పవన్‌తో బండి సంజయ్ భేటీ.. ఏం తేల్చబోతున్నారు..?

ABN , First Publish Date - 2020-11-19T21:45:56+05:30 IST

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ వైఖరి ఆ పార్టీ శ్రేణులకు అంతుబట్టడం లేదు. ఏపీలో మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేన గ్రేటర్ ఎన్నికల్లో...

పవన్‌తో బండి సంజయ్ భేటీ.. ఏం తేల్చబోతున్నారు..?

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ వైఖరి ఆ పార్టీ శ్రేణులకు అంతుబట్టడం లేదు. ఏపీలో మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేన గ్రేటర్ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. అయితే.. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ వైఖరిపై గందరగోళం నెలకొంది. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోకపోవడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. గతంలో ఏపీలో ప్రచారం సందర్భంగా.. రాష్ట్రాన్ని విడగొట్టినందుకు 11 రోజులు అన్నం తినలేదని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమకు తెలంగాణలో రాజకీయంగా నష్టం చేసే అవకాశం ఉందని, పవన్ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ ప్రచారాస్త్రంగా మలుచుకునే అవకాశం ఉందని భావించిన తెలంగాణ బీజేపీ జనసేనతో పొత్తుపై వెనక్కి తగ్గిందని ప్రచారం జరిగింది.


తెలంగాణ బీజేపీ వైఖరి తేలిపోవడంతో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధంగా ఉందని స్పష్టం చేయడమే కాకుండా, ఆసక్తి కలిగిన అభ్యర్థుల బయోడేటా స్వీకరించే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. తెలంగాణలో ‘మీకు మీరే.. మాకు మేమే’ అని బీజేపీ, జనసేన శ్రేణులు ఫిక్స్ అయి గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న వేళ పరిణామాలు అనూహ్యంగా మారాయి. తాజాగా తెలంగాణలో బీజేపీ, జనసేన తమ వైఖరిని మార్చుకున్నాయి. ఏపీలో మాదిరిగానే గ్రేటర్ ఎన్నికల్లో కూడా స్నేహ గీతాన్ని ఆలపించేందుకు సిద్ధమయ్యాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కలిసి ముందుకెళ్లే అంశంపై చర్చించనున్నారు. బండి సంజయ్ కాసేపట్లో పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం.. గ్రేటర్‌లో జనసేన, బీజేపీ పొత్తుపై ఓ స్పష్టత రానుంది.



Updated Date - 2020-11-19T21:45:56+05:30 IST