చర్లపల్లి కారాగారంలో ఆకస్మిక తనిఖీ
ABN , First Publish Date - 2020-12-13T05:51:13+05:30 IST
చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని శనివారం రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేశారు.

కుషాయిగూడ, డిసెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని శనివారం రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారి సంస్కరణల కోసం చేపడుతున్న కార్యక్రమాలు, పరిశ్రమలలో పనిచేసే ఖైదీల భద్రత, భోజనం, విద్య, వైద్య సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా సంజీవిని ఆస్పత్రిలో ఖైదీలకు వైద్యులు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం జైలు పరిశ్రమలలో తయారవుతున్న వివిధ ఉత్పత్తులు, శానిటైజర్, టైలరింగ్ యూనిట్లను సందర్శించారు. ఖైదీలకు అందజేస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం జైలు అధికారులతో సమావేశమై మరింత మెరుగైన ఏర్పాట్ల గురించి సూచనలు చేశారు. జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్, డీఎస్ కృష్ణమూర్తి, వెంకటేశం అధికారులకు జైలు పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం సభ్యుడు ఎన్.ఆనందరావు, జైళ్లశాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఎం.ఆర్.భాస్కర్, జైలర్లు మొగిలేష్, ఎన్.దేవీసింగ్, జి.జ్యోతీశ్వర్ రెడ్డి, యు.పరశురాములు, డిప్యూటీ జైలర్లు ఆర్.కృష్ణ, జె.నెహ్రూ, మధు తదితరులు పాల్గొన్నారు.