 550 మంది పేర్కొన్నారు. జాగ్రత్తలు పూర్తిగా తెలియవని 450 మంది వివరించారు. మురికివాడలు, బస్తీలు, భవన నిర్మాణ కార్మికుల్లో ఇంకా అవగాహన లేదని, జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడ్డారు. 


చికిత్స లేని జబ్బు

కోవిడ్‌ వస్తే ప్రస్తుతం చికిత్స అందించే పరిస్థితి లేదని చాలా మందికి అవగాహన ఉంది. ఇంకా చికిత్స, మందులు అందుబాటులో లేవని 650 మంది పేర్కొనగా, 350 ప్రస్తుతమున్న మందులు, ఐసోలేటెడ్‌ చేసుకుంటే కొంత వరకు జబ్బును నియంత్రించే అవకాశముందని పేర్కొన్నారు.


చికెన్‌ బెటర్‌

నాన్‌వెజ్‌లో చాలా మంది చికెన్‌ తినడానికే ఆసక్తి చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది చికెన్‌ ఎక్కువగా తింటున్నట్లు పేర్కొన్నారు. తాము ఎక్కువగా చికెన్‌ తింటున్నామని 500 మంది, మటన్‌ తెచ్చుకుంటామని 300 మంది, చేపలపై ఆసక్తి ఉంటుందని 200 మంది పేర్కొన్నారు. 


భయంతో...

వైరస్‌ ఎఫెక్ట్‌ చికెన్‌పై బాగా పడింది. చికెన్‌ తింటే కరోనా వస్తుందనే అనుమానాన్ని సర్వేలో పాల్గొన్న 550 మంది వ్యక్తం చేశారు. రాదని మరో 440 మంది పేర్కొన్నారు. చికెన్‌ తింటే కరోనా వైరస్‌ వస్తుందా...! రాదా...!! అనే విషయం పక్కన పెడితే ఎందుకైనా మంచిదని తినడం లేదని కొందరు తెలిపారు.  


కొవిడ్‌పై ప్రజల్లో అవగాహన పెరిగింది. గతంలో స్వైన్‌ఫ్లూ వచ్చినప్పుడు ఆ వైరస్‌ గురించి తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టింది. కరోనా వైరస్‌ గురించి ఇప్పటికే చాలా మంది తెలుసుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ గురించి మీకు తెలుసా అని ప్రశ్నించగా... 830 మంది అవునని, 170 మంది పెద్దగా అవగాహన లేదని స్పష్టం చేశారు. స్వైన్‌ఫ్లూ, కరోనా రెండు వైర్‌సల లక్షణాలు ఇంచుమించు ఒకే రకంగా ఉండడంతో పసిగట్టే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. 



అవగాహన పెరిగింది.. రాము (లెక్చరర్‌-సికింద్రాబాద్‌)

వైరస్‌ గురించి ప్రచారం బాగా చేయడంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. మొదట్లో భయపడినప్పటికీ, ప్రస్తుతం ఆ భయం లేదు. ముందస్తుగా గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడం వలన ప్రజల్లో ధైర్యం పెరిగింది. అనుమానం ఉన్న వారు పరీక్షలు చేయించుకుని నిర్దారణ చేసుకుంటే భయం పోతుంది. 


అలవాట్లు, ఆహారంపై అవగాహన కల్పించాలి... లక్ష్మణ్‌, డీజే నిర్వాహకుడు, చంపాపేట.

వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలి. వైరస్‌ ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి. చైనాతో సహా పలు దేశాలకు వైరస్‌ వ్యాప్తి చెందింది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు, ప్రజలకు ఆహార అలవాట్లపై సూచనలు, సలహాలు అందించాలి.


వైరస్‌పై ఆందోళన.. సతీష్‌కుమార్‌, యువజన సంఘం నాయకుడు, బలిజగూడ

కోవిడ్‌పై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీని కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలి. వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, ఎలా వ్యాపిస్తుందనే విషయాలను గ్రామ స్థాయిలో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేయాలి. 


చికెన్‌తో వైరస్‌ సోకదు..  డాక్టర్‌ ఏ. రఘుకాంత్‌, సీనియర్‌ పల్మనాలజిస్టు, మెడికవర్‌ ఆస్పత్రి

కరోనా వైరస్‌ చికెన్‌ వల్ల రాదు. మన దగ్గర చికెన్‌ను ఎక్కువ మంటలో చాలా సమయం ఉడికించి తింటాం. దాని వల్ల వైరస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఎక్కువ ఉష్ణోగ్రతలో వైరస్‌ బతకడం కష్టం. మరో వైపు కోళ్లలో వైరస్‌ ప్రభావం లేదు. కేవలం భయం వల్లనే జనం చికెన్‌ తినడం తగ్గించారు. చైనాలో పచ్చి మాంసం తినడం వల్ల వైరస్‌ ప్రభావం ఉంది. మన దగ్గర మేక, కోళ్లు, చేపలను బాగా కడిగి, ఎక్కువ మంట మీద ఉడికించి తింటాం. కాబట్టి ఇబ్బంది ఉండదు.


Updated Date - 2020-03-02T09:24:08+05:30 IST