జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్‌.. గూగుల్‌ మ్యాప్‌లో గ్రీన్‌మార్క్‌

ABN , First Publish Date - 2020-03-23T09:26:47+05:30 IST

సాధారణ రోజుల్లో బయటకు వెళ్లే ముందు ఒకసారి గూగుల్‌ మ్యాప్‌లో ట్రాఫిక్‌ పరిస్థితిని తెలుసుకోవడం చాలా మంది చేస్తున్న పనే.

జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్‌.. గూగుల్‌ మ్యాప్‌లో గ్రీన్‌మార్క్‌

 హైదరాబాద్‌ మహానగరంలో మొదటి సారి

రోడ్లెక్కని వాహనాలు

ఎటు చూసినా ఖాళీగా రహదారులు


హైదరాబాద్‌ సిటీ, మార్చి22 (ఆంధ్రజ్యోతి) : సాధారణ రోజుల్లో బయటకు వెళ్లే ముందు ఒకసారి గూగుల్‌ మ్యాప్‌లో ట్రాఫిక్‌ పరిస్థితిని తెలుసుకోవడం చాలా మంది చేస్తున్న పనే. వెళ్లాల్సిన గమ్యస్థానాన్ని ఎంత సమయంలో చేరుకోవచ్చు..? ఏయే మార్గాల్లో వెళితే త్వరగా చేరుకుంటారు..? ట్రాఫిక్‌ జామ్‌ ఎక్కడ ఉంటుంది..? ఇలా ఎన్నో విషయాలను క్షణాల వ్యవధిలోనే స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంది. అలాంటిది ‘జనతా కర్ఫ్యూ’ ప్రభావంతో ఆదివారం హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్‌ పరిస్థితిని గూగుల్‌ మ్యాప్‌లో చూస్తే.. అన్ని మార్గాల్లో గ్రీన్‌ మార్క్‌ మాత్రమే కనిపిస్తోంది. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగురోడ్డుతో పాటు దాని కోర్‌సిటీకి అనుసంధానంగా ఉన్న 8 జాతీయ రహదారులు, 6 రాష్ట్ర రహదారులు, 38 రేడియల్‌ రోడ్లు, వీటికి తోడు నగరం చుట్టూ ఉన్న ఇన్నర్‌ రింగు రోడ్డు, ప్రధాన రహదారులు, కాలనీల్లోని అంతర్గత రహదారులు అన్నీ ఖాళీగా కనిపించాయి.


దీంతో గూగుల్‌ మ్యాప్‌లో ఏ రహదారిలో చూసినా గ్రీన్‌ మార్క్‌(ట్రాఫిక్‌ అసలే ఉండని రోడ్డు మార్గం) చూపిస్తోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశమంతటా జరిగిన ‘జనతా కర్ఫ్యూ’ నూటికి నూరు శాతం విజయవంతమైంది. అందుకు గూగుల్‌ మ్యాప్‌ శాటిలైట్‌ చిత్రాలే నిదర్శనం. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్లపైకి ప్రజలు రాలేదు. పోలీసులు, మీడియా, అత్యవసర సేవలకు సంబంధించిన వారే తప్ప మరెవరూ రోడ్లపై కనిపించలేదు. ఇది కేవలం హైదరాబాద్‌ మెట్రో నగరానికి మాత్రమే పరిమితం కాకుండా.. దేశంలోని ముంబాయి, బెంగళూరు, చెన్నె వంటి మెట్రో నగరాల్లోనూ గూగుల్‌ మ్యాప్‌లో ట్రాఫిక్‌ ఉండే మార్గాలన్నీ ఖాళీగా ఉన్నట్లు సూచిస్తూ గ్రీన్‌ మార్క్‌ మాత్రమే కనిపించింది. ఇంతకు ముందు మెట్రో నగరాల్లో అయితే పగలు, రాత్రి అనే తేడా లేకుండా రోడ్ల మీద ట్రాఫిక్‌ విపరీతంగా ఉండేది. 


ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగానే...

కరోనా వైరస్‌ మహమ్మారి ఒక నగరాన్నో, రాష్ట్రాన్నో, దేశాన్నో కాదు.... యావ త్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు బంద్‌ పాటిస్తున్నాయి. ఇంట్లోని ఎవరూ బయటకు వెళ్లకుండా స్వీయ నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే ప్రజలంతా సహకరిస్తూ రోడ్లమీదకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితులు అత్యవసర సమయాల్లోనే కనిపిస్తాయని చెప్పవచ్చు. కరోనా వైరస్‌ మూలంగా నేడు హైదరాబాద్‌ మహానగంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్‌ పాటించడంతోనే ఇది సాధ్యమైంది.

Updated Date - 2020-03-23T09:26:47+05:30 IST