సీఎం, మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే మాధవరం వినతి

ABN , First Publish Date - 2020-03-16T10:04:36+05:30 IST

సీఎం, మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే మాధవరం వినతి

సీఎం, మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే మాధవరం వినతి

కూకట్‌పల్లి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లిలోని గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(పాత ఐడీఎల్‌) కంపెనీని నగరానికి దూరంగా తరలించేలా చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన అసెంబ్లీలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రి కె. తారకరామారావులకు వినతిపత్రం అందజేశారు. ఐడీఎల్‌ కంపెనీ తయారు చేసే పేలుడు పదార్థాల కారణంగా స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఇప్పటికే కంపెనీలో తయారయ్యే పేలుడు పదార్థాల వల్ల పేలుళ్లు సంభవించి పదుల సంఖ్యలో ఉద్యోగులు మృతి చెందారని గుర్తు చేశారు. గతంలో కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు చుట్టూ ఉన్న ఖాళీ స్థలం ఉండేదని, ప్రస్తుతం వందల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు, కాలనీలు ఏర్పాటై వేలాదిమంది జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. తరచూ కంపెనీలో జరిగే పేలుళ్ల కారణంగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు సైతం దెబ్బతింటున్నాయని, ఎప్పుడు పేలుళ్లు సంభవిస్తాయో.. ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనన్న ఆందోళనలో స్థానిక కాలనీవాసులు ఉన్నారని వివరించారు. కంపెనీకి కేటాయించిన వందలాది ఎకరాలతోపాటు సమీపంలోని కొంత ప్రభుత్వ భూమిని కూడా కంపెనీ నిర్వాహకులు కబ్జా చేశారని, ఇటీవల నిర్వహించిన సర్వేలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి కంపెనీ అధీనంలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారని చెప్పారు. మరోసారి  ఈడీతో సర్వే చేయిస్తే ప్రభుత్వ భూమిని గుర్తించే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీని దూరంగా తరలించి ప్రజల్లో భయాందోళన తొలగించడంతోపాటు ఐడీఎల్‌ కంపెనీ అధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ స్థలంలో పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు,  ఇతర ప్రజా ప్రయోజనాలకు అవసరమైన నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు ఉపయోగించుకోవచ్చని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆ వినతిపత్రంలో కోరారు. 

Updated Date - 2020-03-16T10:04:36+05:30 IST