బాధితులకు బాసటగా నిలవాలి...

ABN , First Publish Date - 2020-12-11T06:23:27+05:30 IST

బాధితులకు బాసటగా నిలవాలి...

బాధితులకు బాసటగా నిలవాలి...

దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్‌ ఝాన్సీ

ఆదివాసీ, దళిత మహిళలు, బాలికలపై హింసకు వ్యతిరేకంగా సదస్సు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి) : దళిత, ఆదివాసీ అమ్మాయిలు, మహిళలపై హింస నానాటికీ పెచ్చుమీరుతోందని, నేరస్తులకు తగిన శిక్ష పడకపోవడమే అందుకు ప్రధానకారణమని దళిత స్త్రీ శక్తి సంఘటన జాతీయ కన్వీనర్‌ గడ్డం ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు స్త్రీలపై హింస వ్యతిరేక ప్రచారోద్యమం ముగింపు సందర్భంగా గురువారం నాంపల్లిలోని మదీనా విద్యాసంస్థల సభామందిరం వేదికగా దళిత, ఆదివాసీ మహిళలపై హింసకు వ్యతిరేకంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్యా దేవరాజ్‌, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి యోగితా రాణా, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ వైజయంతి తదితర ఉన్నతాధికారులు ఆన్‌లైన్‌ ద్వారా కుల వివక్షతో పాటు లైంగిక దోపిడీకి గురైన 20 మంది బాధితురాళ్ల గోడు విన్నారు. సమాజంలోని కుల, లింగ వివక్ష పాతుకుపోయాయనడానికి సదస్సులోని బాధితుల ఆక్రందనలే నిదర్శనమని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల ఫోరం కన్వీనర్‌ సిద్దోజీరావు ఆందోళన వ్యక్తం చేశారు. కన్వీనర్‌ ఝాన్సీ మాట్లాడుతూ బాధితురాళ్లకు నష్టపరిహారంతో పాటు బాలికలకు చదువు, వసతి సౌకర్యాలను కల్పించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో ఆల్‌ ఇండియా ఎస్టీ, ఎస్సీ ఫెడరేషన్‌ ప్రతినిధి నరసింగరావు, అధ్యాపకురాలు రజిత, డాక్టర్‌ సుదర్శన్‌ బాలబోయిన తదితరులు పాల్గొన్నారు.


మా కొడుకుపై అత్యాచారం చేసినరు....

-  బాధిత బాలుడి తండ్రి.

బతుకుదెరువుకోసం వరంగల్‌జిల్లా, అన్నారం తండా నుంచి సిటీకొచ్చినం. సికింద్రాబాద్‌లోని ఒక అపార్టుమెంట్‌లో నేను, నా భార్య పనిచేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నం. అదే ఏరియాలో డ్రైవర్‌గా పనిచేసే వాడు మా పెద్ద పిల్లగాడి(10)పై అత్యాచారం చేసిండు. ‘ఆ సంగతి ఇంట్లో చెబితే, చంపుతానని’ పిల్లాడిని విపరీతంగా కొట్టిండు. ఆ దెబ్బలకు అంగం మీద పెద్దగాయమై, మూత్రంకూడా బంద్‌ అయిండె. ఆస్పత్రిలో పదిరోజులుంచి ట్రీట్‌మెంట్‌ ఇప్పించినం. అప్పుతెచ్చి యాభై వేలదాంకా బిల్లు కట్టినం. ఇది జరిగి ఏడాదవుతున్నా, పిల్లగాడు ఇంకా మామూలు పరిస్థితికి రాలె. 


తక్కువ కులమన్నాడు....

  -  బాధితురాలు

‘‘మేము ఎస్సీ. ఆయన యాదవ. ఇద్దరం ప్రేమించి, పెళ్లిచేసుకున్నాం. ఇప్పుడు మా కొకబాబు. మమ్మల్ని తన కుటుంబ సభ్యులుగా బయట ప్రపంచం ముందు అంగీకరించడం లేదు. పైగా నాకు తెలియకుండా, వాళ్ల కులంలోనే మరొక అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. మరి, నా సంగతేంటని అడిగితే, తక్కువ కులమని చులకన చేశాడు. ఎన్నో సార్లు తిట్టాడు. కొట్టాడు. ఇప్పుడు ఒంటరిగా మిగిలా. నా బిడ్డకైనా న్యాయం చేయమని కోర్టుకెళ్లాను. మమ్మల్ని ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నా’’ అని తన గోడు చెబుతూ, బాధితురాలు కన్నీటిపర్యంతమయ్యారు.


ప్రేమించి, పెళ్లాడి.. తెలియదంటున్నాడు

    -  బాధితురాలు మనోవేదన

అతను, నేనూ మూడేళ్ల కిందట ప్రేమించుకున్నాం. గతేడాది పెళ్లి చేసుకున్నాం. తర్వాత వాళ్లింటికి తీసుకెళ్లాడు. వాళ్లు నన్ను ఒక గదిలో బంధించి, ఎండు మిరపకాయల పొగేశారు. రెండు రోజుల తర్వాత అక్కడ నుంచి తప్పించుకున్నా. తర్వాత మా అమ్మనాన్న అతన్ని నిలదీస్తే, అసలు అమ్మాయి ఎవరోకూడా నాకు తెలియదన్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే, నీ ఫొటోలు సోషల్‌మీడియాలో పోస్టు చేస్తానని నన్ను బెదిరించాడు. కేవలం తక్కువ నేను దళిత్‌ కావడం వల్లే అతని తల్లిదండ్రులు నన్ను వదిలించుకోవాలనుకున్నారు.


 ఉల్టా కేసు పెట్టిండ్రు...

- బాధితురాలి తండ్రి మనో వ్యథ

నాకు ఏడుగురు బిడ్డలు. నా పెద్దకూతురు దూడలు మేపనీకి పోయినప్పుడు, ఇద్దరు పోరగాళ్లు అఘాయిత్యం చేసిండ్రు. నా కూతురు ఒంటిపై గాయాలు చూసి, కడుపుమండి పోయి వాళ్లను కొట్టిన. వాళ్లంతా కలిసి నాపై ‘‘కొట్టినడు’’ అని ఉల్టా కేసు పెట్టిండ్రు. పైపెచ్చు ఊర్లోని వాళ్ల కులం పెద్దమనుషులంతా నామీదకొస్తున్నరు. పోలీసోళ్లూ వాళ్ల దిక్కే ఉన్నరు. మాకు న్యాయం జేయమని మేడం వాళ్లను చేతులెత్తి మొక్కుతున్నా...


Updated Date - 2020-12-11T06:23:27+05:30 IST