నకిలీ సర్టిఫికెట్లతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
ABN , First Publish Date - 2020-08-20T09:55:18+05:30 IST
నకిలీ విద్యార్హతల సర్టిఫికెట్లు తయారు చేసే ఉద్యోగాలు ఇప్పిస్తున్న ముఠా సభ్యులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు

నలుగురు నిందితుల అరెస్టు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నకిలీ విద్యార్హతల సర్టిఫికెట్లు తయారు చేసే ఉద్యోగాలు ఇప్పిస్తున్న ముఠా సభ్యులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మాలోత్ మచేందర్(46) మల్కాజిగిరిలో నివసిస్తూ దక్షిణ మధ్య రైల్వేలో సీనియర్ గ్రేడ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మోసాలు చేసే అలవాటున్న అతడు గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసుల్లో 2014లో మల్కాజిగిరి, 2019లో గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. 2018 మార్చి 9న పోస్టల్ శాఖలో ఉద్యోగాల నిమిత్తం నోటిఫికేషన్ జారీ కావడంతో ఉద్యోగాలిప్పిస్తానని అమాయక నిరుద్యోగులను నమ్మించాడు. వారి పేరిట అధిక మార్కులు వచ్చినట్లు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయసాగాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న హబ్సిగూడ ప్రాంతానికి చెందిన మల్లాది సంతో్‌షరెడ్డి(31)కి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసే పని అప్పగించాడు.
సంతోష్ ఆన్‌లైన్‌లో ఎస్‌ఎ్‌ససీ సర్టిఫికెట్ మార్కుల షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని 97 నుంచి 98 శాతం మార్కుల మెమోలు తయారు చేసి ఇస్తున్నాడు. నకిలీ సర్టిఫికెట్లతో అమ్ముల రాజేశ్‌కుమార్, ఆకుల జయంత్‌కుమార్, ఎస్. దీపిక పోస్టల్ విభాగంలో గ్రామీణ్ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా ఎంపికయ్యారు. ఒక్కొక్కరి నుంచి రూ. 3 లక్షలు వసూలు చేశారు.
వారికి ఉద్యోగాలు వచ్చిన ఆధారాలు చూపించి పలువురు నిరుద్యోగుల నుంచి మచేందర్, సంతో్‌షరెడ్డి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం దాడి చేసి ప్రధాన నిందితుడు మచేందర్, అతడికి సహకరించిన సంతో్‌షరెడ్డి, సర్టిఫికెట్లు కొనుగోలు చేసి పోస్టల్ ఉద్యోగం పొందిన రాజేశ్‌కుమార్(30), ఆకుల జయంత్‌కుమార్ (39)ను అరెస్టు చేశారు. వారి నుంచి 13 నకిలీ ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమోలు, ల్యాప్‌టాప్, పోస్టల్ శాఖకు చెందిన కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.