గ్రేటర్‌లో ఫలితాలపై పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2020-12-05T13:06:59+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చి బీజేపీ సాధించిన విజయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

గ్రేటర్‌లో ఫలితాలపై పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదీ..

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చి బీజేపీ సాధించిన విజయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన  ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసేన పార్టీ శ్రేణుల తరఫున అభినందనలు తెలియజేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక ధృఢ సంకల్పంతో పోరాడి ప్రజల మనసులను గెలుచుకున్న బీజేపీ అధినాయకత్వానికీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా మరో విజయాన్ని అందుకున్న బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ కె. లక్ష్మణ్,  బీజేపీ కార్యకర్తలకు శుభాభినందనలు తెలిపారు. బీజేపీ సాధించిన 48 స్థానాలు ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న భావనకు ఒక బలమైన సంకేతమన్నారు. గెలుపునకు వ్యూహ రచనలో బీజేపీ రాష్ట్ర నాయకులు చూపిన చొరవ, తెగువ ఆ పార్టీని విజయపదాన నడిపించాయని పవన్ పేర్కొన్నారు. ఇంటింటికీ తిరిగి శ్రమకోర్చి చేసిన ప్రచారం ఈ రోజున ఫలితాన్నిచ్చిందన్నారు. బీజేపీ విజయానికి జనసైనికుల కృషి కూడా తోడవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. 
60 స్థానాల్లో పోటీకి సిద్ధమైన జనసైనికులు బీజేపీ కోసం పోటీ నుంచి విరమించుకోవాలని కోరినప్పుడు వారి భవిష్యత్తును సైతం పక్కన పెట్టి బీజేపీ ప్రచారంలో మమేకమైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. జనసైనికులు రాజకీయ భవిష్యత్తుకు భరోసాగా ఉంటానని నిండైన మనసుతో హామీ ఇచ్చారు.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా జనసేన పార్టీకి, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. బీజేపీతో భవిష్యత్తులో పరస్పర సహకారంతో కలిసి తెలంగాణలో కూడా పని చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-05T13:06:59+05:30 IST