‘కరోనా’ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇవ్వండి

ABN , First Publish Date - 2020-03-16T10:18:33+05:30 IST

‘కరోనా’ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇవ్వండి

‘కరోనా’ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇవ్వండి

‘గాంధీ’లో విదేశాలకు వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్‌ చేసుకున్న అనుమానిత రోగులు


అడ్డగుట్ట, మార్చి15 (ఆంధ్రజ్యోతి): ‘కరోనా వైరస్‌ మా చావుకొచ్చింది. ఇదేం ఘోసరా బాబు..’ అంటూ వైరస్‌ అనుమానిత రోగులు హైరానా పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ నోడల్‌ కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఒకరు పాజిటివ్‌ కేసు ఉండగా.. ఇప్పటి వరకు 300 మందికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు ముందే విమాన టికెట్లు బుక్‌ చేసుకున్న హైదబాదీలు కరోనా వైద్య పరీక్షలు చేసుకొని ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే విమానం ఎక్కడానికి అనుమతి ఇస్తారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ అనుమానితులు పరీక్షలు చేసుకున్న అనంతరం తమకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు కావాలంటూ ఆస్పత్రి చుట్టూ తిరిగుతున్నారు. ఆదివారం పాతనగరానికి చెందిన ఓ వ్యక్తి గాంధీలో వైరస్‌ సాఽధారణ వైద్యం చేయించుకున్నాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం వేచి ఉన్నాడు. ఇలా రోజూ నలుగురు ఐదుగురు వ్యక్తులు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల కోసం కాపు కాస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని బాధిత రోగులు కోరుతున్నారు. 


ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లకు.. మాకు సంబంధం లేదు

గాంధీ ఆస్పత్రిలో కరోనా వైర్‌సపై వైద్యం మాత్రమే చేస్తాం. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం ఆందోళన కారులకు చెప్పాం. ఇక్కడ కేవలం వైద్య పరీక్షలు మాత్రమే చేస్తాం. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇవ్వం. 

 - ప్రొఫెసర్‌ శ్రవణ్‌ కుమార్‌, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌  


సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే దుబాయికి వెళ్లలేని పరిస్ధితి.. 

కరోనా భయంతో వృత్తి రీత్యా దుబాయికి వెళ్లలేకపోతున్నాం. అత్యవసరంగా కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నాం. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇప్పుడు అత్యవసరమైంది. లేదంటే దుబాయికి వెళ్లనివ్వరు. విమాన టికెట్‌ కోసం బుక్‌చేసుకున్న సమయంలో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ చూపించాల్సి వస్తుంది. రెండేళ్ల నుంచి దుబాయిలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. నాలుగు నెలల క్రితం ఇంటికి వచ్చాను. వీసా గడువు పూర్తి అయింది. మళ్లీ టికెట్‌ బుక్‌ చేసుకోవాలంటే సర్టిఫికెట్‌ ఎంతో అవసరం. గాంధీకి వస్తే ఇవ్వలేమని అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పడం లేదు. ప్రభుత్వం ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లపై ఓ నిర్ణయానికి వస్తే మంచిది. 

- ఖలీల్‌, కరోనా అనుమానిత వ్యక్తి, నాంపల్లి 

Updated Date - 2020-03-16T10:18:33+05:30 IST