కొవిడ్‌ వచ్చే.. మూడ్‌ మారిపోయే..!

ABN , First Publish Date - 2020-03-04T07:45:02+05:30 IST

ఎక్కడో చైనా.. అనే నిర్లిప్తత. మన దగ్గరకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారులేనన్న భరోసా.. మన దగ్గర ఉష్ణోగ్రతలు ఎక్కువ కాబట్టి ఏమీ కాదులేనన్న ధీమా..

కొవిడ్‌ వచ్చే.. మూడ్‌ మారిపోయే..!

భయం గుప్పిట నగరవాసి

గేటెడ్‌ కమ్యూనిటీలలో ఆంక్షలు.. స్వచ్ఛతపై మరింత శ్రద్ధ

అవగాహన పెంచే దిశగా చర్యలు

హోలీ వేడుకలకు దూరం.. 

ఈవెంట్లపైనా కనిపిస్తున్న ప్రభావం


ఎక్కడో చైనా.. అనే నిర్లిప్తత. మన దగ్గరకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారులేనన్న భరోసా.. మన దగ్గర ఉష్ణోగ్రతలు ఎక్కువ కాబట్టి ఏమీ కాదులేనన్న ధీమా.. అన్నీ పటాపంచలు చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ వైరస్‌ నగరంలో అడుగుపెట్టింది. ఒక్కసారిగా కలకలం. తమకేమీ కాదులే అన్న నగరవాసి ఇప్పుడు కోవిడ్‌ పేరు చెబితేనే  వణికి పోతున్నాడు. అది వ్యాప్తి చెందకూడదని, త్వరగా అంతం కావాలని ప్రార్థనలు చేస్తున్నాడు. అదే సమయంలో తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నాడు. కోవిడ్‌కు విరుగుడు వ్యక్తిగత శుభ్రత అని గుర్తించడమే కాదు.. సమూహాలలో తిరగడం కూడా తగ్గించుకోవాలని అనుకుంటున్నారు. 


తెలంగాణలో మొట్టమొదటి కోవిడ్‌ కేస్‌ను హైదరాబాద్‌లో గుర్తించామని  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వెంటనే గేటెడ్‌ కమ్యూనిటీలలో ఆంక్షలూ ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల తీసుకోవాల్సిన చర్యలు, తమ ప్రాంగణాలలో అవగాహన మెరుగుపరచాల్సిన విధానాలపై తీవ్రంగా చర్చించడమూ చేస్తున్నారు. అంతేనా.. త్వరలో జరగనున్న హోలీ వేడుకలపై ఈ కోవిడ్‌ తీవ్ర ప్రభావమే చూపే అవకాశాలు లేకపోలేదంటున్నారు పలు ఈవెంట్ల నిర్వాహకులు. ఇప్పటి వరకూ పర్వాలేదనుకున్నట్లు సాగిన టిక్కెట్ల అమ్మకాలు ఒక్కసారిగా నీరసించిపోయాయని కొంతమంది నిర్వాహకులు చెబుతుండటం గమనార్హం.


 అవగాహన మెరుగుపరిచేలా ప్రచారం..

ఇప్పటికే హెచ్‌1ఎన్‌1 లాంటి వైర్‌సల ప్రభావాన్ని చవిచూసిన నగరవాసులు అంతకన్నా తీవ్రమైన కోవిడ్‌-19ను ఎదుర్కోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేయడం ఆరంభించారు. వ్యక్తిగత శుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వడం, అవసరమైతే తప్ప సమూహాలలో తిరగకపోవడం, జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులకు దూరంగా ఉండాలనే సోషల్‌ మీడియా ప్రచారాన్ని తు.చ. తప్పకుండా అనుసరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరీ ముఖ్యంగా గేటెడ్‌ కమ్యూనిటీలలో కోవిడ్‌ ప్రచార పత్రాలను అందరికీ కనబడేలా ప్రదర్శిస్తున్నారు. ఇక ల్యాంకో హిల్స్‌ లాంటి చోట్ల స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యతనిస్తూ తగిన ఏర్పాట్లనూ చేస్తున్నారు.


గతానికన్నా మిన్నగా ఈ అంశంపై దృష్టి సారించడం పెరిగిందని అక్కడి నివాసితులు చెబుతుంటే, ప్రత్యేకంగా తామేమీ ఇప్పటి వరకూ చర్యలు చేపట్టలేదని, ఎవరికి వారు తమదైన రీతిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెబుతున్నారు పెబల్‌సిటీ అధ్యక్షుడు చంద్రమోహన్‌. ఇవే కాదు.. మోదీ, లోథా, అపర్ణ.. ఇలా పలుచోట్ల నివాసితులు తమదైన రీతిలో తగు చర్యలు తీసుకోవడం కనిపిస్తుంది. కామన్‌ ప్లేసె్‌సను ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసేలా తగు చర్యలు తీసుకోవడంతో పాటుగా జలుబు లాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులను స్విమ్మింగ్‌ఫూల్స్‌లో దిగనీయకుండా చేయడం లాంటి చర్యలు తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నామని, మీటింగ్‌లో చర్చించి తగు రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఓ గేటెడ్‌ కమ్యూనిటీ సెక్రెటరీ వసంత్‌ తెలిపారు.

 

కొంపల్లిలోని అశోకా-అ-లా-మైసన్‌లో ఈసారి హోలీ వేడుకలను నిర్వహించాలా వద్దా అనే అంశంపై ఓ అభిప్రాయ సేకరణను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే తమ గేటెడ్‌ కమ్యూనిటీలో ఈ సారి ఎక్కువమంది వేడుకలను దూరం పెడదామనే చెబుతున్నారంటున్నారు అక్కడి నివాసి సుమంత్‌ మహాపాత్ర. మార్కెట్‌లో కూడా హోలీ సరంజామా అమ్మకాలు తగ్గాయనే చెబుతున్నారు వ్యాపారులు. సాధారణంగా రంగులు మొదలు వాటర్‌ గన్స్‌ వరకూ చైనా సరుకే కావడం.. ధరలు 20ుకు పైగా పెరగడం వంటి కారణాల చేత అమ్మకాలు ఆశించినంతగా లేవంటున్నారు వారు.

 హైదరాబాద్‌సిటీ, మార్చి 3, ఆంధ్రజ్యోతి స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం..అనురాగ్‌ కుమార్‌, ల్యాంకో హిల్స్‌,  మణికొండ

ఇప్పటి వరకూ మా గేటెడ్‌ కమ్యూనిటీలో కోవిడ్‌కు సంబంధించి డిస్‌ప్లే ఏమీ చేయడం లేదు. సాధారణ క్లీనింగ్‌ ప్రాసె్‌సను మాత్రం బాగా పెంచారు. స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గార్బేజ్‌ సూట్స్‌ లాంటివి గతంలో పిరియాడిక్‌ పద్ధతిలో జరిగితే ఇప్పుడు మాత్రం ప్రతి రోజూ జరుగుతున్నాయి. అలాగే సొసైటీలోకి ఇతరులు ప్రవేశించడంపై కూడా ఆంక్షలు విధించారు. గతంలోలా రోజూ వచ్చేవారిని సైతం ఫ్రీగా వదలడం కాకుండా సంబంధిత ఫ్లాట్‌ ఓనర్స్‌ అనుమతించిన తరువాత మాత్రమే అనుమతిస్తున్నారు. హోలీకి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Updated Date - 2020-03-04T07:45:02+05:30 IST