భారత్‌లో కరోనాకు చెక్ పెట్టడం అంత సులభం కాదు.. బ్రిటన్‌లోని ఎన్నారై డాక్టర్ వ్యాఖ్యలివీ..!

ABN , First Publish Date - 2020-04-14T16:43:34+05:30 IST

‘‘బ్రిటన్‌లో కరోనా తీవ్రత భయానకంగా ఉంది. సరైన రక్షణ పరికరాలు లేకుండానే కొవిడ్‌ బాధితులకు వైద్యులు సేవలందించాల్సి వస్తోంది. ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టినా చైనా,

భారత్‌లో కరోనాకు చెక్ పెట్టడం అంత సులభం కాదు.. బ్రిటన్‌లోని ఎన్నారై డాక్టర్ వ్యాఖ్యలివీ..!

బ్రిటన్‌ పరిస్థితీ అలాగే ఉంది

రక్షణ పరికరాల కొరత తీవ్రంగా ఉంది

మే ఆఖరుకు కరోనా తగ్గుముఖం పట్టొచ్చు

భారత్‌లో ముందస్తు లాక్‌డౌన్‌ హర్షణీయం

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ‘‘బ్రిటన్‌లో కరోనా తీవ్రత భయానకంగా ఉంది. సరైన రక్షణ పరికరాలు లేకుండానే కొవిడ్‌ బాధితులకు వైద్యులు సేవలందించాల్సి వస్తోంది. ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టినా చైనా, ఇటలీ తరహాలో కొవిడ్‌ మరోసారి విజృంభిస్తే పరిస్థితి చేయిదాటి పోతుంది’’ అని అంటున్నారు బ్రిటన్‌లో సీనియర్‌ ఫిజీషియన్‌గా సేవలు అందిస్తున్న ప్రవాసీ వైద్యుడు యర్రగుంట్ల సోమశేఖర్‌.  బ్రిటన్‌లో కరోనా విజృంభిస్తున్న తీరును ‘ఆంధ్రజ్యోతి’కి ఆయన ఫోన్‌లో వివరించారు.


బ్రిటన్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉందా?

లక్షలాది మంది కరోనా బారిన పడడం, వేలాది మంది మరణించడం, చివరకు దేశ ప్రధానే వ్యాధి బారిన పడడం బ్రిటన్‌ ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఉన్న ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. కేసులు ఇంకా పెరిగితే సరైన వైద్య సేవలు కూడా అందించలేమేమో.


మీరు ఎంతకాలంగా బ్రిటన్‌లో వైద్యసేవలు అందిస్తున్నారు?

నేను కర్నూల్‌లో మెడిసిన్‌ చదివాను. పన్నెండేళ్లుగా బ్రిటన్‌లో వైద్యసేవలు అందిస్తున్నాను. ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌ వర్సిటీకి అనుబంధంగా ఉన్న ఆస్పత్రిలో సేవలందిస్తున్నాను. నా భార్య యార్లగడ్డ సాయిలక్ష్మి ఇక్కడే పీడియాట్రిషియన్‌గా సేవలందిస్తోంది. ఇప్పుడు అన్ని ఆస్పత్రుల్లో హార్ట్‌, డయాబెటిస్‌ వంటి స్పెషాలిటీ డాక్టర్లు కూడా తప్పనిసరిగా కరోనా బాధితులకే సేవలు అందిస్తున్నారు.


కరోనా కట్టడికి బ్రిటన్‌ ఏం చర్యలు తీసుకుంటోంది?

ఫిబ్రవరి నుంచే కరోనా కేసులు వెలుగు చూసినా, మార్చి ప్రారంభం నుంచే ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టింది. నేను పనిచేసే ఎన్‌హెచ్‌ఎస్‌ ఆస్పత్రి కరోనా కేసులకు కేంద్ర బిందువుగా ఉంది. ఈ ఆస్పత్రిలో రోజూ 50 నుంచి 60 మంది కరోనాతో మరణిస్తున్నారు. మే నెలాఖరుకు కరోనా తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.


బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించారా?

భారత్‌లోలాగా ఇక్కడ అధికారికంగా లాక్‌డౌన్‌ ప్రకటించనప్పటికీ కొవిడ్‌ తీవ్రతతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రస్తుతం ఈస్టర్‌ సెలవులు కొనసాగుతున్నాయి. విద్యాసంస్థలు, కార్యాలయాలకు ఎలాగూ మూడు వారాలు సెలవులే. ఆ తర్వాత ఏం చేయాలనే అంశంపై బ్రిటన్‌లో రెండు రకాల వాదనలున్నాయి. లాక్‌డౌన్‌ ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని.. అధికారికంగా అలాంటి నిషేధాలు విధించకూడదని ఒక వర్గం వాదిస్తోంది. ఆర్థిక అంశాల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని.. భారత్‌ తరహాలో లాక్‌డౌన్‌ విధించాలని మరో వర్గం భావిస్తోంది. కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా బ్రిటన్‌లో మే నెలాఖరు వరకూ ఆంక్షలు కొనసాగుతాయని నా అభిప్రాయం.


భారత్‌లో లాక్‌డౌన్‌ విధించడాన్ని మీరు సమర్థిస్తారా?

ఇది మంచి నిర్ణయం. వైద్య సౌకర్యాలు తక్కువగా ఉన్న భారత్‌లో కరోనా వంటి మహమ్మారిని అడ్డుకోవడం అంత తేలిక కాదు. సరైన సమయంలో భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడం హర్షణీయం. వైద్య సౌకర్యాల పరంగా ముందంజలో ఉన్న బ్రిటన్‌లోని ఆస్పత్రులు కరోనా పరీక్షల కిట్లు, మాస్కులు, శానిటైజర్లు తదితర వైద్య పరికరాల కొరతతో అల్లాడిపోతున్నాయి. లాక్‌డౌన్‌ విధించకపోతే భారత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయమేస్తోంది.


ఇండియాలో కరోనా పరిస్థితిపై మీ అంచనా ఏమిటి?

కేసుల సంఖ్య నానాటికీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌ ప్రకటించడం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా కట్టడిపై పూర్తిగా దృష్టి సారించడం అభినందనీయం. ఒకవేళ తాత్కాలికంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, మే నెలాఖరు వరకూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చైనా, ఇటలీ తరహాలో కరోనా మరోసారి విజృంభించే ప్రమాదం ఉంది.

- స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-04-14T16:43:34+05:30 IST