జనతా కర్ఫ్యూ సక్సెస్‌

ABN , First Publish Date - 2020-03-23T09:23:14+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ ప్రశాంతంగా, విజయవంతంగా సాగిందని రాచకొండ సీపీ మహేష్‌ మురళీధర్‌ భాగవత్‌ వెల్లడించారు.

జనతా కర్ఫ్యూ సక్సెస్‌

కొత్తపేట, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ ప్రశాంతంగా, విజయవంతంగా సాగిందని రాచకొండ సీపీ మహేష్‌ మురళీధర్‌ భాగవత్‌ వెల్లడించారు. ఆదివారం ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిషనరేట్‌ పరిధిలోని ఎల్‌బీనగర్‌, భువనగిరి, యాదాద్రి, ఆలేరు, కీసర, చౌటుప్పల్‌ తదితర ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారని వివరించారు. విజయవాడ జాతీయ రహదారితో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయని చెప్పారు. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, విద్యుత్‌, నీటి సరఫరా తదితర అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాచకొండ పరిధిలో 22 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలు ఉంటే వివరాలు నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. 


అనుమానితులు ఉంటే..

విదేశాల నుంచి వచ్చేవారిలో, స్థానికుల్లోనూ కరోనా వైరస్‌ అనుమానితుల ఉంటే ప్రజలు సామాజిక బాధ్యతగా 100 డయల్‌ చేసి గాని, వాట్సాప్‌ కంట్రోల్‌ నెం. 94906 17111 ద్వారా గానీ సమాచారం ఇవ్వవచ్చని సీపీ తెలిపారు. అనుమానిత కేసులుంటే వైద్య ఆరోగ్య శాఖ వారు, పోలీసులు, సంబంధిత అధికారులు స్పందిస్తారని, వైద్య పరీక్షల అనంతరం అవసరాన్ని బట్టి సదరు వ్యక్తులకు హోం క్వారంటైన్‌లో ఉండేలా లేదా ఆస్పత్రిలో ఉండేలా చర్యలు తీకుంటున్నామన్నారు.  


నిత్యావసరాల కొరత సృష్టిస్తే చర్యలు

కరోనా నేపథ్యంలో ఎక్కడైనా నిత్యావసరాల తాత్కాలిక కొరత సృష్టించే వారిపైనా దృష్టి సారిస్తున్నామని సీపీ తెలిపారు. ఆదివారం నాటి పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా ఉంటుందని వదంతులు వ్యాపింపజేస్తూ కొందరు నిత్యావసర సరుకుల తాత్కాలిక కొరత సృష్టించే ప్రమాదముందన్నారు.   


వదంతులు నమ్మవద్దు 

కరోనా వైర్‌సపై  సోషల్‌ మీడియాలో పోస్టు అయ్యే వదంతులు నమ్మవద్దని సీపీ భాగవత్‌ వెల్లడించారు. వదంతులు వ్యాపింపజేసే నిందితులపై నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మంట్‌ యాక్టు ప్రకారం సంవత్సరం పాటు జైలు శిక్షతో పాటు ఫైన్‌ కూడా ఉంటుందని గుర్తు చేశారు. 

Updated Date - 2020-03-23T09:23:14+05:30 IST