సూసైడ్ స్పాట్@ ఇంటర్నెట్
ABN , First Publish Date - 2020-02-21T23:42:00+05:30 IST
వైద్య విద్యార్థిని మత్తు ఇంజక్షన్‌తో బలవన్మరణం పొందింది. ఐటీ ఉద్యోగి నైట్రోజన్ వాయువు పీల్చుకుని ప్రాణాలు వదిలాడు. ఇంజనీరింగ్ విద్యార్థి ఆక్సిజన్ సిలిండర్ ఉపయోగించి మరణాన్ని ఆహ్వానించాడు.
పెరుగుతున్న ప్రమాదకర ధోరణి
ఆత్మహత్యకు సులువైన మార్గం కోసం వెతుకులాట
నొప్పిలేని బలవన్మరణం కోసం ఫ ఒత్తిడితో ప్రాణం తీసుకుంటున్న యువత
మార్గాల కోసం వెతుకులాట
వైద్య విద్యార్థిని మత్తు ఇంజక్షన్‌తో బలవన్మరణం పొందింది. ఐటీ ఉద్యోగి నైట్రోజన్ వాయువు పీల్చుకుని ప్రాణాలు వదిలాడు. ఇంజనీరింగ్ విద్యార్థి ఆక్సిజన్ సిలిండర్ ఉపయోగించి మరణాన్ని ఆహ్వానించాడు. ఓ యువకుడు డ్రగ్స్ ఎక్కువగా తీసుకొని కోమాలోకి వెళ్లి మృతి చెందాడు. ప్రస్తుతం ఆత్మహత్యకు పాల్పడేవారు ఎటువంటి శారీరక బాధ అనుభవించకుండా మరణించాలనుకుంటున్నారు. ఇందుకోసం ఇంటర్నెట్‌లో సులువైన పద్ధతులు వెతుకుతున్నారు. ఇలాంటి వారిని కుటుంబ సభ్యులు ముందే గుర్తించి వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించి, సైకాలజిస్ట్‌ను కలిస్తే మంచి ఫలితాలు ఉంటాయని మానసిక వైద్యులు చెబుతున్నారు.
బంజారాహిల్స్ (ఆంధ్రజ్యోతి): వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడేవారు మూడు ప్రధాన మార్గాలను ఎంచుకుంటారు. ఎత్తు నుంచి దూకటం, ఉరేసుకోవడం, వేగంగా వచ్చే రైలుకింద పడటం. చాలామంది క్షణికావేశంలో ఇలా చేసుకుంటారనుకుంటారు. ఇది పొరపాటు అంటున్నారు మనస్తత్వ నిపుణులు. ఎందుకంటే... గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన వారు అవకాశం వచ్చినప్పుడు మరోసారి సూసైడ్ చేసుకోవాలనే భావిస్తారు. ఆ సమయంలో వారి దృష్టి మళ్లించి ఓదార్పునిస్తే చాలంటున్నారు సైకియాట్రిస్టులు.
లక్ష పేజీల సమాచారం
ఆత్మహత్యకు పాల్పడేవారు ఎలాంటి బాధను అనుభవించకుండా మరణించాలని అనుకుంటున్నారు. ఇందుకోసం ఇంటర్నెట్‌లో సులువైన పద్ధతులు వెతుకుతున్నారు. ఇంటర్నెట్‌లో ఏకంగా లక్ష పేజీల సమాచారం ఉందంటున్నారు టెకీలు. నైట్రోజన్ పీల్చటం ద్వారా మత్తులోకి జారుకుంటారు. క్రమంగా అంతర్గత అవయవాలు పనిచేయకుండాపోతాయి. నిద్రలోనే ప్రాణాలు వదలుతారు. అటువంటి టెక్నిక్స్ అన్నీ అధిక శాతం యువత ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటున్నారు. వాటికి అవసరమైన సామాను దొరికే ప్రదేశాలు వెతుకుతున్నారు. చివరకు జీవితాన్ని అర్ధాంతరంగా వదిలేస్తున్నారు. కన్న వారికి, నమ్ముకున్న వారికి తీరని వేదనను మిగులుస్తున్నారు. బలవన్మరణం చేసుకోవడం నేరం. దీనికితోడు ఇంటర్నెట్‌లో వెతికి సులువుగా చావాలనే భావన యువతలో కలగడం సమాజాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. చనిపోవాలనుకుంటున్నప్పుడు క్షణం ఆగి ఆలోచిస్తే ఎవరూ ఆత్మహత్య చేసుకోరు అనేది నిన్నటి వరకు అందరూ అనుకునే వారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న వరుస ఘటనలను చూస్తే ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రీ ప్లాన్ చేసుకుంటున్నారంటే పరిస్థితి చేయి దాటి పోతోందని నిపుణులు అంటున్నారు. మానసిక ఒత్తిడి, ప్రేమికురాలు మోసం చేసింది అనే చిన్నపాటి విషయాలకే చాలామంది బలవంతంగా ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నట్టు ఓ స్వచ్ఛంద సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో తేలింది. ఇబ్బంది లేకుండా చనిపోవాలని యువత అనుకోవడంతో వారి మానసిక పరిస్థితి వైద్య నిపుణులకు కూడా అంతుబట్ట లేని విధంగా తయారైంది.
సినిమాలు, ఇంటర్నెట్...
డిప్రెషన్‌లో రెండు విధానాలు ఉంటాయి. మెదడులో ఒత్తిడి పెరగడం వల్ల చాలామంది ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకు వస్తారు. ఇది ప్రారంభ దశ. దీన్ని సకాలంలో గుర్తిస్తే సైకో థెరఫీతో ఆలోచన నేపథ్యం మార్చవచ్చు. మరొకటి సూసైడల్ పాత్‌వే. ఇలాంటి ఆలోచనలు ఉన్న వారు ఆత్మహత్య చేసుకునేందుకు దారులు వెతుకుతుంటారు. నొప్పి లేకుండా ఉండాలని కొందరు, మంటల్లో కాలిపోవాలని మరికొందరు ఇలా ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. నొప్పి కలగకుండా ఉండే ఆత్మహత్య సాధనాల కోసం యువత వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోవాలి అనే దృక్పథంతో ఉన్న వారు కొన్ని రకాల వీడియోలు చూసి వాటికి కనెక్ట్ అవుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ఉదాహరణకు... గణేశ్ విషయానికి వస్తే.. ‘నేనూ నా రాక్షసి’ సినిమా చూసి అదే విధంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మరికొన్ని విషయాలు తెలుసుకునేందుకు ఇంటర్నెట్, యూట్యూబ్‌లో వీడియోలు చూశాడు. వాటిని అమలు చేసి కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. కొంతమంది మత్తు పదార్థాలు తీసుకొని నిద్రలో ప్రాణాలు వదిలేందుకు సిద్ధమవుతున్నారు.
యూట్యూబ్‌లో ఇన్ని వీడియోలా?
ఎటువంటి నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకోవడం ఎలా అనే అంశంపై అనేక వీడియోలు యూ ట్యూబ్‌లో ఉండటం కలవర పెట్టే విషయం. గతంలో సంజీవరెడ్డినగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఓ టెకీ తన ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. పది రోజులపాటు యూట్యూబ్ చూసి చివరకు ఉపిరి ఆడకుండా ఉండేలా ముఖానికి కవర్ కట్టుకొని చనిపోయాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. మత్తు పదార్థాలు ఎలా పనిచేస్తాయి, ఎంత మోతాదు తీసుకుంటే మనిషి చనిపోతాడు అనే అంశాలపై కూడా ఇంటర్నెట్‌లో సమాచారం ఉంది. వీటి నేపథ్యంలోనే సినిమాల్లో కూడా మత్తు పదార్ధాలు తీసుకొని చనిపోయే విధానాలు చూపించడంతో వాటిని ప్రేరణగా తీసుకొని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.
భయం పెరగడమే కారణమా...?
పోటీ ప్రపంచంలో అందరూ పరుగెత్తాల్సిందే. ఉన్నత శిఖరాలు అందుకోవాలనుకునే వారు పోటీల్లో రాణిస్తారు. మిగతా వారు నిదానంగానైనా లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇందుకోసం అనేక వ్యయప్రయాసలకు గురికావాల్సి ఉంటుంది. ఇలాంటి ఒత్తిడిని తట్టుకోలేని వారు మానసిక రుగ్మతకు లోనవుతారు. అనుకున్న లక్ష్యం చేరుకోలేవేమో అనే భయం వారిని వెంటాడుతుంది. సహజంగా ఇది మెదడుపై ఒత్తిడి పెంచుతుంది. రసాయనాలు తగ్గిపోతాయి. దీంతో డిప్రెషన్‌కు గురవుతారు. ఇలాంటి వారిని ముందే గుర్తించి కుటుంబ సభ్యులు ఆత్మస్థైర్యంతోపాటు సైకాలజి్‌స్టను కలిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సమస్య మూలం తెలుసుకొని దానికి తగిన చికిత్స అందిస్తే ఎలాంటి వారెనా డిప్రెషన్ నుంచి బయటపడతారని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి మత్తు పదార్థాలు, విషపు వాయువులు అమ్మే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే వాదన కూడా తెరపైకి వస్తోంది. కొంపల్లిలో ఓ విద్యార్థి డ్రగ్స్ ఎక్కువ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి డ్రగ్స్‌పై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టినా అవి సాధారణ ప్రజలకు కూడా ఎప్పుడుపడితే అప్పుడు లభించడం ఆందోళన కలిగిస్తున్న విషయమని నిపుణులు అంటున్నారు. ఇంటర్నెట్‌లో ఇలాంటి విషయాలపై నియంత్రణ ఉంటే బాగుంటుందనే వాదని వినిపిస్తోంది.
ఈసీటీ చికిత్సతో తాత్కాలిక ఉపశమనం
ఆత్మహత్య చేసుకోవాలనే దృక్పథంతో ఉన్న వారికి కౌన్సెలింగ్‌తోపాటు ఎలకో్ట్రకన్వల్సివ్ థెరపీ(ఈసీటీ) శస్త్ర చికిత్స చేయాలి. లేకపోతే ఇలాంటి మానసిక రుగ్మతతో బాధపడే వారు ఆత్మహత్య చేసుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. ఎలాగైనా చనిపోవాలనే లక్ష్యంతో ఉండే వీరికి ఆపరేషన్ థియేటర్‌లో ఈసీటీ శస్త్ర చికిత్స చేయడంవల్ల తాత్కాలిక ఉపశనం లభిస్తుంది. అనంతరం క్రమ తప్పకుండా మందులు, కౌన్సెలింగ్, ఇతర థెరపీలతో ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడేయొచ్చు. నేను ఏం సాధించలేను అని డిప్రెషన్‌కు లోనైన వారిని వీలైనంత త్వరగా సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లడం మేలు
మానసిక ఒత్తిడి ఉంటే ఇతరులతో పంచుకోవాలి
మానసిక ఒత్తిడి ఉన్నవారు ఆత్మహత్య చేసుకొని అందరినీ బాధపెట్టే కన్నా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇతరులతో పంచుకుంటే మేలు జరుగుతుంది. నగరంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలులో ఉంది. ఎవరైనా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసులతో పంచుకోవచ్చు. నేరానికి సంబంధించినది కాకపోయినప్పటికీ మేము సమస్య వింటాం. దానికి పరిష్కార మార్గాలు సూచిస్తాం. ప్రాణం నిలబెట్టడం కూడా మా కర్తవ్యం. గణేశ్ లాంటి యువకులు సమాజానికి ఎంతో అవసరం. ఇలాంటి వారు ఆత్మహత్య చేసుకోవడం కలవరపెట్టే అంశమే.
- కేఎస్ రావు, బంజారాహిల్స్ ఏసీపీ
ముందస్తు పథకాలు
మారుతున్న జీవన శైలితోపాటు మెదడులో కదలికలలో కూడా మార్పులు వస్తున్నాయని మానసిక నిఫుణులు అంటున్నారు. గతంలో ఆత్మహత్య చేసుకునే వారికి భరోసా ఇస్తే ఆ ఆలోచన నుంచి బయటపడేవారంటున్నారు. ప్రస్తుతం ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందే తడవు దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు ఆరంభిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రేమ వైఫల్యం, పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, వేధింపులు ఇలా అనేక సమస్యలు అందరికీ ఉంటాయి. మానసిక రుగ్మతలు ఉన్నవారు మాత్రమే ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతుంటారు. మెదడులో జరిగే రసాయనిక చర్య కారణంగా వారిలో ఓ రకమైన ఒత్తిడే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో మార్పు రావాలంటే వైద్యంతోనే సాధ్యమవుతుందంటున్నారు. లేదంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిన వారు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని అంటున్నారు.
ప్రణాళిక ప్రకారం...
ఉదాహరణకు... ఓ మధ్య తరగతికి చెందిన వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. చేసే పనికి వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో తాను ఎందుకు పనికి రాను అనే అపోహ అతడిలో నెలకొంది. భార్యాపిల్లలను సుఖపెట్టాలని భావించాడు. ఇందుకోసం ఓ పథకం వేశాడు. ఈ మేరకు భార్య పేరిట జీవిత బీమా పథకం తీసుకున్నాడు. మొదటి సంవత్సరం ఆత్మహత్య చేసుకుంటే డబ్బులు రావని రెండేళ్లపాటు వేచి చూశాడు. ఓ రోజు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలో ఇటీవల చోటుచేసుకుంది. ఫిలింనగర్‌కు చెందిన గణేశ్ కూడా ఇదే తరహాలో ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోతే ఎలా ఉంటుందనే ఆలోచనతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. మూడు రోజులు ముందుగానే చనిపోయేందుకు సరంజామా సిద్ధం చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో ఇలా పథకం వేసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.