కంటైన్మెంట్‌ కట్టుదిట్టం

ABN , First Publish Date - 2020-04-14T10:46:41+05:30 IST

నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ముందస్తుగా ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ ఏరియాల్లో అధికారులు

కంటైన్మెంట్‌ కట్టుదిట్టం

పెరుగుతున్న కేసులు

పాజిటివ్‌ బాధితుల కుటుంబ సభ్యుల ఇబ్బందులు


(ఆంధ్రజ్యోతి, సిటీన్యూస్‌ నెట్‌వర్క్‌): నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ముందస్తుగా ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ ఏరియాల్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.  సోమవారం షేక్‌పేట కంటైన్మెంట్‌ జోన్‌లోని బృందావన్‌కాలనీ, ఆదిత్యనగర్‌, అజీజ్‌బాగ్‌లో 9 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. విజయనగర్‌కాలనీ కంటైన్మెంట్‌లో 1, ఆసిఫ్‌నగర్‌ ఓల్డ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌లో 1, మాసబ్‌ట్యాంక్‌లో 1, కాంటినెంటల్‌ హోటల్‌ వెనకాల ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌లో 1 కేసు నమోదైంది. పాజిటివ్‌ ఉన్న వాళ్ల ఇళ్ల కిటికీలు, తలుపులు తెరిస్తే చుట్టుపక్కల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


హబ్సీగూడలోని కాకతీయనగర్‌ కంటైన్మెంట్‌ను మునిసిపల్‌ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి పర్యావేక్షించారు. ఇక్కడ 75 ఇళ్లలో ఉండే వారికి అవసరమైన సరుకులను అధికారులు అందజేస్తున్నారు. పేదలు అధికంగా ఉండే గయేదిన్‌బాగ్‌లో లాక్‌డౌన్‌  కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. జీరా ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ బాధితులు, వారి కుటుంబ సభ్యులు నివసించే అపార్ట్‌మెంట్‌తోపాటు పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌ వారు కూడా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లారు. పాతబస్తీలోని హఫీస్‌బాబానగర్‌ కంటైన్మెంట్‌ జోన్‌లోని వారు సమీపంలోని కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్‌కు వెళ్లి కావాల్సిన సరుకులను కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు.


చిలకలగూడ పీఎస్‌ పరిధిలోని కంటైన్మెంట్‌ క్లస్టర్లను గోపాలపురం డివిజన్‌ ఏసీపీ వెంకటరమణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారాసిగూడ కౌసీర్‌మసీద్‌, బౌద్ధనగర్‌లో, శ్రీనివాస్‌నగర్‌ ఫ్రైడే మార్కెట్‌ వద్ద ఏర్పాటు చేసి కంటైన్మెంట్‌ క్లస్టర్ల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు, జీహెచ్‌ఏంసీ, ఆరోగ్యశాఖ సిబ్బందితో ఆయన మాట్లాడారు. కంటైన్మెంట్‌ క్లస్టర్లలో హోంక్వారంటైన్‌లో ఉన్న వారు ఎవ్వరూ బయటకు రాకుండా చూడా లన్నారు. ఆయన వెంట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి, అడ్మిన్‌ ఎస్సై రవికుమార్‌, ఎస్సై శ్రీనివాసరావు, రాజశేఖర్‌గౌడ్‌ ఉన్నారు. బల్కంపేటలోని ప్రకృతి చికిత్సాలయం ఎదుట ఉన్న ఈశ్వర్‌ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ఒకరికి కరోనా సోకడంతో ఇందులో ఉన్న 20 ప్లాట్లకు చెందిన 78మందిని హౌస్‌ క్వారంటైన్‌లో ఉంచారు.


మార్చిలో ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారికీ పరీక్షలు నిర్వహించి ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా, బయట వారు లోనికి రాకుండా బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. కరోనా వైర స్‌ సోకిన వ్యక్తికి నెగిటివ్‌ రిపోర్ట్‌ రాగా గత నెల 31న ఛాతీ వైద్యశాల నుంచి డిశ్చార్జ్‌ చేసి ఈశ్వర్‌ అపార్ట్‌మెంట్‌కు తీసుకువచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అపార్ట్‌మెంట్‌ వాసులందరినీ స్వీయ నిర్బంధంలో ఉంచి పలు వసతులు కల్పిస్తున్నారు. 

 

Updated Date - 2020-04-14T10:46:41+05:30 IST