లాక్‌డౌన్‌ను సమీక్షించిన హోంమంత్రి

ABN , First Publish Date - 2020-03-25T10:01:09+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హోంమంత్రి మహమూద్‌ అలీ పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం సరూర్‌నగర్‌ హుడాకాలనీ, ఎల్‌బీనగర్‌ రింగ్‌రోడ్డు ప్రాంతాలను...

లాక్‌డౌన్‌ను సమీక్షించిన హోంమంత్రి

ఎల్‌బీనగర్‌/మన్సూరాబాద్‌/అబ్దుల్లాపూర్‌మెట్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో హోంమంత్రి మహమూద్‌ అలీ పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం సరూర్‌నగర్‌ హుడాకాలనీ, ఎల్‌బీనగర్‌ రింగ్‌రోడ్డు ప్రాంతాలను సందర్శించారు. సరూర్‌నగర్‌లో వ్యాపారులతో మాట్లాడారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, అడిషనల్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌లతో మాట్లాడిన ఆయన లాక్‌డౌన్‌లో భాగంగా చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. క్రైమ్‌ డీసీపీ యాదగిరి, ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌రావు, ఎల్‌బీనగర్‌ ఏసీపీ పృథ్వీదర్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


పలుచోట్ల వాహనాల అడ్డగింత.. 

లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ కొందరు రోడ్లపైకి వాహనాలతో రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎల్‌బీనగర్‌ రింగ్‌రోడ్‌తో పాటు ఎల్‌పీటీ మార్కెట్‌ వద్ద రోడ్డుకు అడ్డుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన పలువురిని వెనక్కు పంపించారు. మంగళవారం వాహనాల సంఖ్య భారీగా తగ్గడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి జిల్లా సరిహద్దు కొత్తగూడెం చౌరస్తా వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనదారులను ఎక్కడికక్కడ ఆపేశారు. అత్యవసర సేవలు, నిత్యావసర సరుకుల సరఫరా  చేసే వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అయితే, వాహనాదారులు పెద్ద ఎత్తున్న తరలివస్తుండడం పోలీసులకు తలనొప్పిగా మారింది.


అక్కడ ట్రాఫిక్‌ జాం అవుతోంది. ఉదయం కొంత రద్దీ ఉన్నప్పటికీ మధ్యాహ్నం పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ పర్యవేక్షణలో ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్‌, సిబ్బంది విధుల్లో ఉన్నారు. పెద్దఅంబర్‌పేట్‌ చెక్‌పోస్టు వద్ద  పోలీసులు వాహనాలను నగరంలోకి అనుమతించకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికు లను  తరలిస్తున్న ఓ డీసీఎంను పోలీసులు సీజ్‌ చేశారు. విజయవాడ జాతీయ రహదారి హయత్‌నగర్‌ నుంచి పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగురోడ్డు వరకు పోలీసులు అడుగడుగునా బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి సరైన కారణాలు ఉంటేనే ముందుకు పంపిస్తున్నారు. పలుచోట్ల పికెట్లు ఏర్పాటు చేశారు. పెద్ద అంబర్‌ పేట వద్ద రోడ్డును పూర్తిగా మూసి వేశారు.   


కాలనీల్లోకి వెళ్లకుండా ముళ్ల కంచెలు

హయత్‌నగర్‌ డివిజన్‌లోని సీతారాంపురం కాలనీవాసులు ప్రధాన రోడ్డును మూసి వేశారు. ఇతరులు మా కాలనీలోకి రావొద్దంటూ రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేశారు. ఎల్‌బీనగర్‌ రాక్‌టౌన్‌ కాలనీలో రోడ్డుకు అడ్డంగా కర్రలను ఏర్పాటు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలో 18 గ్రామాలు ఉండగా, దాదాపు అన్ని గ్రామాలలో ప్రజలు మంగళవారం ప్రధాన రోడ్లకు అడ్డంగా ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. అత్యవసర పనులు ఉంటేనే గ్రామం నుంచి బయటకు పంపిస్తున్నారు. లష్కర్‌గూడ, బాటసింగారం, జాఫర్‌గూడ, మజీద్‌పూర్‌, అనాజ్‌పూర్‌, గండిచెరువు, అబ్దుల్లాపూర్‌మెట్‌, బలిజగూడ, కవాడిపల్లి తదితర గ్రామాల్లో రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచెను ఏర్పాటు చేశారు.


Updated Date - 2020-03-25T10:01:09+05:30 IST