లాక్‌డౌన్‌కు సహకరించాలి

ABN , First Publish Date - 2020-03-24T09:35:31+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివారం పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సహకరించిన ప్రజలు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల వారిని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అభినందించారు.

లాక్‌డౌన్‌కు సహకరించాలి

మన కోసం.. దేశం కోసం జాగ్రత్త అవసరం

రోడ్లపై వాహనాల రాకపోకలను పరిశీలించిన కొత్వాల్‌ 

నిబంధనలు అమలు చేయాలని అధికారులకు సూచన

ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదని హెచ్చరిక

డీజీపీతో కలిసి చార్మినార్‌ను సందర్శించిన సీపీ 


హైదరాబాద్‌ సిటీ, మార్చి23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివారం పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సహకరించిన ప్రజలు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల వారిని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అభినందించారు. సోమవారం నుంచి ఈ నెల 31 వరకు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన లాక్‌డౌన్‌కు కూడా ప్రజలు సహకరించాలని సీపీ పిలుపునిచ్చారు. రాష్ట్ర డీజీపీ మీడియా సమావేశంలో విన్నవించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వ్యక్తిగతంగా, కుటుంబం, బస్తీ, నగరం, దేశ శ్రేయస్సు దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలన్నారు. స్వయానా రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం చార్మినార్‌ పీఎ్‌సను సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. 


నగరమంతా బందోబస్తు...

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31 వరకు విధించిన లాక్‌డౌన్‌ అమలు పర్చడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌ కొత్వాల్‌ నగరంలోని పలు ప్రాంతాలను తిరిగి పరిస్థితిని సమీక్షించారు. అదనపు సీపీలు, జాయింట్‌ సీపీలు, డీసీపీలు, అదనపు డీసీపీలతో పాటు హోంగార్డు స్థాయి వరకు సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. ఎక్కడికక్కడ వాహనాలను ఆపి కారణాలు అడగడం... అవసరం లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి వెనక్కి పంపడం చేస్తున్నారు. మళ్లీ చేస్తే వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్‌ అధికంగా కనిపించిన ప్రాంతాల్లో సీపీ అధికారులను మందలించారు. చార్మినార్‌ వద్ద స్వయానా డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్‌ పరిస్థితిని సమీక్షించారు. 

Read more