ప్రశాంతంగా పరీక్షలు రాయండి

ABN , First Publish Date - 2020-03-04T08:09:23+05:30 IST

ఇంటర్‌ విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని, సమయపాలన పాటించాలని ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని సూచించారు

ప్రశాంతంగా పరీక్షలు రాయండి

ఆత్మవిశ్వాసం, సమయపాలన అవసరం

ఇంటర్‌ విద్యార్థులకు సీపీల సూచన


హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని, సమయపాలన పాటించాలని ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని సూచించారు రాచకొండ, సైబరాబాద్‌ సీపీలు మహేష్‌ భగవత్‌, వి.సి. సజ్జనార్‌. బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు తగు సలహాలు, సూచనలు చేశారు. విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు, టీచర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రతి విద్యార్థి నిండైన ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పరీక్షలే జీవితం కాదని, అవి జీవితంలో ఒక భాగం మాత్రమే అని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. 


 సమయ పాలన చాలా ముఖ్యం... వి.సి.సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రం చిరునామా తెలుసుకోవాలి. దాంతో   సమయం వృథా కాకుండా సరైన సమయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. 


పరీక్ష రోజున గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.


ఎక్కువ మంది పరీక్ష రోజు హడావిడిలో హాల్‌ టికెట్లను మర్చిపోతుంటారు. అలా కాకుండా పరీక్షకు అవసరమైన పెన్నులు, పెన్సిల్‌, ప్యాడ్‌, హాల్‌ టికెట్‌ తదితర వస్తువులను ఒకే చోట ఉంచుకోవడం ఉత్తమం. 


పరీక్ష ముందు రోజు నిద్ర మాని చదవడం మంచిది కాదు. చదివింది అర్థం చేసుకోవాలంటే తగినంత నిద్ర అవసరమని గుర్తించాలి. లేదంటే పరీక్ష కేంద్రంలో నిద్రపోయే అవకాశం ఉంది. నిద్రలేమి కారణంగా జ్ఞాపకశక్తి మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. 


కళ్లపై ఒత్తిడి పడకుండా చల్లని నీళ్లతో కళ్లను శుభ్రం చేసుకోవాలి. 


తగినంత నిద్రతో పాటు పోషక విలువులున్న ఆహారం తీసుకోవాలి.


హెవీ ఫుడ్‌ తీసుకోవద్దు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో తేలికగా జీర్ణమయ్యే లైట్‌ ఫుడ్‌ను తీసుకోవాలి.


జంక్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. మసాలాలు తినొద్దు, ఉప్పు తక్కువగా తీసుకోవాలి.


ఇంట్లో ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి


సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి...  మహేష్‌ భగవత్‌, రాచకొండ సీపీ

పరీక్షలు ముగిసేంత వరకు విద్యార్థులు సెల్‌ఫోన్లు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి.


టీలు, కాఫీలకు బదులు మంచినీరు ఎక్కువగా తాగడం మంచిది. 


ఎండలు ఎక్కువగా ఉన్నందున డీహైడ్రేషన్‌ బారిన పడకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, తర్బూజ, ఆరెంజ్‌ పండ్లు తీసుకుంటే మంచిది.


ఉదయం తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. తద్వారా మెదడు చురుగ్గా ఉంటుంది. 


పరీక్ష రోజున కొత్త విషయాలను చదవకపోవడం మంచిది. పరీక్ష ప్రారంభమయ్యే చివరి నిమిషం వరకూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. దానికన్నా.. ఇది వరకే చదివిన వాటిని మననం చేసుకోవడం ఉత్తమం. 


తల్లిదండ్రులకు సూచనలు 


పిల్లలు పరీక్ష రాసే విషయంలో తల్లిదండ్రుల సంరక్షణ కీలకమని గుర్తించాలి.


పక్కవారితో మీ పిల్లలను పోల్చరాదు. ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది అని గుర్తించాలి. 

 పిల్లలు చదువుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించాలి. ఎక్కువ శబ్ధంతో టీవీలను చూడొద్దు.


ఇంట్లో భార్యాభర్తల గొడవలు విద్యార్థుల చదువుపై ప్రతికూలత చూపుతాయి. గొడవలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 


పరీక్షలు రాసే విద్యార్థులకు సమయానుకూలంగా ఆహారం ఇవ్వాలి. సమయానుసారం నిద్రపోయేలా చూడాలి.

 

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


రూట్‌ పాస్‌ విద్యార్థులకు ఉచిత ప్రయాణం


హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పరీక్ష సమాయానికి అణుగుణంగా  బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రూట్‌ బస్‌పాస్‌ కలిగిన విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. బస్‌పాస్‌ లేని విద్యార్థులు సాధారణ చార్జీతో బస్సుల్లో ప్రయాణించాలని పేర్కొన్నారు. ఇబ్బందులు తలెత్తితే 99592 26160, 99592 26154లో సంప్రదించాలని ఆయన సూచించారు.

Updated Date - 2020-03-04T08:09:23+05:30 IST