9 అడుగుల్లో ఖైరతాబాద్‌ గణేశ్‌

ABN , First Publish Date - 2020-08-20T09:45:43+05:30 IST

దేశంలోనే ఎత్తైన గణేశ్‌ విగ్రహంగా ఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ గణపతి తొలి నాళ్లను గుర్తు చేస్తూ కేవలం 9 అడుగుల ఎత్తులో

9 అడుగుల్లో ఖైరతాబాద్‌ గణేశ్‌

ఖైరతాబాద్‌ ఆగష్టు 19 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే ఎత్తైన గణేశ్‌ విగ్రహంగా ఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ గణపతి తొలి నాళ్లను గుర్తు చేస్తూ కేవలం 9 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. కరోనా విజృంభన నేపథ్యంలో ఉత్సవ కమిటీ ప్రభుత్వ వర్గాల సూచన, భక్తుల ఆరోగ్య భద్రతలను పాటిస్తూ ఉత్సవాలను ఆడంబరాలు లేకుండా నిర్వహిస్తున్నారు. ప్రతిసారీ దాదాపు 50 లక్షల రూపాయల నుంచి 70 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ వైభవంగా ఉత్సవాలు జరపగా 11 రోజుల్లో 15 నుంచి 20 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చేవారు. ఈ సారి మొత్తం 8 లక్షల ఖర్చుతో ఉత్సవాలు జరుపుతూ భక్తులకు నేరుగా దర్శన అవకాశం లేదు. 


ధన్వంతరీ రూపంలో కరోనా ఔషధంతో...

ఏటా వివిధ రూపాలలో భక్తులకు వైవిధ్యంగా దర్శనమిచ్చే ఖైరతాబాద్‌ గణపతి ఈసారి తక్కువ ఎత్తులో తయారైనా.. చూడముచ్చటగా ముస్తాబయ్యాడు. కరోనా మహమ్మారిని అంతం చేసే ఔషధాన్ని తీసుకువస్తున్న దేవతల వైద్యుడు ధన్వంతరి నారాయణుడి రూపంలో గణపతి ముస్తాబయ్యాడు. గణపతికి కుడి వైపున మహాలక్ష్మీ దేవి, ఎడమ వైపున మహా సరస్వతీదేవి విగ్రహాలు 5 అడుగుల ఎత్తులో మరో ప్రత్యేక ఆకర్షణగా ముస్తాబయ్యాయి. 


1970 తర్వాత ఈ సారి...

1970వ సంవత్సరంలో 9 అడుగుల ఎత్తుతో గణపతిని తయారుచేశారు. అప్పట్లో ఉగ్ర రూప వినాయకుడిగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. తిరిగి 50 సంవత్సరాల అనంతరం కరోనా నేపథ్యంలో మరోసారి 9 అడుగులుగా దర్శనం ఇవ్వనున్నాడు.


చాలా సంవత్సరాలకు మట్టి గణపతిగా...

66 సంవత్సరాల ఖైరతాబాద్‌ గణపతి చరిత్రలో దాదాపు 45 సంవత్సరాల అనంతరం ఈసారి మట్టి గణపతిని ఉత్సవ కమిటీ తయారు చేస్తోంది. హైదరాబాద్‌కే చెందిన నగే్‌షతో పాటు దాదాపు 20మంది కలకత్తాకు చెందిన కళాకారులు, ఈనెల 6వ తేదీన గణపతి పనులను ప్రారంభించగా విగ్రహ తయారీ దాదాపు పూర్తయ్యింది. పెయింటింగ్‌ పనులు గురువారం పూర్తవుతాయని, చవితికి ముందురోజైన శుక్రవారం గణపతికి కళ్లు అమర్చి ప్రాణ ప్రతిష్ట చేస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్‌ సుదర్శన్‌ తెలిపారు.


వినాయకుడి తయారీ కోసం 25 కిలోల బరువున్న బంకమట్టి బ్యాగులు 30, 50 కట్టల వరిగడ్డి, బియ్యం పొట్టు 50 కిలోలు, సహజరంగులు వినియోగించినట్టు శిల్పి కె.నగేష్‌ ముదిరాజ్‌ తెలిపారు. గణపతి పై గొడుగు ఈసారి మరో ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. కలకత్తా నుంచి ప్రత్యేకంగా తయారుచేసిన ముత్యాలు, వజ్రాల(గిల్టు)నగలతో గొడుగును తయారు చేయిస్తున్నారు. లక్షీ, సరస్వతుల విగ్రహాలకు తొలిసారిగా చేతితో తయారైన ఆభరణాలు, కిరీటాలు మరో ఆకర్షణగా నిలవనున్నాయి.

Read more